Share News

Education Department Report: పేరుకే ప్రైవేటు డాబు

ABN , Publish Date - May 27 , 2025 | 03:45 AM

రాష్ట్రంలోని 9,953 ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒక్కటికీ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ లభించలేదు. అత్యంత నాసిరక వసతులతో ఉన్న పాఠశాలలే అధికంగా ఉండగా, ఫీజుల్లో మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

 Education Department Report: పేరుకే ప్రైవేటు డాబు

  • వసతుల కల్పనలో ప్రైవేటు స్కూళ్లు అంతంతే

  • రాష్ట్రంలో ఒక్క స్కూల్‌కూ దక్కని ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌

  • నాలుగు స్టార్లు ఉన్నవీ చాలా తక్కువే

  • 95 బడుల్లో అత్యంత ఘోర ప్రమాణాలు

  • అంతంతమాత్రంగా ఉన్న బడులు 3,420

  • మధ్యస్థంగా ప్రమాణాలు ఉన్నవి 5,730

  • అయినా ఫీజుల్లో వెనక్కి తగ్గని వైనం

  • విద్యాహక్కు ఫీజుల కోసం ఇన్‌ఫ్రాపై పాఠశాల విద్యా శాఖ వివరాల సేకరణ

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల సంఖ్య 9,953

  • వాటిలో ఒక్కటి కూడా ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ సాధించలేదు.

  • అత్యంత నాసిరకంగా వసతుల ప్రమాణాలున్న 95 పాఠశాలలకు సింగిల్‌ స్టార్‌ రేటింగ్‌ మాత్రమే దక్కింది. అంతంతమాత్రంగా ప్రమాణాలున్న పాఠశాలలు ఏకంగా 3,420 ఉన్నాయి. వీటికి టూ స్టార్‌ రేటింగ్‌ లభించింది.

  • మధ్యస్థంగా ప్రమాణాలున్న త్రీస్టార్‌ రేటింగ్‌ పాఠశాలలు 5,730. కొంత మెరుగ్గా ప్రమాణాలున్న ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌ పాఠశాలలు 708 ఉన్నాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘అత్యాధునిక లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలూ ఉన్న లేబొరేటరీలు, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు.. ఒక్కటేంటి అసలు మా బడిలో లేనిదే లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలన్నీ ఉన్నాయి’ అని ప్రైవేటు పాఠశాలలు ఊదరగొడుతుంటాయి. ఆహా, ఓహో.. అనేలా ప్రచారమే తప్ప వాస్తవంగా మెరుగైన ప్రమాణాలున్న పాఠశాలలు చాలా తక్కువే. చాలా ప్రైవేటు పాఠశాలల్లో అరకొర ప్రమాణాలే ఉన్నాయి. విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్లకు ఫీజులు నిర్ణయించేందుకు ప్రైవేటు పాఠశాలల వసతుల ప్రమాణాల(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)పై పాఠశాల విద్యా శాఖ వివరాలు సేకరించగా.. అసలు డొల్లతనం బయటపడింది. 18 అంశాలపై వివరాలు సేకరించగా వాటిని నూరు శాతం అమలు చేస్తున్న పాఠశాల రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు. మొత్తం ప్రమాణాలు పాటిస్తే ఆ పాఠశాలలకు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఇస్తారు. రాష్ట్రంలో 9,953 ప్రైవేటు పాఠశాలలుంటే వాటిలో ఒక్కటి కూడా ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ సాధించలేదు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చెప్పే మాటలకు, వాస్తవంగా ఉన్న వసతులకు పొంతన లేదని తేలిపోయింది. అత్యంత నాసిరకం, అంతంతమాత్రం, మధ్యస్థం, కొంత మెరుగైన ప్రమాణాల ను బట్టి వరుసగా వన్‌, టూ, త్రీ, ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌లు కేటాయించారు. వీటి ఆధారంగా ఫీజులు నిర్ణయించనున్నారు. ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌ ఉన్న పాఠశాలలు కొన్ని జిల్లాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు, కోనసీమలో ఏడు, మన్యంలో ఐదు, అభివృద్ధి చెందిన జిల్లాగా చెప్పుకొనే ఎన్టీఆర్‌లో రెండు పాఠశాలలు మాత్రమే ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌ సాధించాయి. కాగా అత్యంత తక్కువ ప్రమాణాలున్న వన్‌ స్టార్‌ రేటింగ్‌తో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 22, శ్రీకాకుళంలో 10 బడులు ఉన్నాయి.


స్టార్‌ రేటింగ్‌కు ప్రామాణికాలు

స్టార్‌ రేటింగ్‌ ఇచ్చేందుకు 18 అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. అవి... సరిపడా తరగతి గదులు, పాఠశాల భవనానికి ప్రహరీ, అన్ని తరగతి గదులు-కామన్‌ ఏరియాలో విద్యుత్‌ సదుపాయం, నీటి సదుపాయంతో మరుగుదొడ్లు, విద్యార్థులందరికీ పరిశుభ్రమైన తాగునీరు, సరిపడా స్థాయి పుస్తకాలతో లైబ్రరీ, క్రీడా ప్రాంగణం, డస్ట్‌ బిన్‌లు, విద్యార్థుల వయసుకు తగ్గట్టుగా తరగతి గదుల్లో ఫర్నీచర్‌, సైన్స్‌ లేబొరేటరీలు, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, తరగతి గదుల్లో ఐఎ్‌ఫపీలు లేదా స్మార్ట్‌ టీవీలు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, ఈ-లైబ్రరీ, ఒకేషనల్‌ లైబ్రరీ, కిచెన్‌ గార్డెన్‌, దివ్యాంగులకు ర్యాంపులు-మరుగుదొడ్లు, మఽధ్యాహ్న భోజన పథకం మార్గదర్శకాలతో కిచెన్‌ షెడ్‌. వీటిలో మధ్యాహ్న భోజనం షెడ్‌ మినహా మిగిలినవి ప్రైవేటు పాఠశాలల్లో ఉండాలి. ఈ-లైబ్రరీ, సైన్స్‌ లేబొరేటరీలు, స్మార్ట్‌ టీవీలు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, దివ్యాంగులకు ర్యాంపులు చాలా పాఠశాలల్లో లేవు.


ఫీజులు ఇలా..

స్టార్‌ రేటింగ్‌ ఆధారంగా విద్యా హక్కు చట్టం ఫీజులు ఖరారు చేయాలని నిర్ణయించారు. 1 నుంచి 8 తరగతుల వరకు మూడు రకాలుగా ఫీజులు ప్రతిపాదించారు. ప్రైవేటు స్కూళ్లకు ఒక స్టార్‌ రేటింగ్‌ ఉంటే రూ.6 వేల నుంచి రూ.8 వేలు, రెండు స్టార్లు ఉంటే రూ.7,500 నుంచి రూ.9 వేలు, మూడు స్టార్లు ఉంటే రూ.8,600 నుంచి రూ.10 వేలు, నాలుగు స్టార్లు ఉంటే రూ.10 వేల నుంచి రూ.12 వేలు, ఐదు స్టార్లు ఉంటే రూ.12,500 నుంచి రూ.15 వేలుగా ఫీజులు నిర్ణయించారు. అయితే ఈ ఫీజులు కేవలం విద్యాహక్కు చట్టం కింద కేటాయించే 25 శాతం సీట్లకు మాత్రమే వర్తిస్తాయి. మిగిలిన సీట్లకు పాఠశాల యాజమాన్యాలే ఫీజులు నిర్ణయిస్తారు. అయితే మొత్తం ఫీజులను పాఠశాల విద్యా శాఖే నిర్ణయించాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. పెద్దగా సౌకర్యాలు లేని పాఠశాలలు కూడా భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఆ ఫీజులను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తే అందరికీ మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ పాఠశాలల వ్యూహం

‘మీ పిల్లల్ని చేర్పించి వారిని అంతర్జాతీయ స్థాయి విద్యార్థులుగా మార్చండి’ అంటూ అడ్మిషన్ల సమయంలో ప్రైవేటు పాఠశాలు గొప్పలు చెబుతుంటాయి. పాఠశాలలో వసతులన్నీ అద్భుతమంటూ కరపత్రాల్లో ఫొటోలు వేసి కలరింగ్‌ ఇస్తుంటాయి. ఏదో ఒకవిధంగా తల్లిదండ్రులను పాఠశాల గేటు వరకూ రప్పిస్తే వారిలో కొందరైనా పిల్లల్ని చేర్చకపోతారా అనేది వారి వ్యూహం. అక్కడి వరకూ వెళ్లాకా తల్లిదండ్రులకూ చెప్పుకోదగ్గ ప్రత్యామ్నాయం ఉండదు. అడ్మిషన్ల సమయంలో పాఠశాలల ప్రతినిధులు చెప్పేవన్నీ మాయమాటలని తెలిసినా వేరేదారి లేక ఏదో ఒక ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తుంటారు.

Updated Date - May 27 , 2025 | 03:48 AM