VC Sathupati Prasanna shree : అలా ఆలోచించడమే తప్పు
ABN , Publish Date - Feb 20 , 2025 | 04:10 AM
మాజిక స్పృహ కలిగిన ఎంతోమంది దశాబ్దాల క్రితం స్టూవర్టుపురం గ్రామంలో చైతన్యం తీసుకురావడానికి పనిచేసే వారు.

మూలాలు తెలుసుకోకుండా స్టూవర్టుపురంపై ఆ ముద్ర వేశారు
నిరుద్యోగం, ఉపాధి లేమే అసలు సమస్యలు
ఆకలిగొన్నవాడికి నీతులు రుచించవు
పరిష్కారంపై ఆనాడు దృష్టి లేదు
ఊరిని మార్చిన లవణం, హేమలత కృషి
తాతయ్య కూడా సామాజిక సేవకుడే
నాన్నఊరితో ఇప్పటికీ చెరగని బంధం
ఉపాధ్యాయ వృత్తిపై తొలి నుంచీ మక్కువ
అందుకే డిప్యూటీ కలెక్టర్ పోస్టు కాదనుకున్నా...
ఇక్కడివరకు నా ప్రయాణం సంతృప్తికరం
ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నూతన వీసీ ప్రసన్నశ్రీ వెల్లడి
స్టూవర్టుపురం! ఈ పేరు వింటేనే చిన్న కలవరపాటు. ఎందుకంటే గజదొంగల అడ్డాగానే ఈ ఊరు ప్రపంచానికి తెలుసు. చదువు తక్కువ. చీకటి ఎక్కువ! అలాంటిచోటు నుంచి అక్షర జ్యోతిలా దూసుకొచ్చిందామె. ఆమే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నూతన వీసీ సాతుపాటి ప్రసన్నశ్రీ. స్టూవర్టుపురం నుంచి నన్నయ్య వర్సిటీ వరకు సాగిన ప్రస్థానం ఆమె మాటల్లో ‘‘చిన్నప్పటినుంచీ చదువుకోవడం అన్నా, పదిమందికి చదువును పంచడం అన్నా నాకు ఎంతో మక్కువ. అందువల్లే డిప్యూటీ కలెక్టరుగా వెళ్లే అవకాశం వచ్చినా... వద్దనుకుని అధ్యాపక వృత్తిలోనే స్థిరపడ్డాను’’ అని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నూతన వీసీ ప్రసన్నశ్రీ వెల్లడించారు. తన తండ్రి గ్రామం స్టూవర్టుపురం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఒక యూనివర్సిటీ వీసీగా నియమించబడిన తొలి ఎస్టీ మహిళ తాను కావడం ఎంత సంతోషం కలిగించిందో, స్టూవర్టుపురం తమ ఊరు అని చెప్పుకోవడం కూడా అంతే తృప్తిని ఇస్తోందని ఆమె తెలిపారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...
స్టూవర్టుపురంతో నా అనుబంధం...
మా నాన్నది స్టూవర్టుపురం. అక్కడి స్థితిగతులు మార్చడానికి తాతయ్య ఎంతో కష్టపడ్డారు. తర్వాత నాన్న కూడా దానిని కొనసాగించారు. సామాజిక స్పృహ కలిగిన ఎంతోమంది దశాబ్దాల క్రితం స్టూవర్టుపురం గ్రామంలో చైతన్యం తీసుకురావడానికి పనిచేసే వారు. వారితో కలిసి తాతయ్య కూడా నడిచేవారు. నాన్న రైల్వేలో పనిచేస్తున్నప్పటికీ సొంతగ్రామం మీద ఆపేక్షతో ఉండేవారు. తరచూ నేనూ స్టూవర్టుపురానికి వెళ్లి వస్తుండేదాన్ని. నాన్న సమాధి అక్కడే ఉంది.
ఆ ముద్ర వేయడమే తప్పు..
స్టూవర్టుపురం అనగానే ఇప్పటికీ వేరే చోట్ల ఓ దురభిప్రాయం ఉంది. అసలు అలా ఆలోచించడమే తప్పు. నా మూలాలు అక్కడే ఉన్నాయని నేనే గర్వంగా చెబుతున్నా. గతంలో కొంతమంది తెలిసో తెలియకో మాగ్రామంపై తప్పుడు అభిప్రాయం జనాల్లో వ్యాప్తి చేశారు. అది అలాగనే కొన్ని దశాబ్దాల పాటు స్థిరపడింది. ఇప్పుడిప్పుడే అక్కడి స్థితిగతుల్లో మార్పు రావడం ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రతి గ్రామంలోనూ మంచి చెడుల కలబోత ఉంటుంది. కాకుంటే ఆ గీతల్లో తేడా ఉంటుంది. కానీ స్టూవర్టుపురం విషయంలో ఇది ఎక్కువగా జరిగింది. దీని ఫలితంగా చాలా ఏళ్లు అక్కడి ప్రజలు అవమానాలను ఎదుర్కొన్నారు. ఓ ఎస్టీ మహిళగా పేదల స్థితిగతులపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఇక్కడవరకు నేను చేసిన ప్రయాణం ఓ ఎత్తు అయితే, స్టూవర్టుపురం మూలాలు కలిగి ఉండడం మరింత ఆనందం కలిగించే విషయం. ఆకలితో ఉన్న వాడికి నీతులు చెప్పడం సబబు కాదు. మూలాలపై దృష్టి పెట్టాలి. తొలి తప్పు జరిగినప్పుడే అక్కడి స్థితిగతులను ఆకళింపు చేసుకుని దాని పరిష్కారానికి కృషి చేసి ఉండాల్సింది. కానీ అలాంటి ప్రయత్నమేదీ అప్పట్లో జరగలేదు. నిరుద్యోగం, కష్టపడడానికి పని దొరక్కపోవడం, సామాజిక వివక్ష, పేదరికం.... ఇలాంటి ఎన్నో కారణాలు కొంతమందిని చెడు మార్గాల వైపు వెళ్లేటట్లు చేశాయి. అది ముగిసిన కథ. ఇప్పుడు అక్కడా మార్పు వచ్చింది. అవగాహన స్థాయి పెరిగింది. మెరుగైన జీవితం దిశగా అడుగులు వేస్తున్నారు. యూనివర్సిటీ వీసీ వరకు నా ప్రస్థానం కూడా అక్కడ వాళ్లకు ప్రేరణగా ఉంటే అంతకన్నా గొప్ప ఆనందం నాకు మరొకటి ఉండదు.
తాతయ్య వారితో కలిసి పనిచేశారు..
స్టూవర్టుపురం గ్రామంలో చెడు బాట పట్టినవారిని మార్చడానికి ఎంతోమంది సామాజిక వేత్తలు కృషి చేశారు. వారిలో ముఖ్యంగా లవణం, హేమలత వంటి వారు ముందుండేవారు. వారందరితో తాతయ్య కలిసి పనిచేశారు. నాన్న ప్రసాదరావు ఉద్యోగరీత్యా వేరే చోట ఉన్నా స్టూవర్టుపురంతో అనుబంధం కొనసాగించేవారు. ఆ విధంగా నాకు ఈ ప్రాంతంతో, ప్రజలతో అనుబంధం ఉంది.
పూర్తి సంతృప్తికరంగా ప్రయాణం..
అధ్యాపక వృత్తి మీద ఉన్న మక్కువతోనే కస్టమ్స్ విభాగంలో అవకాశం వచ్చినా కాదనుకున్నా. తొలి నుంచీ టీచింగ్ అంటే ఇష్టం. ఈ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు. ముఖ్యంగా ఎస్టీల జీవన విధానం, లిపిపై చేసిన పరిశోధనలకు గుర్తింపుగా 2022లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీశక్తి పురస్కారం అందుకోవడం మరచిపోలేను. నా కెరీర్ మొత్తం అధ్యాపక వృత్తితోనే ముడిపడి ఉంది. ఇప్పుడు వీసీగా అవకాశం వరకు తృప్తిగానే నా ప్రయాణం సాగింది.