Rice Scam : రేషన్ బియ్యం మాయంలో లబ్ధిదారు పేర్ని నానియే!
ABN , Publish Date - Jan 29 , 2025 | 05:05 AM
బియ్యం విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును గోడౌన్ మేనేజర్, ఈ కేసులో రెండో నిందితుడైన మానసతేజ బ్యాంకు ఖాతా నుంచి పేర్ని నాని ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యాయని వెల్లడించారు.

అందుకు ప్రాథమిక ఆధారాలున్నాయ్: ఏజీ
గోడౌన్ మేనేజర్ ఖాతా నుంచినానికి సొమ్ము బదిలీ అయింది
వాస్తవాల వెలికితీతకు కస్టడీ విచారణ అవసరం
ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయండి
హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ నివేదన
ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వు
తొందరపాటు చర్యలొద్దన్న ఉత్తర్వులు పొడిగింపు
అమరావతి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): గోదాము నుంచి రేషన్ బియ్యం మాయం చేయడంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కీలక పాత్ర పోషించారని, అంతిమ లబ్ధిదారు ఆయనేనని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. బియ్యం విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును గోడౌన్ మేనేజర్, ఈ కేసులో రెండో నిందితుడైన మానసతేజ బ్యాంకు ఖాతా నుంచి పేర్ని నాని ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యాయని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం తరలింపులో పిటిషనర్ పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని.. గోడౌన్ ఆయన సతీమణి పేరుమీద ఉన్నప్పటికీ.. అక్కడి కార్యకలాపాలన్నీ ఆయనే పర్యవేక్షించేవారని ఏజీ తెలిపారు. ఇందుకు సంబంధించి మేనేజర్ మానసతేజ వాంగ్మూలం ఇచ్చారని వెల్లడించారు. మానసతేజ పిటిషనర్ సతీమణి వద్ద ఉద్యోగం చేస్తున్నారని, జీతం రూపేణా ఆయన అకౌంట్‌కు డబ్బులు వెళ్లాలని.. కానీ ఈ కేసులో ఉద్యోగి ఖాతా నుంచే యజమాని కుటుంబ సభ్యుల ఖాతాకు సొమ్ము చేరిందని వివరించారు. లావాదేవీలపై వాస్తవాల వెలికితీతకు పేర్ని నానిని కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించారు. ఈ మేరకు మంగళవారం ఆదేశాలిచ్చారు. పేర్ని నాని సతీమణి జయసుధ మచిలీపట్నంలోని తన గోడౌన్‌ను పౌరసరఫరాల శాఖకు లీజుకిచ్చారు. ఇందులో నిల్వ చేసిన రేషన్ బియ్యం మాయమయ్యాయని పేర్కొంటూ పౌరసరఫరాల అధికారి చింతం కోటిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పేర్ని నానిని కూడా నిందితుడి(ఏ-6)గా చేర్చారు. ఈ నేపఽథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా.. నాని తరఫున సీనియర్ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించారు. గోడౌన్‌లో జరిగే కార్యకలాపాలతో పిటిషనర్‌కు సంబంధం లేదన్నారు. రేషన్ బియ్యం నిల్వకు సంబంధించి ఆయన సతీమణితో పౌరసరఫరాల శాఖ ఒప్పందం చేసుకుందని.. వేయింగ్ బ్రిడ్జిలో తలెత్తిన సాంకేతికలోపం కారణంగా బియ్యం నిల్వలో తేడా వచ్చిందని. అందుకు తగిన మొత్తాన్ని పౌరసరఫరాల శాఖకు పిటిషనర్ సతీమణి చెల్లించారని తెలిపారు. గోడౌన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న మానసతేజ గతంలో పేర్ని నాని వద్ద పనిచేశారని.. అనంతరం ఆయన సతీమణి వద్ద ఉద్యోగిగా చేరి గోడౌన్ బాధ్యతలు చూస్తున్నారని.. మానసతేజ, నాని మధ్య లావాదేవీలను రేషన్ బియ్యంతో ముడిపెట్టడం సరికాదని పేర్కొన్నారు. కోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తర్వాత నాని దర్యాప్తులో జోక్యం చేసుకున్నట్లు గానీ, సాక్షులను బెదిరించినట్లు గానీ ఎలాంటి ఆధారాలూ లేవన్నారు. ఆయన మినహా ఇతర నిందితులందరూ బెయిల్‌పై ఉన్నారని, ఆయకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు.
For AndhraPradesh News And Telugu News