గవర్నర్ ప్రసంగం ఆకాంక్షలకు దూరం: పీడీఎఫ్
ABN , Publish Date - Feb 25 , 2025 | 05:52 AM
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, వాస్తవాలకు దూరంగా ఉందని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు.

అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, వాస్తవాలకు దూరంగా ఉందని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, ‘వచ్చే నాలుగైదేళ్లలో ప్రభుత్వం ఏం చేస్తుందో స్పష్టత లేదు. సూపర్ సిక్స్ పథకాలపై స్పష్టత ఇవ్వకుండా, డీఎస్సీ పోస్టుల గురించి గొప్పలు చెప్పారు. తొలి సంతకం ప్రకారం నవంబరులో టీచర్ పోస్టుల భర్తీ ఎందుకు చేయలేదో చెప్పలేదు’ అని విమర్శించారు. ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ‘గవర్నర్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోలోని వాగ్దానాలు ఏవీ కనిపించలేదనీ, ప్రభుత్వ పథకాల అమలుపై స్పష్టమైన కాలపరిమితి లేదన్నారు. స్వర్ణాంధ్ర 2047... కేవలం తేదీని జోడించడం తప్ప కొత్తదనం లేదు’ అని విమర్శించారు. ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ... గవర్నర్ ప్రసంగం కేవలం పదజాలానికే పరిమితమైందనీ, గ్రాఫికల్ స్వభావంతో ఉందన్నారు.