Share News

Pawan Kalyan Son Injured: సింగపూర్‌ స్కూల్లో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:56 AM

సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌కు గాయాలయ్యాయి. మంటలు, పొగ కారణంగా అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు

Pawan Kalyan Son Injured: సింగపూర్‌ స్కూల్లో అగ్నిప్రమాదం

  • పవన్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌కు గాయాలు

  • చేతులు, కాళ్లపై కాలిన బొబ్బలు

  • ఊపిరితిత్తుల్లోకి పొగ.. ఆసుపత్రిలో చికిత్స

  • ఓ విద్యార్థిని మృతి.. గాయపడ్డ మరో 20 మంది

  • మన్యం పర్యటన ముగించుకుని సింగపూర్‌కు పవన్‌

  • డిప్యూటీ సీఎంకు ఫోన్‌ చేసి పరామర్శించిన ప్రధాని

అమరావతి, హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): సింగపూర్‌లో మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ గాయపడ్డాడు. మంటల కారణంగా చేతులు, కాళ్లపై బొబ్బలు ఏర్పడ్డాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరుకోవడంతో శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కొన్నాడు. ఏడేళ్ల మార్క్‌ శంకర్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ ఘటనలో పదేళ్ల విద్యార్థిని మృతి చెందగా.. మరో 20 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 15 మంది వరకు చిన్నారులు ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిందని తెలిసినప్పుడు అరకు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మంగళవారం రాత్రి 9:30 గంటలకు సింగపూర్‌ బయల్దేరి వెళ్లారు.


అసలు ఏం జరిగింది..?

సింగపూర్‌లోని సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ (సీబీడీ) సమీపంలోని రివర్‌ వ్యాలీ రోడ్డులో మూడు అంతస్థుల భవనం ఉంది. దీనిలో పలు దుకాణాలతోపాటు.. చిన్నారులకు రోబోటిక్‌ ఇనిస్టిట్యూట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ భవనంలోనే 30 మంది స్కూల్‌ పిల్లలకు సమ్మర్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశారు. వారిలో పవన్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ భవనంలో ఒక్కసారిగా మంటలు రాజుకుని అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనపై సమాచారం అందగానే సింగపూర్‌ హోంశాఖ మంత్రి కె. షణ్ముగం హుటాహుటిన స్పందించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఫైర్‌ ఇంజన్లను రంగంలోకి దింపారు. అయితే.. సహాయక చర్యలు చేపట్టే సమయానికే 10 ఏళ్ల బాలిక మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్టు మంత్రి తెలిపారు. ఈ ఘటనలో మరో 20 మంది వరకు గాయపడ్డారని, వీరిలో 15 మంది చిన్నారులే ఉన్నారని సింగపూర్‌ పౌర రక్షణ దళం ఫేస్‌బుక్‌లో పేర్కొంది. ఇదిలావుంటే.. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. భవనం మూడో అంతస్థు నుంచి దట్టమైన పొగ బయటకు రావడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో చిన్నారులు.. ప్రాణభయంతో అరుపులు కేకలు పెట్టారు. ఈ సమయంలో కొందరు భవన నిర్మాణ కార్మికులు, స్థానికులు పరంజాల ద్వారా భవనంపైకి ఎక్కి వారిని రక్షించే ప్రయత్నాలు చేయడం వీడియోలో కనిపించింది. ఈలోగా అక్కడకు చేరుకున్న అగ్నిమాపక వాహనాలు.. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. అదేసమయంలో కొందరు ఆయా వాహనాలకు ఉన్న నిచ్చెనల ద్వారా మూడో అంతస్థుకు చేరుకుని బాధిత చిన్నారులను బయటకు తీసుకువచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. భవనంలోని మరో 80 మందిని అక్కడ నుంచి బయటకు తరలించారు. అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు కేకే ఉమెన్స్‌ అండ్‌ చిల్డ్రన్స్‌ ఆసుపత్రి సీనియర్‌ కన్సల్టెంట్‌ శశికుమార్‌ గణపతి తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.


అందరికీ ధన్యవాదాలు..

మార్క్‌ శంకర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. తన కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రామ్మోహన్‌నాయుడు, ఏపీ ఉపసభాపతి రాఘురామకృష్ణరాజు, రాష్ట్రమంత్రులు అచ్చెన్ననాయుడు, నాదెండ్ల మనోహర్‌, బీజేపీ బీసీ మోర్చ అధ్యక్షులు లక్ష్మణ్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, హరీశ్‌రావు, మిగతా ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు నా తోటి నటీనటులు.. మార్క్‌ శంకర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు కూడా మా బాబు కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’ అని పవన్‌ పేర్కొన్నారు.

గవర్నర్‌ దిగ్ర్భాంతి

సింగపూర్‌ అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ గాయపడిన విషయంపై రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శంకర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

మార్క్‌ త్వరగా కోలుకోవాలి చంద్రబాబు, లోకేశ్‌ ఆకాంక్ష

సింగపూర్‌ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌కు గాయాలైన విషయం తనకు ఆందోళన కలిగించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శంకర్‌ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. కాగా.. ‘పవన్‌ అన్న తనయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని మంత్రి లోకేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.


అకీరా పుట్టిన రోజు నాడే.. ఇలా జరగడం బాధాకరం: పవన్‌

తన పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజు నాడే.. చిన్న కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడడం చాలా బాధాకరమని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌కు గాయాలైన ఘటనపై మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాద విషయం తెలిసినప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని, వెంటనే సింగపూర్‌లోని భారత హైకమిషన్‌తో మాట్లాడానని, వారు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని చెప్పడంతోపాటు, అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారని తెలిపారు. ‘అరకు గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మా ణ కార్యక్రమంలో ఉండగా.. ఉదయం మార్క్‌ శంకర్‌కు అగ్నిప్రమాదంలో కాళ్లు, చేతులకు గాయాలయ్యాయని ఫోన్‌ వచ్చింది. తొలుత చిన్నపాటి ప్రమాదమమేనని అనుకున్నా. ఇంతస్థాయిలో ఉంటుందని ఊహించలేదు. బాబును ఆసుపత్రిలో చేర్పించి బ్రాంకోస్కోపి చేస్తున్నారు. ఈ సమ్మర్‌ క్యాం ప్‌లో 30 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతిచెందడం బాధించింది. మార్క్‌ శంకర్‌ పక్కనే కూర్చున్న చిన్నారి శరీరం కాలిపోయింది. మా బాబు చేతికి, కాలికి గాయాలయ్యాయి. ఊపిరితిత్తులోకి బాగా పొగవెళ్లింది. ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమేమి లేకపోయినా.. ఊపిరితిత్తులను పొగ నిండుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశముందని డాక్టర్లు అంటున్నారు. బాబు వయసు ఏడేళ్లు. ఈ రాత్రి 9:30 గంటలకు సింగపూర్‌కు బయల్దేరి వెళ్తున్నా. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి భవన నిర్మాణ కార్మికులు స్పందించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఫోన్‌ చేసి పరిస్థితి గురించి వాకాబు చేశారు. సింగపూర్‌, భారత హై కమిషనర్లతో మాట్లాడి వివరాలు తెలియజేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు. మీటింగ్‌లో ఉండగానే సీఎం చంద్రబాబు ఫోన్‌ చేసి వివరాలు అడిగారు. మంత్రులు నారా లోకేశ్‌, అనితలు కూడా ఫోన్‌ చేసి అడిగారు’ అని చెప్పారు.


ప్రధాని ఫోన్‌

పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడని తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఉపముఖ్యమంత్రికి ఫోన్‌ చేసి పరామర్శించారు. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్క్‌ శంకర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని పవన్‌కు సూచించారు. సింగపూర్‌లో ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని తెలిపారు.

ఇంత జరిగినా.. ఇచ్చిన మాట కోసం!

‘అటవితల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కు సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం గురించి తెలియగానే దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు అధికారులు, జనసేన నాయకులు ఆయనను తక్షణమే సింగపూర్‌కు వెళ్లాలని సూచించారు. అయితే.. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు తాను మాట ఇచ్చానని, కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి, అక్కడి సమస్యలు తెలుసుకున్నాకే సింగపూర్‌ వెళ్తానని పవన్‌ స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. అనంతరం ఆయన కురిడి గ్రామంలో పర్యటించారు. దీని తర్వాత విశాఖలోనూ పవన్‌ పర్యటించాల్సి ఉంది. అయితే.. విశాఖ పర్యటన రద్దు చేసుకుని సింగపూర్‌ వెళ్లనున్నారని జనసేన వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 09 , 2025 | 04:00 AM