Deputy Pawan Kalyan: నేడు తూర్పులో పవన్ పర్యటన
ABN , Publish Date - Jun 26 , 2025 | 05:52 AM
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఎంపీ పురందేశ్వరి గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు.

అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన
రాజమహేంద్రవరం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఎంపీ పురందేశ్వరి గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్క డే బహిరంగ సభ నిర్వహిస్తారు. తర్వాత బొమ్మూరులో విజ్ఞాన కేంద్రం (సైన్స్ మ్యూజియం) ప్రారంభిస్తారు. అక్కడి నుంచి దివాన్ చెరువు చేరుకుని అట వీ ఉద్యోగుల శిక్షణ కోసం ఫారెస్ట్ అకాడమీ భవన సముదాయానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు.
గత గోదావరి పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా గోదావరిలో బోట్‌లో పయనించి.. ఇక్కడి లంకలు, అందాలను చూసి అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని పేర్కొంటూ.. అక్కడికక్కడే దీనికి ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు’గా నామకరణం చేసి.. రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, 2019లో అధికారంలోకొచ్చిన వైసీపీ ఈ ప్రాజెక్టును పక్కన పడేసింది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు రూ.94.44 కోట్లతో హేవలాక్ బ్రిడ్జి పునర్నిర్మాణంతోపాటు పుష్కర్‌ఘాట్ అభివృద్ధి, గోదావరికి నిత్యహారతి, ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా కడియం నర్సరీలు, పర్యాటక కేంద్రంగా గోదావరి మధ్యలోని బ్రిడ్జిలంక, నిడదవోలు కోటసత్తెమ్మ దేవాలయానికి నిధులు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ పథకం సాస్కి-2024-25 (స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వె్‌స్టమెంట్) స్కీమ్ ద్వారా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టును నిర్మించనున్నారు.