Deputy CM Pawan Kalyan: వలంటీర్ పేరిట వైసీపీ వంచన
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:47 AM
వలంటీర్ ఉద్యోగాల పేరుతో యువతను వైసీపీ ప్రభుత్వం వంచించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. వేతనాల చెల్లింపులకు ప్రభుత్వ ఉత్తర్వులు లేవని, నియామక ప్రక్రియ అస్పష్టమని తెలిపారు

పాడేరు/డుంబ్రిగుడ/అరకులోయ/విశాఖపట్నం, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): వలంటీర్ ఉద్యోగం పేరుతో వైసీపీ ప్రభుత్వం యువతను చాలా తెలివిగా వంచించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వలంటీర్ నియామకాలు, వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి జీవోలుగానీ, అధికారిక ఉత్తర్వులు గానీ లేవని చెప్పారు. ఆఖరుకు వలంటీర్లకు ఇచ్చిన గౌరవ వేతనం ఏ పద్దు నుంచి ఇచ్చారనేది సైతం తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిని బట్టి.. వైసీపీ ప్రభుత్వం వలంటీర్లను ఎంత దారుణంగా వంచించిందో అర్థం చేసుకోవాలన్నారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం కురిడి గ్రామంలో ఆయన పర్యటించారు. తొలుత స్థానిక శివాలయంలో పూజలు చేసిన ఆయన అనంతరం గిరిజనులతో కలిసి రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామ వలంటీర్లుగా పనిచేసిన పలువురు మహిళలు కలిసి.. తమను తిరిగి కొనసాగించాలని అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిపై పవన్‌కల్యాణ్ స్పందిస్తూ.. వలంటీర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న ఆలోచనతో ఉన్నామని, దీనిపై కేబినెట్‌లో కూడా చర్చించామని తెలిపారు. కానీ, వలంటీర్ల నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు కానీ, వివరాలు కానీ తమకు లభించలేదన్నారు. ఈ సమస్యను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వద్ద తానే చర్చకు తీసుకువచ్చినట్టు తెలిపారు. వలంటీర్ ఉద్యోగాల పేరిట విద్యావంతులైన యువతను గత వైసీపీ ప్రభుత్వం నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వలంటీర్లకు వేతనాలు ఎక్కడి నుంచి ఇచ్చారో సంఘం నాయకులను ప్రశ్నించాలని సూచించారు. ఏజెన్సీలో గత వైసీపీ ప్రభుత్వం వంద కిలోమీటర్లయినా రోడ్లు వేయలేదని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక రూ.వెయ్యి కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతోందన్నారు. మొత్తం వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందన్నారు. వలంటీర్ల నుంచి సాధారణ ప్రజల వరకు త్రిశంకు స్వర్గంలో పెట్టిందని ఆరోపించారు. ‘‘నాకు తెలిసినంత వరకు సుమారుగా రూ.25 వేల కోట్ల మేరకు వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది. దొరినకాడికి దొరికినట్టు దోచేశారు’’ అనిచెప్పారు.
ఉమ్మడి సాగుకు ఉపాధి హామీ
గిరిజనులకు సుస్థిరమైన ఆదాయం వచ్చేలా ఉమ్మడి వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. తొలుత కురిడి గ్రామంలోనే పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించనున్నట్టు చెప్పారు. దీనికిగాను అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక సీఎస్ శశిభూషణ్‌కుమార్‌కు అక్కడికక్కడే సూచించారు. ఏజెన్సీ వాతావరణానికి అనువైన స్ట్రాబెర్రీ, యాపిల్, అవకాడో, ఇతర కూరగాయలు ఉమ్మడిగా సాగు చేసేందుకు నిర్ణయం తీసుకోవాలన్నారు. కురిడి గ్రామంలో సుమారు 400 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని, ఉమ్మడి వ్యవసాయం చేసుకుని గిరిజనులు ఉపాధి పొందాలని సూచించారు. ఈ గ్రామమంటే తనకు ఇష్టమని, 2018లో వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు, సమస్యలపై అవగాహన ఏర్పడిందని, అందుకే గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. తన సొంత నిధుల నుంచి రూ.5 లక్షలు గ్రామానికి ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
విశాఖ పర్యటన రద్దు
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ విశాఖపట్నం పర్యటన రద్దయింది. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు గాయపడినట్టు సమాచారం రావడంతో విశాఖ కార్యక్రమాలు రద్దు చేసుకుని వెళ్లారు.
కాఫీ తోటల్లో చెక్క వంతెన ప్రారంభం
ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా అరకులోయ మండలం సుంకరమెట్ట కాఫీ ఎస్టేట్స్‌లో రూ.19 లక్షల వ్యయంతో నిర్మించిన చెక్క వంతెనను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆ వంతెనపై నడుస్తూ పర్యాటకుల సందర్శన కోసం ఏర్పాటు చేసిన ట్రీడెక్స్, పక్షి గూడు ఆకారంలో ఏర్పాటు చేసిన బర్డ్ నెస్ట్‌లను ఆసక్తిగా తిలకించారు. కాఫీ, అంతర పంటగా మిరియాల సాగుపై ఏపీఎ్‌ఫడీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయకృష్ణ రంగారావుతో కలిసి కాఫీ తోటల్లో పవన్‌కల్యాణ్ పనస, మామిడి మొక్కలు నాటారు.
మన్యంలో కేరళ తరహా పర్యాటకం
గిరిజన ప్రాంతాల్లో కేరళ తరహాలో పర్యాటకాభివృద్ధికి అవకాశాలున్నాయని పవన్‌కల్యాణ్ తెలిపారు. ప్రకృతికి హాని చేయకుండా, పర్యాటకులను ఆకర్షించడంతోపాటు, స్థానికంగా ఉన్న ఆచారాలు, సంప్రదాయాలను బలోపేతం చేసేలా పర్యాటకాభివృద్ధికి కృషి చేయనున్నట్టు చెప్పారు. పర్యాటకంతో యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు.