Corporation Chairman Pattabhi: ఉర్సా పై దుష్ప్రచారం
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:18 AM
ఉర్సా కంపెనీకి భూముల కేటాయింపుపై జగన్ చేస్తున్న ఆరోపణలను కొమ్మారెడ్డి పట్టాభి తిప్పికొట్టారు. భూములను 99 పైసలకు ఇచ్చినట్లు నిరూపించాలంటూ సవాల్ విసిరారు.

99 పైసలకే భూములిచ్చినట్టు నిరూపించండి
కొమ్మారెడ్డి పట్టాభి ఆగ్రహం
అమరావతి, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): ఉర్సా కంపెనీకి విశాఖలో ఎకరం 99పైసల చొప్పున భూము లు కేటాయించినట్లు ఆరోపిస్తున్న మాజీ సీఎం జగన్, అందుకు ఆధారాలు బయటపెట్టాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి డిమాండ్ చేశారు. జగన్ దొంగల ముఠా, ఫేక్ ముఠాది వట్టి దుష్ప్రచారమేనన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2019-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం పైసా పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురాకపోగా, ఉన్న కంపెనీలను వెనక్కి తరిమేసిందని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ‘‘అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ సుమారు రూ.5,196 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. ఆ కంపెనీకి విశాఖ ఐటీ పార్కు వద్ద ఎకరా రూ.కోటికి, కాపులుప్పాడు వద్ద ఎకరా రూ.50 లక్షలకు భూములు కేటాయిస్తే, దిక్కుమాలిన జగన్ పత్రికలో ఊరుపేరు లేని కంపెనీకి ఎకరం 99 పైసలకే అంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు. జగన్ హయాంలో విశాఖ ఐటీ పార్కులో వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్‌కి ఎకరా రూ.కోటి చొప్పున జగన్ భూమిని కేటాయించిన మాట వాస్తవం కాదా? మీరే కేటాయించిన రేటుకు మేం మరో కంపెనీకి భూమి కేటాయించి కేబినెట్‌లో తీర్మానం చేస్తే ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. తాము జగన్‌లా రూ.500 కోట్లతో రుషికొండకు గుండు కొట్టించి ప్యాలెస్ కట్టుకోలేదన్నారు.
‘‘జగన్ హయాంలో ప్రతి జిల్లాలోనూ విలువైన భూములు ఆక్రమించుకుని ఎకరాకు నెలకు రూ.1000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 44 ఎకరాలు వైసీపీ కార్యాలయాలకు కేటాయించుకున్నారు. ఇదేనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అంటే? జగన్ తన తండ్రి హయాంలో క్విడ్‌ప్రోకో కింద వాన్‌పిక్ పేరుతో వేల ఎకరాలు దోచుకున్నారు. తనను కీర్తిస్తూ యాత్ర 1.2 తీసిన డైరెక్టర్‌కు హర్సీలీహిల్స్‌లో ఉచితంగా 2 ఎకరాలు, తన రాజగురువు శారదాపీఠానికి విశాఖలో కోట్లు విలువైన 15 ఎకరాలను రూ.15 లక్షల చొప్పున కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, పరిశ్రమలకు భూములు కేటాయిస్తే మాత్రం గగ్గోలు పెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారు’’ అంటూ పట్టాభి మండిపడ్డారు.