Share News

Ongolu Cattle: రైతుబిడ్డ రాజసం!

ABN , Publish Date - Feb 24 , 2025 | 05:36 AM

ఒంగోలు జాతి పశువులకు జన్మస్థానం ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ పరీవాహక ప్రాంతం. ఆ ప్రాంతంలోని ఉలిచి, కరవది తదితర గ్రామాల్లో ఈ జాతి పశువులు ఎక్కువగా కనిపిస్తాయి.

Ongolu Cattle: రైతుబిడ్డ రాజసం!

  • ఖండాంతర ఖ్యాతి గడించిన ఒంగోలు గిత్త

  • పశుజాతిలో రారాజుగా శతాబ్దాల కీర్తి

  • బ్రెజిల్‌ వేలంలో రూ.41 కోట్లు పలికిన ఒంగోలు ఆవు

  • రచ్చ గెలిచినా ఇంట తగ్గిపోతున్న జాతి

  • నేడు ఆదరణలేక మనుగడ ప్రశ్నార్ధకం

  • రాష్ట్రంలో పోషకులూ, శిక్షకులూ కరువు

  • రూ.23 కోట్లతో ప్రభుత్వం ప్రతిపాదనలు

  • పూర్తి సంరక్షణకు 85 కోట్లు అవసరం

ఎవరైన ఒడ్డూపొడుగు ఉండి ఠీవిగా కనిపిస్తే ఒంగోలు గిత్తలా ఉన్నాడంటాం. ఎద్దులలో అనేక జాతులు ఉన్నప్పటికీ ఒంగోలు జాతి గిత్తలకు ఉన్న క్రేజ్‌ ఇది. బ్రెజిల్‌లో నిర్వహించిన వేలంలో వియాటినా 19 రకం ఒంగోలు జాతి ఆవు రూ.41 కోట్ల ధర పలకడంతో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. చూడటానికి ఒంగోలు గిత్తలు ఎంత అందంగా ఉంటాయో, అవి బరిలో దిగి కలబడే తీరూ అంతే అందంగా ఉంటుంది. ఇక..ఒంగోలు జాతి ఆవుల పరంగా చూస్తే రోజుకు 20లీటర్ల పాలు ఇస్తాయి. అయితే, రచ్చ గెలిచిన ఈ జాతి ఇంట మాత్రం తగ్గిపోతోంది. వాటికి మేత దొరకడమే కష్టంగా ఉంది. వీటి సంరక్షణ రైతులకు కష్టంగా మారింది. కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందకపోతే ఒంగోలు జాతి ఎడ్ల మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది.

కారంలో, కొమ్ముల రూపులో విలక్షణత! విశాలమైన కాళ్లు, వెడల్పాటి నుదురు, పెద్ద చెవులు, గంగడోలు, ఎత్తయిన మోపురం. చిన్న మొహం... ఇలా ఒంగోలు జాతి గిత్తలకు ఎన్ని ప్రత్యేకతలో! ఒంగోలు జాతి పశువులకు జన్మస్థానం ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ పరీవాహక ప్రాంతం. ఆ ప్రాంతంలోని ఉలిచి, కరవది తదితర గ్రామాల్లో ఈ జాతి పశువులు ఎక్కువగా కనిపిస్తాయి. ఒకప్పుడు ఎక్కడ పందేలు జరిగినా ఒంగోలు జాతి గిత్తదే విజయం. దీంతో ఈ జాతి పేరు ఖండాంతరాలకు వ్యాపించింది. బలిష్టంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటాయని పేరు. అలాగే ఎంత బరువైనా లెక్కచేయకుండా బండిని లాగుతాయి. పౌరుషానికి పెట్టింది పేరు. ఒంగోలు జాతి పశువులను గురించి తెలుసుకున్న బ్రెజిల్‌ దేశం తొలిసారిగా 1863లో తమ దేశానికి ఈ జాతి పశువులను దిగుమతి చేసుకుంది. 1950 ప్రాంతంలో కరవది గ్రామానికి చెందిన ఓ రైతు నుంచి ఒంగోలు జాతి ఎద్దును పెద్ద ధరనే చెల్లించి బ్రెజిల్‌ దేశస్థులు కొనుగోలు చేసి తమ దేశానికి ఓడలో తరలించారు. ఈ విషయం అప్పట్లో జనం గొప్పగా చెప్పుకొనేవారని పెద్దలు చెబుతుండేవారు. తొలుత బ్రెజిల్‌లో, అనంతరం పలు దేశాల్లో ఒంగోలు జాతి పశు సంపద అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇటీవల బ్రెజిల్‌లో నిర్వహించిన వేలంలో వియాటినా 19 రకం ఒంగోలు జాతి ఆవు రూ.41 కోట్ల ధర పలికింది.


నవ నలుపులు ప్రత్యేకం

చక్కటి శరీర సౌష్టవం, రాజసం ఉట్టిపడే నడక ఒంగోలు జాతి గిత్తల ప్రత్యేకత. గిత్తల శరీరంపై తొమ్మిది భాగాల్లో నలుపు వర్ణం ఉంటుంది. మేలుజాతి ఒంగోలు ఎడ్లను బేరం చేసేవారు ప్రత్యేకంగా దీనిని పరిశీలిస్తారు. ఎద్దు ముట్టే, తోక చివర భాగం, చెవి అడుగుభాగం, బొడ్డు, గిట్టల వెనుకభాగం, మోపురం, ఎద్దు మడి, కనుబొమ్మలు, వృషనాల కిందభాగంలో నలుపులను చూస్తారు. ఎద్దు శరీరంపై సుడులు ప్రత్యేకంగా ఉంటాయి. ఎద్దు నుదిటిపై, వెన్నెముకపై, తోక వద్ద, చంక వద్ద సుడులను బేరగాళ్లు ప్రత్యేకంగా చూస్తారు. తప్పు సుడులు ఉంటే ఆ గిత్తను సాకేందుకు రైతులు ఇష్టపడరు. గంగిరెద్దుల వారికి ఇస్తుంటారు.

పది గిత్తలతో ప్రయోగాత్మకంగా..

ఒంగోలు ప్రాంతంలోని చదలవాడలో ఏర్పాటైన పశుఉత్పత్తి క్షేత్రంలో సెమన్‌ కోసం గిత్తలను పెంచుతున్నారు. గతంలో టీజర్‌ బుల్‌ మాత్రమే ఈ క్షేత్రంలో ఉండేది. ప్రస్తుతం ఇక్కడే పుట్టిన పది గిత్తలను తొలిసారిగా సెమన్‌ కోసం ప్రత్యేకంగా సాకుతున్నారు. రెండు నుంచి రెండున్నరేళ్లు ఉన్న ఈ గిత్తలు మరో ఏడాదిలో సెమన్‌ ఉత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. అయితే సెమన్‌ సేకరణ, నిల్వలకు సరైన ల్యాబ్‌లు ఈ క్షేత్రంలో లేవు. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో గత ఐదేళ్లూ ఒంగోలు గిత్తలు తమ విశిష్ఠతను కోల్పోవాల్సి వచ్చింది. పోషణ కష్టం కావడంతో రైతాంగం వాటిని అమ్మేసుకోవాల్సిన పరిస్థితి!


అక్రమ మార్గంలో బ్రెజిల్‌కు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర దేశాలకు ఒంగోలు జాతి ఎద్దుల ఎగుమతిని నిలిపివేశాయి. దీంతో బ్రెజిల్‌ సహా పలు దేశాలకు చెందిన వారు ఒంగోలు ఎడ్లను స్థానికంగా కొనుగోలు చేసి గుజరాత్‌ రాష్ట్రంలో వాటి యాంబ్రియోలను (పిండాలు) సేకరించి వాటిని అక్రమ మార్గంలో వారి దేశాలను తరలిస్తున్నారు..! తద్వారా వారి వద్ద ఇప్పటికే వృద్ధి చెందిన ఒంగోలు జాతి పశుసంపదలో జన్యుపరమైన నాణ్యతను పెంచుకుంటున్నారు. అయితే, ఒంగోలు ఎద్దుల పుట్టినిల్లు అయిన ప్రకాశం జిల్లాలో యాంబ్రియో (పిండం) తయారీ కేంద్రం లేదు. గుంటూరు లాంఫాంల నుంచి నెల్లూరు జిల్లా చింతల దీవి నుంచి యాంబ్రియోలు సరఫరా అవుతుంటాయి.

పడిపోతున్నఎద్దు బరువు

గతంలో ఒంగోలు జాతి గిత్తలు 1,300 కిలోలు ఉండేవి. వ్యవసాయంలో వాటి ఉపయోగం లేకపోవడం, వాటిని సాకడం రైతులకు వ్యయప్రయాసగా మారడంతో క్రమేపి వీటిని పెంచేవారి సంఖ్య తగ్గుతోంది. దీంతో క్రమేపి బరువు 1,100కు పడిపోతోంది.


చంద్రబాబు చొరవతో..

ఒంగోలు జాతి పశుసంపదను పరిరక్షించేందుకు నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడ పశుఉత్పత్తి క్షేత్రాన్ని అప్పటి సీఎం చంద్రబాబు చొరవతో ఏర్పాటుచేశారు. 1980 వరకు ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా రామతీర్థం వద్ద ఉండేది. ఆ ప్రాంతంలో గ్రానైట్‌ పరిశ్రమలు వృద్ధి చెందడంతో వేరొక ప్రాంతానికి తరలించాలని అప్పటి ప్రభుత్వం యోచించింది. ఈ క్రమంలోనే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించి, చదలవాడలో 200 ఎకరాలలో పశుక్షేత్రం ఏర్పాటు చేయించారు. ఇక్కడ ప్రస్తుతం 330 పశువులున్నాయి. మార్క్‌ఫెడ్‌ ద్వారా దాణా తెప్పిస్తారు. ఏటా విజయవాడకు చెందిన వీబీఆర్‌ ఇనిస్టిట్యూట్‌ వైద్యులు ఇక్కడి పశువుల రక్తనమూనాలను సేకరించి టీబీజేడీ, తెప్టస్వారా, బ్రూసెల్లా లాంటి వ్యాధులకు గురికాకుండా పర్యవేక్షిస్తుంటారు. ప్రతి మంగళవారం పలు పరీక్షలు చేస్తారు. సరోగసి విధానం ద్వారా ఒంగోలు జాతి పశుసంతతి వృద్ధి చేస్తుండడం ఇక్కడ ప్రత్యేకత. అయితే, 2019లో వైసీపీ వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పశుక్షేత్రంపై దృష్టి సారించింది. రూ. 23 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే, పూర్తిస్థాయిలో ఒంగోలు గిత్తలను సంరక్షించాలంటే రూ. 85 కోట్లు అవసరం అవుతాయని వ్యవసాయ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.


ఇది కదా పౌరుషమంటే..!

బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన రైతు పోపూరి శ్రీనివాసరావు ఒంగోలు జాతి ఎడ్లను పోషిస్తున్నారు. ఆయన వద్ద ఉన్న ఎడ్లు వందసార్లు బల ప్రదర్శన పోటీల్లో 60సార్లు పతకాలు గెలిచాయి. ఒకసారి తెలంగాణలో జరిగిన పోటీల్లో పతకం సాధించిన తర్వాత బ్రె జిల్‌కు చెందిన వ్యక్తి 3 జతల ఎద్దులకు రూ.1.80 కోట్లు ఇస్తానని ఆఫర్‌ ఇచ్చినా, శ్రీనివాసరావు అందుకు అంగీకరించలేదు. ‘పశువులను అమ్ముకుని బతుకుతా రు’ అని ఆ వ్యక్తి ఎగతాళిగా మాట్లాడటం తనను బాధించిందని, అందుకే అమ్మలేదని శ్రీనివాసరావు చెప్పారు.

- ఒంగోలు కల్చరల్‌, మార్టూరు, పర్చూరు- ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 24 , 2025 | 05:38 AM