Share News

Civil Supplies Corporation : అద్దె గోదాములపై గోల!

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:32 AM

రేషన్‌ బియ్యం, ఇతర పీడీఎస్‌ సరుకులను నిల్వ చేసే అద్దె గోదాముల విషయంలో పౌరసరఫరాల సంస్థ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Civil Supplies Corporation : అద్దె గోదాములపై గోల!

  • బెజవాడలో ప్రైవేట్‌ గోడౌన్ల యజమానులు భేటీ

  • పౌరసరఫరాల సంస్థ నిర్ణయంపై అభ్యంతరాలు

అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): రేషన్‌ బియ్యం, ఇతర పీడీఎస్‌ సరుకులను నిల్వ చేసే అద్దె గోదాముల విషయంలో పౌరసరఫరాల సంస్థ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై ప్రైవేట్‌ గోడౌన్లను నేరుగా అద్దెకు తీసుకోవద్దని, ఆయా జిల్లాల్లో అవసరమైన బఫర్‌ గోడౌన్లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారానే తీసుకోవాలని సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ మనజీర్‌ జిలానీ ఇటీవల అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లకు లేఖ రాశారు. బఫర్‌ గోడౌన్ల నిర్వహణను గిడ్డంగుల సంస్థకే అప్పగించాలని నిర్ణయించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీమంత్రి పేర్ని నాని గోదాము, నంద్యాల జిల్లాలో మాజీ మంత్రి బంధువుల గోదాముల్లో రూ.కోట్ల విలువైన రేషన్‌ బియ్యం మాయమైన ఉదంతాలను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బఫర్‌ గోడౌన్లలో సివిల్‌ సప్లయిస్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు చోట్ల రేషన్‌ బియ్యం నిల్వల్లో భారీగా వ్యత్యాసాలను గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్‌ గోడౌన్లను నేరుగా అద్దెకు తీసుకోకూడదని, ప్రస్తుతం ఉన్నవాటిని కూడా వదిలించుకోవాలని కార్పొరేషన్‌ ఎండీ నిర్ణయించారు.

అయితే ఈ నిర్ణయాన్ని ప్రైవేటు గోడౌన్ల యజమానులు వ్యతిరేకిస్తున్నారు. వివిధ జిల్లాల ప్రైవేట్‌ గోడౌన్ల యజమానులు శుక్రవారం విజయవాడలోని ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. అధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల కార్పొరేషన్‌తోపాటు ప్రైవేటు గోడౌన్ల యజమానులు, రైతులు, ప్రజలకు కూడా నష్టం కలుగుతుందని అభ్యంతరాలు లేవనెత్తారు. గిడ్డంగుల సంస్థ గోడౌన్లు నిర్వహణకు నోచుకోకపోవడంతో కొన్నింటి పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, వాటిల్లో బియ్యం నిల్వ చేస్తే ఏ మేరకు భద్రత ఉంటుందనేది ప్రశ్నార్థకమేనని చెబుతున్నారు. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ అధికారులతో తనిఖీలు చేయించి నివేదిక తెప్పించుకోవాలని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు.


  • సొంత గోడౌన్లు లేక అద్దెల భారం

డిమాండ్‌ నేపథ్యంలో ప్రైవేటు గోడౌన్లను నేరుగా అద్దెకు తీసుకోవాలని 2022లో అప్పటి సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ఎండీ నిర్ణయించారు. అప్పటి నుంచి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్లతోపాటు మరో 36 ప్రైవేటు గోడౌన్లను అద్దెకు తీసుకుని 7 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా పీడీఎస్‌ సరుకులను నిల్వ చేస్తున్నారు. ప్రైవేట్‌ గోడౌన్లకు ఒక బస్తాకు రూ.4.25 లు అద్దె చెల్లిస్తుండగా.. పర్యవేక్షణ ఛార్జీల కింద 7 శాతం వెచ్చిస్తోంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా తీసుకుంటున్న గోడౌన్లకు బస్తాకు రూ.5 చొప్పున అద్దె, పర్యవేక్షణ ఛార్జీల కింద 8 శాతం నిధులు అదనంగా చెల్లిస్తున్నారు. దీంతో కార్పొరేషన్‌పై ఏడాదికి రూ.175 కోట్ల అద్దె భారం పడుతోంది. తాజా నిర్ణయం వల్ల ఏడాదికి రూ.20 నుంచి 25 కోట్ల మేర అదనపు భారం పడుతుందని ప్రైవేటు గోడౌన్ల యాజమానులు చెబుతున్నారు. గిడ్డంగుల సంస్థ పర్సంటేజీ ప్రాతిపదిక వల్ల తమకు బస్తాకు రూ.3.25 మాత్రమే దక్కేదని వాపోతున్నారు.


  • పర్యవేక్షణ లోపంతోగతంలో పలు ఘటనలు

కార్పొరేషన్‌ నేరుగా అద్దెకు తీసుకున్న ప్రైవేట్‌ గోడౌన్లలో బియ్యం నిల్వలు పక్కదారి పడుతున్నాయనేది దుష్ప్రచారమేనని యజమానులు కొట్టిపారేస్తున్నారు. సివిల్‌ సప్లయిస్‌ అధికారులు రాజకీయ ప్రమేయం ఉన్న గోడౌన్ల యాజమాన్యాలతో కుమ్మక్కైపోవడంతో వారికి చెందిన గోడౌన్లలోనే బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గిడ్డంగుల సంస్థకే పూర్తి బాధ్యతలు అప్పగించినంత మాత్రాన పీడీఎస్‌ సరుకులకు భద్రత ఉంటుందన్న గ్యారంటీ ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. ఆ సంస్థలో సిబ్బంది కొరత వల్ల ఒక్కో మేనేజరు 2-3 గోడౌన్ల బాధ్యతలు చూడాల్సి వస్తోందని చెబుతున్నారు. పర్యవేక్షణ లోపంతో గతంలో ఆత్మకూరులోని గిడ్డంగుల సంస్థ గోడౌన్‌లో రూ.కోట్ల విలువైన కందులు, శనగలు మాయమైపోయాయని, నంద్యాల గోడౌన్‌లో పీడీఎస్‌ బియ్యం స్టాకు తక్కువ వచ్చిందని, అనంతపురం జిల్లాలోని తిమ్మంచెర్లలో తప్పు డు బిల్లులు పెట్టి పౌరసరఫరాల సంస్థ నుంచి రూ.కోట్లు కొల్లగొట్టారని చెబుతున్నారు. తూర్పుగోదావరిలో గిడ్డంగుల సంస్థ అద్దెకు తీసుకున్న గోడౌన్లలో రూ.కోట్ల విలువైన పీడీఎస్‌ బియ్యం పాడైపోతే.. ఒక ఉద్యోగిని సస్పెండ్‌ చేసి ఊరుకున్నారన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 05:33 AM