Share News

Weather Prediction: నైరుతిలో సాధారణ వర్షపాతం

ABN , Publish Date - Apr 10 , 2025 | 05:18 AM

ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణ వర్షపాతం ఉంటుంది. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షాలు కురవగా, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది

Weather Prediction: నైరుతిలో సాధారణ వర్షపాతం
Weather Updates

ఆగస్టు, సెప్టెంబరులో ఎక్కువ వర్షాలు.. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ అంచనా

  • సీజన్‌ ఆశాజనకంగా ఉంటుందన్న ఇంగ్లండ్‌ శాస్త్రవేత్త

  • ఐఎండీ బులెటిన్‌ వచ్చే వారం విడుదల

విశాఖపట్నం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ అంచనా వేసింది. దీర్ఘకాల సగటు (96 నుంచి 104 శాతం)లో 103 శాతం(ఐదు శాతం అటూఇటుగా) వర్షపాతం నమోదుకానుందని ప్రకటించింది. దీర్ఘకాల సగటు అంటే జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ గల నాలుగు నెలల నైరుతి సీజన్‌లో 865.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాలి. అయితే 895 మి.మీ. వర్షపాతం కురుస్తుందంటూ రైతాంగానికి స్కైమెట్‌ తీపికబురు అందించింది. ఇంకా యూకే(యునైటెడ్‌ కింగ్‌డమ్‌) వాతావరణ శాఖ, యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ అంచనా మేరకు భారతదేశంలో సగటు, అంతకంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుందని యూకే వర్సిటీ ఆఫ్‌ రీడింగ్‌లోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్పియర్‌ సైన్స్‌ శాస్త్రవేత్త అక్షయ డియోరాన్‌ వెల్లడించారు. కాగా, నైరుతి రుతుపవనాల సీజన్‌కు సంబంధించి ముందస్తు అంచనా బులెటిన్‌ను భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వచ్చేవారం విడుదల చేయనుంది. గతేడాది డిసెంబరులో పసిఫిక్‌ మహా సముద్రంలో ఏర్పడిన లానినా ప్రస్తుతం బలహీనపడుతోంది.


ఈ నెలలో తటస్థ పరిస్థితులు ఏర్పడి ఆగస్టు వరకూ కొనసాగుతాయని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఇప్పటికే అంచనా వేశాయి. ఎట్టి పరిస్థితుల్లో నైరుతి సీజన్‌లో ప్రతికూల ఫలితాలు ఇచ్చే ఎల్‌నినో రాదని ఇప్పటికే ఐఎండీ స్పష్టం చేసింది. దీనికితోడు ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో తటస్థంగా ఉన్న ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌(ఐవోడీ) జూన్‌కల్లా పాజిటివ్‌ దశకు చేరుకుంటుంది. పసిఫిక్‌ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు, హిందూ మహాసముద్రంలో జూన్‌ నాటికి వచ్చే పాజిటివ్‌ దశ వల్ల రానున్న నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్‌ పేర్కొంది. జూన్‌, జూలై కంటే ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయని వివరించింది. పశ్చిమ కనుమలు, దక్షిణ భారతంలో మంచి వర్షాలు కురుస్తాయి. నైరుతి సీజన్‌లోనే కోర్‌ ఏరియాగా గుర్తించే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో సమృద్ధిగా వర్షాలు కురవనున్నాయి. పశ్చిమ కనుమల వెంబడి అంటే కేరళ, కోస్తా కర్ణాటక, గోవాల్లో అధిక వర్షపాతం, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఇతర కొండ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకానుంది.


ఏ నెలలో ఎంత వర్షపాతమంటే?

జూన్‌లో సాధారణ వర్షపాతం 165.3 మి.మీ. కురవాల్సి ఉండగా 159.7 (96 శాతం), జూలైలో 280.5 మి.మీ.కుగాను 286.1 మి.మీ (రెండు శాతం ఎక్కువ), ఆగస్టులో 254.9కి 275.3 (8శాతం ఎక్కువ), సెప్టెంబరులో 167.9కి. 174.6 మి.మీ. వర్షపాతం(4 శాతం ఎక్కువ) నమోదవుతుందని అంచనావేసింది. జూన్‌లో కేరళ, కర్ణాటక, కొంకణ్‌, గోవాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం, మధ్యభారతంలో సాధారణం, జూలైలో పశ్చిమ కనుమల్లో సాధారణం కంటే ఎక్కువగా, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఆగస్టులో మధ్య, తూర్పుభారతంలో సాధారణం కంటే ఎక్కువగా, దక్షిణ, ఉత్తర భారతాల్లో సాధారణంగా, సెప్టెంబరులో పశ్చిమ కనుములు, మధ్యభారతంలో సాధారణం కంటే ఎక్కువగా, కోస్తాంధ్ర, తమిళనాడు, కొంకణ్‌, దక్షిణ గుజరాత్‌లలో తక్కువ వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్‌ అంచనా వేసింది. ఎల్‌నినో రాకపోతే భారత్‌లో నైరుతి సీజన్‌ ఆశాజనకంగా ఉంటుందని అక్షయ డియోరాన్‌ వెల్లడించారు. ఈ ఏడాది నైరుతి సీజన్‌లో ఎల్‌నినో రాదని ఐఎండీ ఇప్పటికే పేర్కొన్న నేపథ్యంలో వచ్చే వర్షాకాలంలో మంచి వర్షాలు కురుస్తాయన్నారు.


Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 08:47 AM