Share News

Nellore Collector: కరేడుపై అపోహలొద్దు.. చర్చలకు సిద్ధం

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:29 AM

నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసోల్‌ సోలార్‌ పరిశ్రమకు భూసేకరణపై రైతులకు ఎటువంటి అపోహలు వద్దని జిల్లా కలెక్టర్‌ ఓ ఆనంద్‌ అన్నారు..

Nellore Collector: కరేడుపై అపోహలొద్దు.. చర్చలకు సిద్ధం

4,800 ఎకరాలే సేకరణ.. ఆ మేరకే ప్రాథమిక నోటిఫికేషన్‌

  • 3 గ్రామాలే ఖాళీ అవుతాయి

  • మిగిలిన గ్రామాలు, భూముల జోలికెళ్లం

  • ‘ఆంధ్రజ్యోతి’తో నెల్లూరు కలెక్టర్‌ ఆనంద్‌

(నెల్లూరు-ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసోల్‌ సోలార్‌ పరిశ్రమకు భూసేకరణపై రైతులకు ఎటువంటి అపోహలు వద్దని జిల్లా కలెక్టర్‌ ఓ ఆనంద్‌ అన్నారు. 4,800 ఎకరాలకు మాత్రమే ప్రాథమిక నోటిఫికేషన్‌ ఇచ్చామని, ఇప్పటికైతే అంతకుమించి భూములను తీసుకోబోమని స్పష్టం చేశారు. అది కూడా మూడు పంటలు పండే భూములను తీసుకోవడం లేదన్నారు. మూడు హ్యాబిటేషన్లు మాత్రమే ఖాళీ అవుతాయని, మిగిలిన హ్యాబిటేషన్ల జోలికి వెళ్లబోమని తెలిపారు. రైతులకు ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావచ్చని అన్నారు. రామాయపట్నం పోర్టు ఫలితంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నా రు. ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటైతే మరింత వృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. కరేడులో భూసేకరణపై అక్కడి రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కలెక్టర్‌ ప్రత్యేకంగా ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. రైతులు, స్థానిక ప్రజలు ఎవరూ అపోహలు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ‘‘కరేడు గ్రామ పరిధిలో 19 హ్యాబిటేషన్లు ఉండగా, సుమారు 12వేల ఎకరాల భూములున్నాయి. వీటిలో 4,800 ఎకరాలే సోలార్‌ పరిశ్రమకు భూసేకరణ చేస్తున్నాం. మిగిలిన భూములను తీసుకోవడం లేదు. భూసేకరణలో మూడు హ్యాబిటేషన్లు మాత్రమే ఖాళీ అవుతాయి. మిగిలిన 16 హ్యాబిటేషన్ల జోలికి వెళ్లడం లేదు. పశ్చిమ ప్రాంతంలోని భూములనే సేకరిస్తున్నాం. ఈ ప్రాంతంలో 14 వేల మంది వరకూ జనాభా ఉండగా వారిలో ఐదు వేలమందికి పైగా మత్స్యకారులే ఉన్నారు. మత్స్యకారుల వేటకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు’’ అన్నారు.


కోరుకున్న చోట ఆర్‌అండ్‌ఆర్‌

‘‘భూసేకరణలో భాగంగా మూడు హ్యాబిటేషన్ల పరిధిలోని సుమారు 300 కుటుంబాలను అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది. ఈ కుటుంబాలన్నింటికీ భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, ఇతర ప్రయోజనాలు అందిస్తాం. వీరు కోరుకున్న చోట ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ ఏర్పాటు చేస్తాం. వీరందరికీ సోలార్‌ పరిశ్రమలో ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. స్థానికంగా ఏర్పాటయ్యే పరిశ్రమల్లో ఉద్యోగాలను స్థానికులకిచ్చేలా కృషి చేస్తాం’’ అని తెలిపారు.

ఎవరికీ అన్యాయం జరగదు

‘భూసేకరణ విషయంలో రైతులకు ఎటువంటి అనుమానాలున్నా నివృత్తి చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. భూసేకరణ చట్టం ప్రకారం భూములకు పరిహారం నిర్ణయించాం. పంట భూములకు ఎకరాకు రూ.12.5 లక్షలు, కొబ్బరి చెట్లున్న భూములకు ఎకరాకు రూ.17.5లక్షలుగా నిర్ణయించాం. జాతీయ రహదారి ఆనుకొని ఉన్న భూములకు రూ.62.5 లక్షల వరకూ ఉంది. ఈ పరిహారం విషయంలో ఎలాంటి అభ్యంతరాలున్నా మాకు చెప్పొచ్చు. వారితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 04:29 AM