Share News

Nellore: వైసీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే సోమిరెడ్డి..

ABN , Publish Date - Feb 05 , 2025 | 08:58 PM

ఆంధ్రప్రదేశ్: నలుగురు ఉండే కుటుంబానికి లక్షల చదరపు అడుగుల ప్యాలెస్‌లు ఎందుకంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి మండిపడ్డారు. తల్లిని, చెల్లిని దూరం చేసుకున్న ఆయన కూటమి నేతల సంగతి చూస్తానంటే నవ్వొస్తోందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.

Nellore: వైసీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే సోమిరెడ్డి..
MLA Somireddy Chandra Mohan Reddy

అమరావతి: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తన రెండో వెర్షన్ "జగన్ 2.O" మెుదలైందంటూ చేసిన వ్యాఖ్యలపై నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) స్పందించారు. జగన్ 2.O కాస్తా 'పాయింట్ 5'గా మారిపోతుందేమో చూసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2.O అనేది జగన్ చివరి వెర్షన్ కాబోతోందని సోమిరెడ్డి అన్నారు. ఏపీ ప్రజలు ఫ్యాన్ పార్టీ (YSRCP) అధినేతను ఇక నమ్మే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు భరోసా కలిగిందని చెప్పుకొచ్చారు. లండన్ నుంచి దిగగానే జగన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన జగన్.. వైసీపీ కార్యకర్తల గురించి మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందని చెప్పుకొచ్చారు.


అంత ప్యాలెస్ అవసరమా?

కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ మారుపేరని, టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసం మంత్రి నారా లోకేశ్ కొత్తకొత్త ఆలోచనలు చేస్తుంటే జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన పార్టీ కార్యకర్తలను వదిలేసి ప్యాలెస్‌లు కట్టించుకుంటూ సమయం గడుపుతున్నారని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. నలుగురు ఉండే కుటుంబానికి లక్షల చదరపు అడుగుల ప్యాలెస్‌లు ఎందుకంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. తల్లిని, చెల్లిని దూరం చేసుకున్న జగన్ రెడ్డి.. కూటమి నేతల సంగతి చూస్తానంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. 16 నెలలు జైల్లో తోడున్న ఏ-2 విజయసాయిరెడ్డే జగన్‌ను వదిలేసిన తర్వాత ఇక ఆయన్ను నమ్మేదెవరంటూ చురకలు అంటించారు.


ఎన్ని పాయింట్లు పెట్టినా ఏం కాదు..

వైసీపీ కార్యక్రమాలకు కార్యకర్తలు రాకపోవడంతో ఆ పార్టీ అధినేత జగన్ కొత్త డ్రామాలు మొదలుపెట్టారని శాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు. ఐదేళ్లుగా కార్యకర్తల గొంతు కోశానని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారని, ఇప్పుడు ‌మళ్లీ‌ కార్యకర్తల జపం మెుదలుపెట్టారని మండిపడ్డారు. జగన్ టూరిస్ట్ పాత్ర పోషిస్తూ పార్టీ శ్రేణులకు నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోతున్నారని రవినాయుడు చెప్పుకొచ్చారు. ఏపీవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు టీడీపీకే వరించాయని, ఇక వైసీపీ పనైపోయిందనే ఎద్దేవా చేశారు. జగన్ గుండెకాయ, తలకాయ, కుడి భుజం, ఎడమ భుజం అందరూ వైసీపీకి రాజీనామాలు చేశారని చెప్పారు. తనను నమ్మాలంటూ ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. నమ్మిన వారి గొంతు కోసిన జగన్‌ను ఎవరూ నమ్మడం లేదని, 2.O కాదు ఎన్ని పాయింట్లు పెట్టుకున్నా జగన్ పక్కన నిలబడే వారు లేరని చెప్పుకొచ్చారు. ఇప్పుడైనా మానవత్వంతో జగన్ ఆలోచన చేస్తే ఆయనకే మంచిదని శాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు.


జగన్ ఏమన్నారంటే..

కాగా, విజయవాడ నగరపాలక సంస్థ వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి ఇవాళ (బుధవారం) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. " జగన్ 2.O మెుదలైంది. గతంలో పార్టీ శ్రేణులకు అధిక ప్రాధాన్యత ఇవ్వలేకపోయా. ఈసారి మీకు ఏం చేయగలనో చేసి చూపిస్తా. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టను. దొంగ కేసులతో జైల్లో పెట్టినా.. రెట్టించిన ఉత్సాహంతో పని చేద్దాం. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్‌ కేసులు వేస్తా. రానున్న ఎన్నికల నుంచి 30 ఏళ్లపాటు రాష్ట్రాన్ని ఏలుతామని" చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

YS Jagan: మళ్లీ అధికారంలోకి వస్తాం.. 30 ఏళ్లు ఏలుతాం.. జగన్ జోస్యం

Leopard: పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన చిరుత.. ఆ తర్వాత రైతు ఏం చేశాడంటే..

Updated Date - Feb 05 , 2025 | 08:58 PM