Prayagraj : మహా కుంభమేళాలో లోకేశ్ దంపతులుమహా కుంభమేళాలో లోకేశ్ దంపతులు
ABN , Publish Date - Feb 18 , 2025 | 03:36 AM
సోమవారం ఉదయం ప్రయాగ్‌రాజ్ చేరుకున్న లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్... త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో పుణ్యస్నానం ఆచరించారు.

కుమారుడితో కలసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం
కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు
విశాలాక్షి అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
కాలభైరవ ఆలయాన్ని దర్శించి పూజలు
న్యూఢిల్లీ/అమరావతి, ఫిబ్రవరి17(ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ దంపతులు తమ కుమారుడితో కలిసి పాల్గొన్నారు. సోమవారం ఉదయం ప్రయాగ్‌రాజ్ చేరుకున్న లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్... త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో పుణ్యస్నానం ఆచరించారు. గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. పెద్దలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. మహా కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదని, ఇది భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వమని లోకేశ్ పేర్కొన్నారు. నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తివంతమైన వేడుకని అని అన్నారు. లోకేశ్ దంపతులు వారాణసీ వెళ్లి జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధిగాంచిన కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కాశీ విశాలాక్షి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారాణసీలో పురాతన ఆలయాల్లో ఒకటైన కాలభైరవ ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు.
కుంభమేళాలో ప్రముఖులు
మహా కుంభమేళాలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ దంపతులు, కొవ్వూరు ఎమ్మె ల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కుటుంబ సభ్యులు పుణ్యస్నానాలు ఆచరించారు.