Share News

Nara Bhuvaneshwari: తమిళంలో పలకరించిన భువనేశ్వరి.. ఎలారిక్కిం సౌగ్యమా అంటూ..

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:00 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబానాయుడు సతీమణి భువనేశ్వరి తమిళంలో మాట్లాడారు. ఎలారిక్కిం సౌగ్యమా... అంటూ పలకరించారు. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. అయితే.. అక్కడికి విచ్చేసిన వారితో తమిళంలో మాట్లాడారు.

Nara Bhuvaneshwari:  తమిళంలో పలకరించిన భువనేశ్వరి.. ఎలారిక్కిం సౌగ్యమా అంటూ..

- మహిళలను తమిళంలో పలకరించిన భువనేశ్వరి

కుప్పం(చిత్తూరు): సీఎం సతీమణి, ఎన్టీయార్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) శుక్రవారం శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు విశేషాలు చోటు చేసుకున్నాయి. శాంతిపురం మండలం తుమ్మిశి పెద్ద చెరువు, రామకుప్పం మండలం విజలాపురం చెరువులవద్ద ఆమె జలహారతి ఇచ్చారు. ఆయా చెరువులవద్దకు పెద్దయెత్తున ప్రజలు తరలివచ్చారు. చెరువుల పరిసరాలు టీడీపీ జెండాలతో పసుపుమయమయ్యాయి. చంద్రబాబు జిందాబాద్‌ అన్న నినాదాలతో మార్మోగాయి.


nara1.2.jpg

- శాంతిపురం మండలం కడపల్లెనుంచి తుమ్మిశి చెరువు దాకా భువనేశ్వరి ఆర్టీసీ బస్సులో మహిళలతో కలసి ప్రయాణించారు. స్త్రీ శక్తి పథకం గురించి, తద్వారా వారికి చేకూరుతున్న లబ్ధిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్సులోని అందరికీ ఆధార్‌ కార్డు చూసి, మహిళా కండక్టర్‌ జీరో ఫేర్‌ టికెట్టు ఇచ్చింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న భువనేశ్వరిని కూడా ఆధార్‌ కార్డు చూపించమని కోరింది. అయితే ఆధార్‌ కార్డు తనవద్ద లేదని, ఫోన్‌లో ఉన్నా, దాన్ని ఇంటివద్దనే మరచిపోయానని భువనేశ్వరి సమాధానం ఇచ్చింది. ఆధార్‌ కార్డు చూపించకుంటే టికెట్టు తీసుకోవాల్సిందేనని కండక్టర్‌ చెప్పడంతో భువనేశ్వరి టికెట్టు కొనుగోలు చేసింది.


- నడింపల్లెలో మహిళలతో ముఖాముఖి సంభాషించిన భువనేశ్వరి తాను తరచూ కుప్పం వస్తున్న కారణం ఏమిటో వివరించారు. మూడు నెలలకోసారి కుప్పం వచ్చి ప్రజలను పలకరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రాభివృద్ధి యజ్ఞంలో ఆయనకు టైం చిక్కడం లేదన్నారు. దీంతో కుప్పం వెళ్లి ప్రజలను పలకరించి వారి సమస్యలను తెలుసుకుని తనకు చెప్పాల్సిందిగా చంద్రబాబే తనను అడిగారన్నారు. అందుకే ఆయన బదులుగా తాను కుప్పం వస్తున్నానని రహస్యాన్ని విప్పారు. అంతేకాదు భువనేశ్వరి తన ప్రసంగాన్ని ఎలారిక్కిం సౌగ్యమా (అందరూ బాగున్నారా) అంటూ తమిళంలో ప్రారంభించారు. సుమారు 50 సెకండ్లపాటు సభలోని మహిళలను తన తమిళ సంభాషణతో అలరించారు. కుప్పం నియోజకవర్గం తమిళనాడు సరిహద్దుల్లో ఉండడంతో ఇక్కడ తమిళ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువ. అందుకనే ఆమె తమిళంలో ప్రసంగాన్ని ప్రారంభించారు.అంతకు ముందు స్థానిక మహిళలు కొందరు కోలాటమాడారు. వారితో కలిసి భువనేశ్వరి కూడా అడుగులు వేశారు.


nara1.3.jpg

- శాంతిపురం మండలం కెనమాకులపల్లెలో మొక్కలు నాటే కార్యక్రమానికి భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పరిరక్షించడం బాధ్యతగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. కెనమాకులపల్లెలో నూతనంగా నిర్మించిన లక్ష్మీ వైభవ్‌ కాంప్లెక్స్‌ను భువనేశ్వరి ప్రారంభించారు.

- రామకుప్పం మండలం విజలాపురం నుంచి ప్రయాణిస్తున్న సమయంలో మార్గమధ్యంలో చిన్నారులను చూసి వాహనం దిగారు. వారివద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సోషల్‌ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు

రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణం!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 22 , 2025 | 11:00 AM