Share News

Visakhapatnam: విశాఖకు మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 23 , 2025 | 07:27 PM

విశాఖకు మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు రాబోతున్నాయని, భవిష్యత్ పెట్టుబడులు, అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మౌలిక వసతులకు లోటు లేకుండా ప్రణాళికలు అమలు చేయాలని..

Visakhapatnam: విశాఖకు మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు: సీఎం చంద్రబాబు
CM on Visakhapatnam

అమరావతి, జులై 23: విశాఖకు మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు రాబోతున్నాయని, భవిష్యత్ పెట్టుబడులు, అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మౌలిక వసతులకు లోటు లేకుండా ప్రణాళికలు అమలు చేయాలని అన్నారు. ఇవాళ(బుధవారం) సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ భేటీ జరిగింది. ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 4 కంపెనీల ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(SIPB) ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా ఏపీలో 50వేలకు పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.


ఇక ఏపీలో రూ.16,466 కోట్లతో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ సంస్థ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నంలో మొదటిదశలో ఆ సంస్థ రూ.1,466 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 200 మందికి ఉపాధి లభించనుంది. రెండో దశలో రూ.15వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 400 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.

ఇక, విశాఖ మధురవాడలో సాత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ రూ.1,500కోట్ల పెట్టుబడులు పెడుతుండగా.. 25,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండాడ (విశాఖ)లో రూ.1,250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

దీంతో మొత్తంగా విశాఖలో 15,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. మరోవైపు ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మధురవాడలో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తద్వారా 10,000 ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.


ఇదిలా ఉండగా.. విజయవాడ నోవాటెల్‌లో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ -2025 స‌ద‌స్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుంటేనే అభివృద్ధి సాధ్యమ‌ని స‌ద‌స్సునుద్దేశించి సీఎం ప్ర‌సంగించారు. ఈ స‌ద‌స్సులో ఏపీ సీఎస్, మంత్రులు, వివిధ‌దేశాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.


కాగా, విజయవాడ నోవా టెల్ హోటల్ లో జరిగిన ఇన్వెస్టోపియా సదస్సుపై మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఏఐ అండ్ డేటా సెంటర్లపై జరిగిన చర్చలో పాల్గొన్నానని పేర్కొన్నారు. డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో ఉంటుందని లోకేష్ తెలిపారు. సౌత్ ఏషియాలోనే తొలి 152 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏపీ రాజధాని అమరావతిలో జనవరిలో ఆవిష్కృతం కాబోతోందన్నారు. ఇది యావత్ ఎకో సిస్టమ్ ను మార్చబోతుందని లోకేష్ వెల్లడించారు.

విశాఖపట్నం డేటా సిటీగా అభివృద్ధి చెందుతోందని చెప్పిన నారా లోకేష్.. అంతర్జాతీయంగా పలు ప్రఖ్యాత సంస్థలు విశాఖలో తమ డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఇప్పటివరకూ సంప్రదాయ విద్యావిధానం కొనసాగుతున్న నేపథ్యంలో ఏఐ వంటి అధునాతన సాంకేతికతకు ట్రాన్స్ ఫార్మేషన్ కష్టతరమైన పనేనని అయితే, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యలో ఏఐ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా రెన్యువబుల్ ఎనర్జీ, ఇన్ ఫ్రా, డిజిటల్ గవర్నెన్స్, ఏఐ ఫస్ట్ యూనివర్సిటీ, జీనోమ్ సీక్వెన్సింగ్, క్వాంటమ్ వ్యాలీ, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి యూఏఈ ఆర్థికమంత్రి అబ్దుల్ బిన్ తక్ ఆల్ మరితో చర్చించానని లోకేష్ తన సందేశంలో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

ర్యాపిడో ఎక్కి భయపడ్డ యువతి.. కొద్దిసేపటి తర్వాత..

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? ఈ హోమ్ డ్రింక్స్ మీ కోసమే.!

Updated Date - Jul 23 , 2025 | 08:14 PM