IMD: హైదరాబాద్ వాసులకు రెడ్ అలర్ట్
ABN , Publish Date - Jul 23 , 2025 | 06:51 PM
హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం మరో కీలక సూచన చేసింది. జులై 23, 24 తేదీల్లో హైదరాబాద్ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.

హైదరాబాద్, జులై 23: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని చెప్పింది. అలాగే నిర్మల్, నిజామాబాద్ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం మరో కీలక సూచన చేసింది. జులై 23, 24 తేదీల్లో హైదరాబాద్ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. బుధవారం అంటే.. ఈ రోజు సాయంత్రం లేకుంటే రాత్రి సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రహదారులపై భారీగా వర్షపు నీరు నిలుస్తుందని పేర్కొంది.
వర్షాలతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడనుందంది. అదే విధంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశముందని వివరించింది. ఈ మేరకు రహదారులపై వాన నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీకి స్పష్టం చేసినట్లు తెలిపింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పలు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించింది. ఇక ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు రోడ్డు, రైల్వే శాఖను అప్రమత్తం చేసినట్లు వివరించింది.
ఇక జులై 24వ తేదీ అంటే.. గురువారం సైతం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ సమయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈదురు గాలుల కారణంగా భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగే అవకాశముందని చెప్పింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులకు కీలక సూచన చేసింది. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించకుండా అడ్డుకొంటున్న కేంద్రం
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
Read latest Telangana News And Telugu News