Share News

Excise Dept : ఎక్సైజ్‌ కమిషనరేట్‌లో ఎమ్మెల్యే హల్‌చల్‌!

ABN , Publish Date - Mar 07 , 2025 | 04:39 AM

నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఎక్సైజ్‌ కమిషనరేట్‌లో హల్‌చల్‌ చేశారు. ఏకంగా ఆ శాఖ డైరెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ చాంబర్‌కు వెళ్లి ఒక రకంగా ఘెరావ్‌ చేశారు.

Excise Dept : ఎక్సైజ్‌ కమిషనరేట్‌లో ఎమ్మెల్యే హల్‌చల్‌!

  • డైరెక్టర్‌ను ఘెరావ్‌ చేసిన చదలవాడ అరవిందబాబు

  • డిపోలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపునకు డిమాండ్‌

  • తానిచ్చిన జాబితాలో వారందరికీ పోస్టింగ్‌ ఇవ్వాలని ఒత్తిడి

  • అప్పుడే చాంబర్‌ నుంచి వెళ్తానంటూ సోఫాలో బైఠాయింపు

  • మంత్రి కొల్లు, ఎమ్మెల్యే జీవీ ఫోన్‌లో మాట్లాడినా బేఖాతరు

గుంటూరు/అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఎక్సైజ్‌ కమిషనరేట్‌లో హల్‌చల్‌ చేశారు. ఏకంగా ఆ శాఖ డైరెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ చాంబర్‌కు వెళ్లి ఒక రకంగా ఘెరావ్‌ చేశారు. మద్యం డిపోలో పనిచేస్తున్న ఔట్‌సోరింగ్‌ ఉద్యోగులను వెంటనే మార్చేయాలని డిమాండ్‌ చేశారు. నరసరావుపేటలోని ఎక్సైజ్‌ శాఖకు చెందిన ఐఎంఎల్‌ డిపోలో 11మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో నియమితులయ్యారనే వంకతో వారిలో ఒకరు మినహా మిగిలిన పదిమందిని వెంటనే తొలగించాలని, వారి స్థానాల్లో తాను సూచించిన పదిమందిని తక్షణమే ఉద్యోగంలోకి తీసుకోవాలని అరవిందబాబు గురువారం మధ్యాహ్నం ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి పట్టుబట్టారు. ఇదే విషయమై తాను రాసిన లేఖపై స్పందన లేదనే విషయాన్ని డైరెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. తాను చెప్పినవారికి అవకాశం కల్పిస్తేనే చాంబర్‌ నుంచి బయటకు వెళతానంటూ అక్కడే సోఫాలో పడుకుని నిరసన వ్యక్తంచేసినట్లు తెలిసింది. దీంతో దిక్కుతోచని డైరెక్టర్‌... ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్రకు సమాచారం అందించారు. మంత్రితో పాటు వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు ఫోన్‌లో మాట్లాడి సముదాయించినా చాంబర్‌ నుంచి వెళ్లేందుకు ఎమ్మెల్యే అంగీకరించలేదు. చివరకు రెండు గంటల తర్వాత నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని నర్సరావుపేట డిపో మేనేజర్‌ను ఆదేశిస్తూ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో అరవిందబాబు అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా, ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించడం విమర్శలకు దారితీస్తోంది. ప్రతిపక్ష నేతలు వచ్చి నిరసనలు చేయడం సహజమేనని, కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే తీరుతో అధికారులు, ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఇకపై పనులు కావాల్సిన ఎమ్మెల్యేలు ఇలాగే ఆఫీసుకు వచ్చి నిరసనలు చేస్తే తామేం చేయాలని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Mar 07 , 2025 | 04:41 AM