AP Minister: పనుల నత్తనడక సహించం
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:36 AM
ప్రాజెక్టుల పనుల్లో జాప్యం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మంత్రి నిమ్మల, కాంట్రాక్టర్లు మరియు అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. హంద్రీ-నీవా సహా కీలక ప్రాజెక్టుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించనున్నట్లు వెల్లడించారు

కాంట్రాక్టర్లు, అధికారులకు నిమ్మల హెచ్చరిక
త్వరలో హంద్రీ-నీవా పనులను
సీఎం స్వయంగా పరిశీలిస్తారని వెల్లడి
అమరావతి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): హంద్రీ-నీవా సుజల స్రవంతి, పోలవరం ఎడమ ప్రధాన కాలువ, వెలిగొండ ప్రాజెక్టు పనులు లక్ష్యాలను చేరుకోకపోవడంపై నిర్మాణ సంస్థలు, అధికారులపై జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల నత్తనడక సహించబోమని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన టార్గెట్లను అందుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్‌నాటికి హంద్రీ-నీవా, పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి కావలసిందేనని స్పష్టంచేశారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులతో ఆయన సమీక్ష జరిపారు. జిల్లాల్లోని ఎస్‌ఈలు, ఈఈలు వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు. ఈ మూడు ప్రాజెక్టుల కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులూ హాజరయ్యారు.
హంద్రీ-నీవా పనులను త్వరలోనే క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి పరిశీలిస్తారని, ఆయన పర్యటనలోగా నిర్మాణ వేగం పెంచాలన్నారు. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ఎనిమిదో తేదీ దాకా ప్రాజెక్టు ప్రాంతంలో అంతర్జాతీయ నిపుణులు పర్యటించనున్నారని.. ఆలోగా డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మాణానికి మూడు కట్టర్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. వీటి పనులను సకాలంలో చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు కట్టర్లు, రెండు గ్రాబర్ల సాయంతో 217 మీటర్ల వాల్ నిర్మాణం పూర్తయిందని, మే మొదటివారంలో మూడో కట్టర్‌తో పనులు మొదలుపెడతామని అధికారులు వివరించారు. వర్షాకాలం మొదలయ్యేలోపు ఎగువ కాఫర్ డ్యాంను పటిష్ఠపరుస్తామని తెలిపారు. బట్రస్ డ్యాంను మే చివరినాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్-2లో బెంచింగ్ లైనింగ్ పనులు ఈ నెలలో నిర్దేశించిన మేరకు పనులు పూర్తిచేయకపోవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ పనులకు వెంటనే టెండర్లు పిలవాలన్నారు.
ఇవి కూడా చదవండి
AP Govt: ‘వేస్ట్ మేనేజ్‌మెంట్’పై కీలక ఒప్పందం
Gorantla Madhav: ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకొంటున్న ప్రజలు
Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
For More AP News and Telugu News