Minister Sandhya Rani: ఉడకని అన్నం అరకొరగా కూర
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:07 AM
మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాలూరు కేజీబీవీ పాఠశాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నాణ్యతలేని భోజనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

మీ పిల్లలకూ ఇలాగే భోజనం పెడతారా?
కేజీబీవీ నిర్వాహకులపై మంత్రి సంధ్యారాణి ఆగ్రహం
సాలూరు, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ‘ఉడికీ ఉడకని అన్నం. 152 మందికి కొద్దిగే కూర... ఏమిటిది?. మీ పిల్లలకూ ఇలాగే పెడతారా?‘ అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం ఖరాసువలసలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)ను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిలోకి వెళ్లి ఆహార పదార్థాలను పరిశీలించారు. ఉడికీ ఉడకని అన్నాన్ని చూసి.. ‘ఇలాంటి ఆహారం తింటే పిల్లలకు కడుపు నొప్పులు రావా? 152 మందికి ఈ కూర ఎలా సరిపోతుంది?’ అని ప్రశ్నించారు. విద్యాలయంలో ప్రత్యేకాధికారి పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, పూర్తిస్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.