Minister Parthasarathi: జగన్‌కు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదు
ABN , Publish Date - Jun 29 , 2025 | 04:20 AM
ఐదేళ్ల పాలనలో విధ్వంసం సృష్టించిన జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్రంలో తిరిగే హక్కు లేదని గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

జగన్ అండ్ కో రాజకీయాలను చూసిప్రజలు అసహ్యించుకుంటున్నారు
ఏడాది పాలనలో పది లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం
అభివృద్ధిపై చర్చకు సిద్ధం: మంత్రి పార్థసారథి
విశాఖపట్నం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల పాలనలో విధ్వంసం సృష్టించిన జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్రంలో తిరిగే హక్కు లేదని గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శనివారం ఇక్కడి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రీ కాల్ బాబు పేరుతో వైసీపీ కార్యక్రమం నిర్వహిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో హామీల అమలు, తమ ఏడాది పాలనపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. జగన్, వైసీపీ నాయకుల రాజకీయాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు ప్రజలను జగన్ మభ్యపెట్టారని, హైదరాబాద్ లాంటి రాజధాని ఉంటే దాని ఫలాలు రాష్ట్రమంతా అందించే అవకాశం ఉంటుందన్న కనీస జ్ఞానం ఆయనకు లేకుండా పోయిందన్నారు.
బాధ్యత కలిగిన వ్యక్తిగా గడచిన ఐదేళ్లు పాలించి ఉంటే రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిలేది కాదని, నీరో చక్రవర్తి మాదిరిగా పాలించి నాశనం చేశాడని విమర్శించారు. జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు కేంద్రం రూ.25 వేల కోట్లు కేటాయించిందని, కానీ, రెండు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి రాలేదని, తాము ఏడాది పాలనలో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంవోయూలు చేసుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ అక్రమాలు, అరాచకాలు, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్మోహన్‌రెడ్డి.. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎన్ని హామీలను అమలు చేశారో చెప్పాలన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి ఊరూరా మద్యాన్ని ఏరులు పారించారని, మరో 25 ఏళ్లకు మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టారని విమర్శించారు. జగన్ రాజకీయాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, అటువంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండడానికి అర్హతలేదన్నారు.