Share News

Minister Kollu Ravindra: ఆగస్టులోగా సారాను తరిమి కొట్టండి

ABN , Publish Date - Apr 10 , 2025 | 05:24 AM

ఆగస్టు తరువాత నాటు సారా కనిపించకూడదనే లక్ష్యంతో మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాను ఆదర్శంగా తీసుకుని గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు

Minister Kollu Ravindra: ఆగస్టులోగా సారాను తరిమి కొట్టండి

  • గంజాయి కనిపించకుండా గట్టిగా పనిచేయాలి

  • రాష్ట్రస్థాయి ఎక్సైజ్‌ అధికారుల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర

తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ఆగస్టు తరువాత నాటు సారా కనిపించకూడదు. ఆమేరకు లక్ష్యాలు నిర్దేశించుకొని పనిచేయాలి’ అని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి అతిథి గృహంలో బుధవారం జరిగిన రాష్ట్ర స్థాయి ఎక్సైజ్‌ అధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘నవోదయం-2 లక్ష్యం నెరవేర్చి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గంజాయి, నాటు సారా, మాదక ద్రవ్యాలను పూర్తిగా కట్టడి చేయాలి. అన్ని జిల్లాల ఎక్సైజ్‌ అధికారులు సమన్వయం చేసుకుని సరిహద్దు ప్రాంతాల్లో గట్టిగా నిఘా ఉంచాలి’ అని సూచించారు. రాష్ట్ర ఎక్సైజ్‌ డైరెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌, ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌ దేవ్‌ శర్మ మాట్లాడుతూ... ‘గంజాయి నియంత్రణ, నాటు సారా కట్టడి, మాదక ద్రవ్యాలు కనిపించకుండా చేయడానికి అన్ని ప్రాంతాల్లో టోల్‌ ఫ్రీ నంబరు 14405 పై ముమ్మరంగా ప్రచారం చేయాలి’ అని ఆదేశించారు. ‘మద్యం నాణ్యతపై మందుబాబుల నుంచి కంప్యారిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. తిరుపతిలో ఎక్కువగా విద్యాసంస్థలు ఉన్నాయి. ఎక్కువ ఫోకస్‌ పెట్టండి. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాలి’ అని రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు. మద్యం వల్ల నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో అధికారుల పనితీరుపై ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈస్ట్‌ గోదావరి, రాజమహేంద్రవరం, పల్నాడు, శ్రీకాకుళం, పలాస వంటి ప్రాంతాల్లో ఎక్కువగా నేరాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. అతి తక్కువగా నేరాలు జరుగుతున్న చిత్తూరు జిల్లాను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని ఆదేశించారు. బహిరంగ తాగుడు ఎక్కడా కనిపించకుండా అధికారులు పనిచేయాలని కోరారు.


లిక్కర్‌ మాఫియాను వదిలిపెట్టం: కొల్లు

గత ఐదేళ్ల కాలంలో జగన్‌ జమానాలో సాగిన లిక్కర్‌ మాఫియా కేసులో ఎవరినీ వదలి పట్టేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మద్యంలో జరిగిన అవినీతి అక్రమాలను ఆ పార్టీ నేతలే బట్టబయలు చేశారన్నారు. క్యాష్‌ అండ్‌ క్యారీ పద్ధతిలో దాదాపు రూ.లక్ష కోట్లు లావాదేవీలు జరగడంపై సీఐడీ విచారణ జరుగుతోందని తెలిపారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్‌.. మద్యం వ్యాపారాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీని అధ్యయనం చేసి, నూతన విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. మద్యం నాణ్యతపై 13 రకాల పరీక్షలను 5 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 05:25 AM