Sajjala Sridhar Reddy: అంతా జగన్ ఆదేశాలతోనే
ABN , Publish Date - Apr 27 , 2025 | 03:48 AM
మద్యం మాఫియా స్కాంలో మాజీ సీఎం జగన్ ప్రత్యక్ష మార్గదర్శకత్వంతో నిధులు వైసీపీ ఖాతాల్లోకి మళ్లించారని సిట్ వెల్లడించింది. ఇందులో సజ్జల శ్రీధర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపింది.

మద్యం ముడుపులు వైసీపీ ఖాతాల్లోకి చేరేలా ప్రణాళిక
ఈ వ్యవహారాన్నంతా నడిపిన సూత్రధారి సజ్జల శ్రీధర్ రెడ్డి
వ్యాపారుల నుంచి ప్రతి నెలా రూ.60 కోట్ల కమీషన్ వసూలు
అందుకు అంగీకరించని లిక్కర్ బ్రాండ్ల అణచివేత
ఎస్పీవై ఆగ్రోస్ పునరుద్ధరించి మిథున్ రెడ్డితో వ్యాపారం
అక్కడినుంచే నల్లధన ప్రవాహం
సజ్జల శ్రీధర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడి
అమరావతి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): మద్యం స్కాం మాజీ సీఎం జగన్ ప్రత్యక్ష మార్గదర్శకత్వంలో సాగిందని, లిక్కర్ మాఫియా నుంచి అందిన నిధులను వైసీపీ ఖాతాల్లోకి మళ్లించారని సిట్ తేల్చింది. నాసిరకం మద్యంతో కంపెనీలూ వాటి నుంచి కమీషన్ల రూపంలో వైసీపీ పెద్దలూ వేల కోట్లు ఎలా దోచుకున్నారనేది కోర్టుకు తెలిపింది. వసూళ్లకు ప్రణాళిక రచించి, సొంతంగా మద్యం వ్యాపారం నిర్వహించింది ఎస్పీవై ఆగ్రోస్ అధినేత సజ్జల శ్రీధర్ రెడ్డియేనని (ఏ-6) తేల్చింది. ఎంపీ మిథున్ రెడ్డికి భాగస్వామిగా మద్యం స్కాంలో కీలకంగా వ్యవహరించారని తెలిపింది. ఈ కేసులో శ్రీధర్‌రెడ్డిని శనివారం విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. కుంభకోణంలో ఆయన పాత్రపై రిమాండ్ రిపోర్ట్‌లో వివరించారు. సంతకం చేసేందుకు నిందితుడు నిరాకరించడంతో మధ్యవర్తుల సమక్షంలో రికార్డు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్, విజయవాడలో జరిగిన సమావేశాల్లో చర్చలు, మద్యం మాఫియా ఏర్పాటుకు వ్యూహం, అమలు, వసూళ్లు, నిధుల సమీకరణ, షెల్ కంపెనీల వివరాలు, నల్ల డబ్బు ప్రవాహం, జగన్ మార్గనిర్దేశకత్వం వరకూ అన్ని వివరాలు సిట్ వెల్లడించింది. ఈ రిపోర్టును అనుసరించి..
నెలకు 60 కోట్ల ముడుపులకు ప్లాన్
ప్రతి నెలా 60 కోట్లకు తగ్గకుండా ఐదేళ్ల పాటు వసూలు చేసిన మద్యం ముడుపుల ప్రణాళిక సహా పలు వ్యవహారాల్లో శ్రీధర్‌రెడ్డి ప్రధాన కుట్రదారు అని తేల్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లోని కసిరెడ్డి కార్యాలయంలో సమావేశం జరిగింది. ఏపీ మద్యం వ్యాపారులతో జరపాల్సిన చర్చలు, అడగాల్సిన కమీషన్ల శాతం ఖరారు చేశారు. ఆ తర్వాత వైసీపీకి చేకూర్చాల్సిన ఆదాయంపై సుదీర్ఘంగా చర్చించారు. మద్యం వ్యాపారులను పలుమార్లు స్టార్ హోటళ్లకు, ప్రైవేటు గెస్ట్‌హౌ్‌సలకు పిలిపించి 12 శాతం కమీషన్ డిమాండ్ చేశారు. అంతిమంగా జూన్ 2019లో పార్క్ హయత్ హోటల్‌లో కసిరెడ్డి, ఆయన బామ్మర్ది ముప్పిడి అవినాశ్‌రెడ్డి అలియాస్ సుమిత్, కొందరు డిస్టిలరీస్ ప్రతినిధులతో కలిసి శ్రీధర్‌రెడ్డి ప్రణాళిక రూపొందించారు. అక్టోబరు 2019లో అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో(జూబ్లీహిల్స్) కీలక సమావేశం జరిగింది. కేంద్ర సర్వీసులకు చెందిన వాసుదేవరెడ్డి (తర్వాత ఏపీఎ్‌సబీసీఎల్ ఎండీ అయ్యారు), సత్యప్రసాద్(ఏపీఎ్‌సబీసీఎల్ స్పెషల్ ఆఫీసర్), కసిరెడ్డి, మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. జూన్-అక్టోబరు మధ్య మద్యం వ్యాపారులతో జరిపిన చర్చల సారాంశాన్ని విశ్లేషించుకుని, కమీషన్లకు అంగీకరించని లిక్కర్ బ్రాండ్ల అణచివేత, అంగీకరించిన వాటికి ప్రోత్సాహం, కమీషన్ల విధానం అంశాలపై నిర్దారణకు వచ్చారు.
అరబిందో అప్పులో మిథున్‌కి లబ్ధి.. 2019లో అప్పటి సీఎం జగన్ సూచన మేరకు అరబిందో గ్రూపు కంపెనీలు ఎస్పీవై ఆగ్రోస్ పునరుద్ధరణకు రూ.45 కోట్లు సమకూర్చాయి. లిక్కర్ సరఫరాకు కొత్తగా పుట్టుకొచ్చిన ఆదాన్ సంస్థకు మరో రూ.60 కోట్లు అందాయని శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. వాస్తవానికి ఎస్‌పీవై ఆగ్రోస్‌కు అరబిందో నుంచి అందిన నిధులు 37కోట్లు మాత్రమేనని, మిగతా రూ.8 కోట్లు ముడుపుల రూపంలో ఎంపీ మిథున్‌రెడ్డి సహా వైసీపీ ప్రముఖులకు చేరాయని తెలిపారు. అరబిందో అప్పులో రూ.5 కోట్లను మిథున్‌రెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, డి-కార్డ్ లాజిస్టిక్స్, సన్హాక్ ల్యాబ్స్ వంటి వాటిలోకి దారిమళ్లించినట్లు చెప్పేశారు. అయితే భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా మిథున్‌రెడ్డి ఆ డబ్బులు వెనక్కి ఆన్‌లైన్‌లో చెల్లించి తర్వాత నగదు రూపంలో తీసుకున్నారు. అయితే అరబిందో నుంచి తీసుకున్న డబ్బులు ప్రతి నెలా కోటి చొప్పున 2022 వరకూ చెల్లించిన శ్రీధర్ రెడ్డి, ఆ తర్వాత అంతర్గత విభేదాలతో బయటికి వెళ్లిపోయి చెల్లించలేదు. అప్పటి నుంచి ఎస్పీవై ఆగ్రోస్ యజమానిగా తాను లేనని చెప్పినట్లు సిట్ వెల్లడించింది.
షెల్ కంపెనీలు, నల్ల డబ్బు ప్రవాహం...
ఎస్పీవై ఆగ్రోస్ నుంచి ఓల్విక్, కృపతి, నైస్నా, బాలాజీ ట్రేడిండ్, వెంకటేశ్వర ప్యాకేజింగ్, విషాల్ ఎంటర్‌ప్రైజెస్ వంటి షెల్ కంపెనీలు లావాదేవీలు జరిపినట్లు సిట్ విచారణలో శ్రీధర్‌రెడ్డి వివరించారు. వాటి ద్వారా చెల్లింపులు జరిపి అక్కడి నుంచి మద్యం మాఫియా చలామణి కొనసాగించినట్లు కోర్టుకు సిట్ నివేదించింది. శ్రీధర్‌రెడ్డి చెప్పిన దాని ప్రకారం మొత్తం ప్రణాళిక జగన్ మార్గదర్శకత్వంలోనే కొనసాగిందని సిట్ స్పష్టం చేసింది. మద్యం మాఫియా నుంచి సేకరించిన నిధులు వైసీపీ ఖాతాల్లోకి మళ్లినట్లు శ్రీధర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.
మాఫియాకు వ్యూహం...
వైసీపీలోని పెద్ద నాయకుడికి మొత్తం ప్రణాళిక వివరించి ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణకు ఏపీఎస్‌బీసీఎల్‌కు అధికారం ఇస్తూ కొత్తగా జీవో జారీ చేయించా రు. బాధ్యతలు నిర్వర్తించేందుకు నమ్మకస్థులైన వాసుదేవ రెడ్డి, సత్య ప్రసాద్‌ను కీలక స్థానాల్లో నియమించారు. రాష్ట్రంలో మద్యం విక్రయాల సాఫ్ట్‌వేర్‌ను యాభైశాతం మేర రద్దు చేసి, మాన్యువల్ ఆర్డర్ ఫార్మ్ వ్యవస్థను తెచ్చారు. నగదు చెల్లింపులకు ప్రాధాన్యం ఇచ్చారు. మరోవైపు డిస్టిలరీలు, సరఫరాదారులతో శ్రీధర్‌రెడ్డి సమావేశమై మార్కెట్ షేర్, లేబుల్ ఆమోదాల కోసం లంచాల గురించి వివరించారు. అందుకు తలూపని వారిని పక్కన బెట్టారు.
జైలుకు సజ్జల శ్రీధర్‌రెడ్డి
లిక్కర్ స్కామ్ కేసులో మే 6వరకు రిమాండ్
మద్యం కుంభకోణం కేసులో ఎస్పీవై డిస్టిలరీస్ అధినేత సజ్జల శ్రీధర్‌రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది.ఈ కేసులో శ్రీధర్‌రెడ్డిని ఏ6గా సిట్ పేర్కొంది. అంతకుముందుగా, ఆయనకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. శ్రీధర్‌రెడ్డికి మే ఆరో తేదీ వరకు న్యాయాధికారి పి.భాస్కరరావు రిమాండ్ వెల్లడించారు. అనంతరం ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.