Share News

Tribal Village : వైద్యం అందక గిరిజన మహిళ మృతి

ABN , Publish Date - Feb 21 , 2025 | 05:25 AM

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను మూడు రోజులు, మూడు ఆసుపత్రులకు తిప్పినా ప్రాణాలు దక్కలేదు.

Tribal Village : వైద్యం అందక గిరిజన మహిళ మృతి

  • డోలిలో స్వగ్రామానికి మృతదేహం

కుక్కునూరు, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాల ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగానే ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను మూడు రోజులు, మూడు ఆసుపత్రులకు తిప్పినా ప్రాణాలు దక్కలేదు. చివరికి గ్రామానికి రోడ్డు కూడా లేకపోవడంతో డోలీలో మృతదేహాన్ని తీసుకురావాల్సి వచ్చింది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పెదరావిగూడెం పంచాయతీలోని బండారిగూడెంలో ముచికి దేవమ్మ(45) అనారోగ్యం బారినపడింది. ఆమెను బంధువులు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు కిడ్నీకి సంబంధించిన వ్యాధి రావడంతో డయాలసిస్‌ చేయాల్సి వచ్చింది. దీంతో బంధువులు ఆమెను చింతూరు, అక్కడి నుంచి రంపచోడవరం, ఆతర్వాత రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ దేవమ్మ చనిపోయింది. అప్పటికే బంధువుల వద్ద ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు వారి చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో సీపీఐ మండల కార్యదర్శి మైసాక్షి వెంకటాచారిని ఆశ్రయించగా.. ఆయన సాయంతో మహాప్రస్థానం అంబులెన్స్‌లో గురువారం సాయంత్రం మృతదేహాన్ని వెంకటాపురం తీసుకొచ్చారు. అక్కడి నుంచి గ్రామానికి రోడ్డు లేకపోవడంతో డోలి ఏర్పాటుచేసి మృతదేహాన్ని సుమారు రెండున్నర కిలోమీటర్లు మోసుకువెళ్లి.. గ్రామానికి చేరుకున్నారు.

Updated Date - Feb 21 , 2025 | 05:25 AM