Share News

Kuppam CM House: కొత్తింట్లోకి సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 26 , 2025 | 03:25 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వ నియోజకవర్గమైన కుప్పంలో శివపురంలో కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలే అతిథులుగా పాల్గొన్నారు.

 Kuppam CM House: కొత్తింట్లోకి సీఎం చంద్రబాబు

  • కుప్పంలో వేడుకగా గృహ ప్రవేశం

  • నియోజకవర్గ ప్రజలే ముఖ్య అతిథులు

  • తొలి రోజు నూతన గృహంలోనే సీఎం బస

కుప్పం, మే 25(ఆంధ్రజ్యోతి): మూడున్నర దశాబ్దాలుగా తాను ప్రాతినిఽథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ ఇంటివారయ్యారు. శాంతిపురం మండలం శివపురంలో నూతనంగా ఇల్లు నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, ఆయన తనయుడు లోకేశ్‌, బ్రాహ్మణి దంపతులు నూతన గృహప్రవేశం చేశారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ ఆహ్వానం అందడంతో పెద్దఎత్తున ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చంద్రబాబు కుటుంబం రాత్రి ఆ ఇంట్లోనే బస చేసింది. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, గురజాల జగన్మోహన్‌, మురళీమోహన్‌ తదితరులు సీఎం దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు పెద్దఎత్తున సీఎం దంపతుల్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గృహ ప్రవేశ కార్యక్రమం పూర్తయ్యాక.. కడ (కుప్పం ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ), కుప్పం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాల్లో సీఎం పాల్గొన్నారు.


అందరినీ వరుసలో పంపుతూ..

గృహ ప్రవేశ అనంతరం ఇంటి గుమ్మం బయట చంద్రబాబును అక్కడున్నవారు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారంతా వరుసలో వస్తుండగా.. తండ్రికి ఎదురుగా మంత్రి లోకేశ్‌ ఉండి.. ఫొటోలు తీసుకునే వారు క్యూలో రావాలని, తీసుకున్న వారు వెంటనే వెళ్లిపోవాలని చెబుతూ వచ్చారు. చంద్రబాబుతో ఫొటోలు తీసుకున్న తర్వాత లోకేశ్‌ వద్దకు ఫొటోల కోసం వెళ్తే ఆయన సున్నితంగా తిరస్కరించారు. ‘నాన్నతో తీసుకుంటే చాలు, నాతో తర్వాత తీసుకోవచ్చు’ అని చెప్పారు. ఆ తర్వాత ఆయన అభిమానుల కోసం ప్రత్యేకంగా సెల్ఫీలు తీసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు.

36 ఏళ్ల తర్వాత సెంథిల్లు

నూతన గృహ ప్రవేశం సందర్భంగా నారా లోకేశ్‌, బ్రాహ్మణి సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, సమాచారాన్ని పంచుకున్నారు. ‘36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా నిలుస్తూ, ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్న కుప్పం ప్రజల సమక్షంలో నేడు మా సొంతిటి గృహ ప్రవేశం జరిగింది. మీరు చూపించే ప్రేమ, ఆత్మీయతలు మరువలేని అనుభూతిగా మిగిలిపోతుంది. ఇది మా కుటుంబ పండుగ కాదు, మనందరి పండుగ. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు దీవెనగా నిలుస్తాయి. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ణతలు’ అని లోకేశ్‌ పోస్ట్‌ పెట్టారు. ‘కుప్పం గృహ ప్రవేశానికి నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు వచ్చి తమ సొంతింటి పండుగలా పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చింది. ఇంత మంది ఆత్మీయుల ఆశీర్వాదం అందుకోవడం నిజంగా అదృష్టం. వారి అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఙతలు తెలుపుతున్నాను’ అని నారా బ్రాహ్మణి పోస్ట్‌ చేశారు.

Updated Date - May 26 , 2025 | 05:54 AM