Cyber Suraksha: డిజిటల్ అరెస్ట్ నేరాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు: సీపీ
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:24 PM
సైబర్ నేరాలను ఎంతగా అరికట్టాలని చూసినా.. నేరగాళ్లు మాత్రం అంతకంతకు రెచ్చిపోతున్నారు. విజయవాడ నగర సీపీ రాజశేఖర బాబు వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు.
విజయవాడ, నవంబర్ 17: సైబర్ నేరాలను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. నేరగాళ్లు మాత్రం కొత్త ఎత్తులు వేస్తున్నారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. డిజిటల్ అరెస్ట్ నేరాలను నివారించేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. సైబర్ సురక్ష అనే స్లోగన్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి.. సైబర్ నేరగాళ్ల ఆట కట్టిస్తామని ఆయన సోమవారం విజయవాడలో ప్రకటించారు. బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు, ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే విధంగా సైబర్ సురక్షా పేరుతో నెల రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సైబర్ నేరాలు వివిధ రూపాలలో జరుగుతున్నాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వారి కదలికలపై దృష్టి పెట్టి దొంగలను పట్టుకుంటున్నామని పేర్కొన్నారు.
చైన్ స్నాచర్స్, బైక్ దొంగలు, గంజాయికి బానిసలుగా మారి చోరీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ తరహా చోరీలను అరికడుతున్నామని తెలిపారు. తాము తీసుకున్న చర్యల వల్ల నలభై శాతం నేరాలు తగ్గాయని వివరించారు. ఎప్పుడూ లేని విధంగా 80 శాతం రికవరీతో విజయవాడ పోలీసులు ముందున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలను గత ఏడాది కంటే ఈ ఏడాది 92 మందికి తగ్గించగలిగామన్నారు. వీటిపై సిబ్బందికి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ చురుగ్గా పని చేసేలా చేస్తున్నామని వివరించారు.
దాతల సహకారంతో ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. పది వేల సీసీ కెమెరాలు.. డాష్ బోర్టులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సైబర్ క్రైమ్ నేడు పెను సవాల్‌గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లితేనే.. ఈ తరహా నేరాలను నిరోధించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. సైబర్ సిటిజన్ అమల్లోకి తీసుకు వచ్చామని.. భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయని విజయవాడ నగర సీపీ రాజశేఖర్ బాబు ఆశా భావం వ్యక్తం చేశారు.
బ్యాంకర్స్‌తో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరగాళ్లు కరెంట్ అకౌంట్లు ఏర్పాటు చేసి.. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. సేవింగ్స్ నుంచి కరెంట్ అకౌంట్‌గా మార్చే ప్రతి ఖాతాను తప్పకుండా పరిశీలించాలని సూచించినట్లు తెలిపారు. ఈ సైబర్ నేరాలపై అవగాహన కోసం ఫామ్ ప్లేట్లు సైతం ముద్రించి.. వారితో చదివించడం ద్వారా అవగాహనకు తీసుకువస్తున్నామన్నారు. అక్కడక్కడా కొంతమంది బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యంతో నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. డిజిటల్ అరెస్టులు చాలా వరకు నిరోధించగలిగామని ఎన్టీఆర్ జిల్లా పోలీసులుగా తాము గర్వంగా చెబుతున్నామన్నారు. సైబర్ ప్రాస్టర్స్‌ను కచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నగర సీపీ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు.
పోలీసుల పరంగా తీసుకునే చర్యల వల్ల నేరగాళ్లు తప్పించుకో కూడదని పేర్కొన్నారు. జీరో టోలరెన్స్ టూ క్రైం, సైబర్ క్రైం అని సీఎం చంద్రబాబు చెబుతుంటారని.. ఎటువంటి పరిస్థితుల్లో డిజిటల్ అరెస్టులు జరగకూడదని పేర్కొన్నారు. నెల రోజుల పాటుసైబర్ సురక్షా అనే కార్యక్రమం తీసుకుని.. దానిని ప్రారంభిస్తున్నామని తెలిపారు. 226 బ్యాంకులలో అవగాహన తీసుకు వచ్చేందుకు 226 టీంలు, బ్యాంకు ఉద్యోగులతో కలిసి.. ఖాతాదారుల్లో మార్పు తీసుకు వస్తామన్నారు.
ఉన్నతస్థాయిలో దీనిపై సమావేశం ఏర్పాటు చేసి ప్రణాళికలు కూడా సిద్ధం చేశామని తెలిపారు. ఒక చిన్న అప్లికేషన్ కూడా రూపొందించామని.. దీనిని చదివితే ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందని చెప్పారు. ఇన్వెస్టిమెంట్ మోసాలు కూడా బాగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తులు ఆసక్తికరంగా చేసే ప్రకటనలు నమ్మి రూ. లక్షల్లో నగదు పోగొట్టుకున్నారని వివరించారు. ఈ ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్ నివారణ కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుందన్నారు.
వీటిని నివారించేందుకు ఎలా ముందుకు సాగాలనే దానిపై ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ప్రాపర్టీ క్రైం నిరోధించడంలో పై చేయి సాధించినా.. వైట్ కాలర్ క్రైం, సైబర్ క్రైంలను నిరోధించాల్సి ఉందని పేర్కొన్నారు. అందులో పోలీస్ సిబ్బందికి అన్ని విధాలా శిక్షణ ఇస్తున్నామన్నారు. సైబర్ క్రిమినల్స్‌కు తప్పకుండా ముక్కుతాడు వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాల్ సెంటర్ అరాచకాలపై దృష్టి పెడతామని నగర సీపీ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నకిలీ టీటీడీ లేఖలు.. పోలీసులకు మంత్రి పీఏ ఫిర్యాదు
విశాఖ ఉక్కుపై ప్రభుత్వం కీలక ప్రకటన
For More AP News And Telugu News