AP High Court TTD: పరికామణిలో చోరీ కేసు.. టీటీడీ అధికారులపై న్యాయమూర్తి అసహనం
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:26 PM
ఈ నెల 27న టీటీడీ ఈవో.. కోర్టు ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. లేనిపక్షంలో 20 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
అమరావతి, అక్టోబర్17: తిరుమల పరకామణిలో చోరీ కేసుపై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు సహా ప్రాథమిక దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సీఐడీ సమర్పించింది. ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ అధికారుల తీరుపై హైకోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 27న టీటీడీ ఈవో.. కోర్టు ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. లేనిపక్షంలో 20 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తిరుమల పరకామణిలో చోరీ ఘటనపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని హైకోర్టును టీటీడీ కోరింది. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయమిస్తూ ఈనెల 27కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
కాగా.. 2023లో వైసీపీ ప్రభుత్వంలో తిరుమల పరకామణిలో చోరీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. పరకామణి చోరీపై టీటీడీ విజిలెన్స్‌కు 2023లోనే ఫిర్యాదు అందింది. రవికుమార్ అనే ఉద్యోగి పెద్ద ఎత్తున పరకామణిని కొల్లగొట్టారని ఆరోపణలతో ఫిర్యాదులు వెళ్లాయి. అయితే ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపకుండానే అప్పటి టీటీడీ అధికారులు లోకాయుక్తతో రాజీ చేయించారు. ఇప్పుడు తాజాగా పరకామణిలో చోరీ వ్యవహారంపై శ్రీనివాసులు అనే వ్యక్తి పిటిషన్ వేయడంతో ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. పరకామణి చోరీ కేసులో చోరీపై సీఐడీ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో తిరుమల పరకామణిలో దస్త్రాలను సీఐడీ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.
సీఐడీ కాదు.. సీబీఐతో విచారణ: శ్రీనివాసులు
పరకామణిలో శ్రీవారి కానుకలను చోరీ చేసిన వ్యవహారంలో ఈరోజు హైకోర్టులో విచారణ జరిగిందని.. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేశారని పిటిషనర్ మాచర్ల శ్రీనివాసులు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయనందుకు ఈవోకు 20,000 జరిమానా న్యాయమూర్తి విధించారని తెలిపారు. రవికుమార్ అనే వ్యక్తి పెద్ద జీయర్ మట్టం నుంచి 15 సంవత్సరాలుగా రెగ్యులర్గా పరకామణి డ్యూటీకి వస్తున్నారని.. గత ఎడాది ఏప్రిల్ 29న సీసీ కెమెరాల్లో ఆయన చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని అన్నారు. నాడు ఈ మొత్తాన్ని బయటకు రాకుండా చూసిన వారిలో ఈవో ధర్మారెడ్డి పాత్ర ఉందని చెప్పారు. ఈ వ్యవహారంపై సీఐడీ విచారణ సరిపోదని.. సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సీబీఐని కూడా ధర్మారెడ్డి మాయ చేయగలరంటూ వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి వెనుక మాజీ ముఖ్యమంత్రి జగన్ హస్తం కూడా ఉందని నమ్ముతున్నట్లు తెలిపారు. భగవంతుని సొమ్మును కాపాడాలని కోరుతున్నానని శ్రీనివాసులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రెండు బెల్ట్ షాపుల మధ్య గొడవ.. ఏం జరిగిందంటే
బీసీ బిల్లు చంద్రబాబుతోనే సాధ్యం: బీసీ సంఘాలు
Read Latest AP News And Telugu News