Vamshi: ఈరోజైనా వంశీ నోరు విప్పుతారా.. మూడో రోజు వంశీ విచారణ..
ABN , Publish Date - Feb 27 , 2025 | 10:04 AM
వైఎస్సార్‌సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసుల విచారణలో నోరు విప్పడంలేదు. మూడో రోజు విచారణ నిమిత్తం పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కీలక సమాచారం రాబట్టేలా ఆధారాలతో సహా పోలీసులు ప్రశ్నలు సిద్ధం చేశారు.

విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader), గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Gannavaram Ex MLA Vallabhaneni Vamsi) ని రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు (Police).. మూడోరోజు గురువారం విచారణ నిమిత్తం జైల్లో ఉన్న వంశీని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కృష్ణలంక పోలీస్టేషన్ భవనంలో వంశీని విచారిస్తారు. ఎసిపి దామోదర్, సిఐ పవన్ కిషోర్, ఇతర అధికారులు ఉన్నారు. కాగా రెండు రోజుల విచారణలో పలు ప్రశ్నలకు వంశీ సమాధానాలు దాటవేశారు. మూడో రోజు మరింత సమాచారం రాబట్టేలా ఆధారాలతో సహా పోలీసులు ప్రశ్నలు సిద్ధం చేశారు. తొలి రోజు రెండున్నర గంటలు, రెండో రోజు ఐదు గంటలు పాటు పోలీసులు విచారించారు. కాగా ఈరోజుతో వంశీ కస్టడీ ముగియనుంది.
ఈ వార్త కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
వంశీకి గట్టి షాక్..
కాగా పోలీసు విచారణలో తమకు ‘అదుర్స్’ సినిమా చూపించిన వంశీకి రెండో రోజు పోలీసులు గట్టిగానే షాక్ ఇచ్చారు. బాధితుడు సత్యవర్ధన్ కిడ్నా్‌పకు ముందు, ఆ తర్వాత వంశీ ఎక్కడెక్కడ సంచరించారనేది గూగుల్ టేకవుట్ మ్యాప్‌ను ముందుపెట్టి, పక్కా ఆధారాలతో విచారించడంతో వంశీ ఉక్కిరిబిక్కిరి అయ్యారని సమాచారం. విచారణాధికారుల ప్రశ్నలకు తొలుత తెలియదు... గుర్తులేదు... మరచిపోయాను.. అంటూ బుధవారం కూడా వంశీ దాటవేత ధోరణి ప్రదర్శించారు. విచారణలో భాగంగా వంశీకి సెంట్రల్ ఏసీపీ దామోదర్ మొత్తం 25 ప్రశ్నలను సంధించారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో తనకు సంబంధం లేదని సత్యవర్ధన్‌తో కోర్టులో ఈ నెల 10న అఫిడవిట్ దాఖలు చేయించిన విషయం తెలిసిందే. ఈ ఘట్టం పూర్తయిన అనంతరం సత్యవర్ధన్‌ను హైదరాబాద్ తీసుకెళ్లారు. 11న సత్యవర్ధన్‌ను వైజాగ్ పంపిన తర్వాత 12న వంశీ తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లినట్టు గుర్తించారు. ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా తాడేపల్లికి చేరుకున్నారు. జగన్‌తో భేటీ అయిన తర్వాత వైజాగ్‌కు వెళ్లారు. జగన్ నివాసానికి ఎందుకు వెళ్లారని విచారణాధికారులు ప్రశ్నించగా, అక్కడకు వెళ్లలేదని వంశీ సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో గూగుల్ టేకవుట్ మ్యాప్‌ను ఆయన ముందు ఉంచినట్టు సమాచారం. వంశీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ గూగుల్ టేకవుట్‌తో పాటు నగరంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.
వైజాగ్‌లో అవసరాల కోసం...
సత్యవర్ధన్ కేసులో నిందితులుగా ఉన్న వెలినేని వెంకటరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతిని బుధవారం పోలీసులు విచారించారు. వంశీ చెబితేనే తాము వైజాగ్ వెళ్లామని వారు విచారణలో అంగీకరించారు. వంశీ అనుచరులు ఎర్రంశెట్టి రామాంజనేయులు, ఎతేంద్ర రామకృష్ణ చెప్పినట్టే నడుచుకున్నామని వెల్లడించినట్టు తెలిసింది. వీరిలో లక్ష్మీపతి ఎతేంద్ర రామకృష్ణకు బంధువు. ఆయన వద్ద కొన్నాళ్లు డ్రైవర్‌గా పనిచేశారు. వైజాగ్‌లో సత్యవర్ధన్‌ను ఎక్కడికైనా కారులో తీసుకెళ్లడానికి డ్రైవర్ అవసరమైతే అందుబాటులో ఉండడానికి లక్ష్మీపతిని అక్కడికి పంపారు. వెంకట రామకృష్ణ ప్రసాద్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. విచారణలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడం, దాటవేత ధోరణితో వ్యవహరించడంతో వంశీపై అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News