Share News

Supreme Court: పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో దక్కని ఊరట

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:50 AM

పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక మధ్యంతర రక్షణను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం.

Supreme Court: పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో దక్కని ఊరట
Supreme Court

న్యూఢిల్లీ, నవంబర్ 28: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టు (Supreme Court) బిగ్ షాక్ ఇచ్చింది. టీడీపీ నేతల జంట హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. సరెండర్ కావడానికి కొంత సమయం కావాలని పిన్నెల్లి తరపు లాయర్లు కోర్టును కోరారు. దీంతో సరెండర్ అయ్యేందుకు రెండు వారాల సమయాన్ని న్యాయస్థానం ఇచ్చింది. పల్నాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక మధ్యంతర రక్షణ రద్దు అయ్యింది. గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులను జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా రద్దు చేశారు.


పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పినా... సహకరించలేదని, సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలు ట్యాంపర్‌ చేసే ప్రయత్నం చేశారని రాష్ట్ర ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇద్దరిని చంపిన వ్యవహారంలో ముందస్తు బెయిల్‌ పొందేందుకు పిన్నెల్లి సోదరులకు ఏమాత్రం అర్హత లేదని జస్టిస్‌ సందీప్‌ మెహతా వ్యాఖ్యానించారు. వెంటనే అరెస్టు చేయడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే లొంగిపోవడానికి రెండు వారాలు సమయం ఇవ్వాలని పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాదులు కోరారు. ముందస్తు బెయిల్‌ విషయంలో లొంగిపోయేందుకు సమయం ఎలా ఇస్తారని జస్టిస్‌ సందీప్‌ మెహతా ప్రశ్నించారు.


సెక్షన్‌ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయని ప్రభుత్వాన్ని జస్టిస్‌ సందీప్‌ మెహతా ప్రశ్నించారు. నిందితుల 161 స్టేట్‌మెంట్‌ను పోలీసులు నిందితులకే ఎలా ఇస్తారని జస్టిస్ నిలదీశారు. పోలీసులు కూడా నిందితులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై కూడా పూర్తిస్థాయి దర్యాప్తు అవసరం అవుతుందేమోనని కూడా జస్టిస్ సందీప్ మెహతా అన్నారు. 161 స్టేట్‌మెంట్ కూడా తమకు అనుకూలంగా ఉందని, పోలీసుల విచారణలో పూర్తిగా సహకరిస్తున్నారని సుప్రీంకు పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాదులు తెలిపారు.


అసలు ఈ స్టేట్‌మెంట్‌ను నిందితులకు పోలీసులు ఎలా ఇచ్చారని జస్టిస్ సందీప్ మెహతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఛార్జిషీట్‌తో పాటు, 161 స్టేట్ మెంట్‌ను కోర్టుకు సమర్పించాలే తప్ప నిందితులు ఎలా పొందుతారని జస్టిస్ ప్రశ్నించారు. పోలీసులే తమకు 161 స్టేట్ మెంట్ ఇచ్చారని సుప్రీంకోర్టుకు పిన్నెల్లి తరపు న్యాయవాదులు తెలిపారు. దీంతో ఏపీ పోలీసుల వ్యవహార తీరుపై కూడా సుప్రీం ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నిందితులకు పోలీసులు కూడా బాగా సహకరిస్తున్నట్లు ఉందని అభిప్రాయపడింది. చివరకు పిన్నెల్లి సోదరులు లొంగిపోయేందుకు రెండు వారాల సమయాన్ని సుప్రీం కోర్టు ఇచ్చింది.


ఇదీ విషయం..

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరావు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరుల మందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు గతంలో కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1 గా జవిశెట్టి శ్రీను, ఏ2గా తోట వెంకట్రావు, ఏ3గా తోట గురవయ్య, ఏ4 గా నాగరాజు, ఏ5 గా తోట వెంకటేశ్వర్లు, ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని నిందితులుగా చేర్చారు. హైకోర్టు తీర్పును పిన్నెల్లి సోదరులు సుప్రీంలో సవాలు చేశారు. అయితే వారిద్దరికీ మధ్యంతర రక్షణ కల్పించిన సుప్రీం ధర్మాసం పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటీషన్‌పై తుది నిర్ణయం వెలువరించేంత వరకు వారిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలను జారీ చేసింది. తాజాగా పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు మధ్యంతర రక్షణ ఉత్తర్వులను కూడా రద్దు చేసింది.


ఇవి కూడా చదవండి...

వింత సంప్రదాయం.. వధువు వరుడిలా.. వరుడు వధువులా ముస్తాబు

అంబర్‌పేట్ ఎస్‌ఐ గన్‌ మిస్సింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 28 , 2025 | 12:10 PM