Share News

Purandeswari: పెద్దలను స్ఫూర్తిగా తీసుకుని.. పట్టుదలతో నడుచుకున్నా: పురందేశ్వరి

ABN , Publish Date - Jul 01 , 2025 | 12:19 PM

Purandeswari: కూటమి పార్టీల భాగస్వామ్యంతో నేడు అధికారంలో ఉన్నాం. దీని వెనుక కార్యకర్తల కృషి ఎంతో ఉంది.. వారికి నా ధన్యవాదాలు. స్వలాభపేక్ష అనేది నేను ఎప్పుడూ చూడలేదు, ఆశించలేదని ఎంపీ పురందేశ్వరి అన్నారు.

Purandeswari: పెద్దలను స్ఫూర్తిగా తీసుకుని.. పట్టుదలతో నడుచుకున్నా: పురందేశ్వరి
MP Daggubati Purandeswari

విజయవాడ, జులై 1: 2013లో‌ బీజేపీలోకి వచ్చిన నాటి నుంచి తనకు పార్టీ గౌరవం ఇస్తోందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (MP Daggubati Purandeswari) అన్నారు. బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడిగా మాధవ్ ప్రమాణ స్వీకారోత్సవ సభలో పురందేశ్వరి మాట్లాడుతూ.. రాజమండ్రి ఎంపీగా ఇచ్చి పార్లమెంటులో ఒక హోదా కల్పించారని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా రెండేళ్లల్లో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేశానని చెప్పుకొచ్చారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించినట్లు తెలిపారు. ఎందరో పెద్దలను స్పూర్తిగా తీసుకుని పట్టుదలతో వారి అడుగుజాడల్లో నడిచానన్నారు. తనను ప్రోత్సహించిన వారికి, అలాగే తనను ప్రతిఘటించిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు.


‘కూటమి పార్టీల భాగస్వామ్యంతో నేడు అధికారంలో ఉన్నాం. దీని వెనుక కార్యకర్తల కృషి ఎంతో ఉంది.. వారికి నా ధన్యవాదాలు. స్వలాభపేక్ష అనేది నేను ఎప్పుడూ చూడలేదు, ఆశించలేదు. కొన్ని నిర్ణయాలు నచ్చకపోయినా పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకున్నాను. నా రెండేళ్ల ప్రస్థానంలో పార్టీ అభివృద్ధి కోసం పని చేశాను. కొంతమంది నన్ను తప్పు పట్టిన, విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. నేడు మాధవ్‌కు అధ్యక్ష బాధ్యత అప్పగించాం. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా వెళతారని ఆశిస్తున్నా. నా మీద నమ్మకం ఉంచి బాధ్యత ఇచ్చిన బీజేపీ జాతీయ నాయకత్వానికి నా ధన్యవాదాలు’ అని అన్నారు.


ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న నేపథ్యంలో ఆచితూచి అడుగు వేయాలని సూచించారు. ఒకటికి పది సార్లు ఆలోచనలు చేసి మాట్లాడాలన్నారు. మాధవ్ ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని అడుగులు వేయాలని తెలిపారు. ఇప్పటి వరకు సహకారం అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ. తనకు దూరం చేయలేని పదవి కార్యకర్త అని.. వారి ‌కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటానని వెల్లడించారు. ‘పదవులు శాశ్వతం కాదని నాకు తెలుసు... ఎప్పుడూ మీతోనే, మీ వెంటే ఉంటానని కార్యకర్తలకు చెబుతున్నా. ఇప్పుడు కార్యకర్తగానే పార్టీ బలోపేతం కోసం‌ పని చేస్తా’ అని పురందేశ్వరి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

సిట్ కస్టడీకి చెవిరెడ్డి.. జైలు వద్ద హల్‌చల్

ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు వానలే వానలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 01 , 2025 | 12:23 PM