NTR వైద్యసేవా ట్రస్టు కింద వైద్య సేవలు పునఃప్రారంభం
ABN , Publish Date - Apr 08 , 2025 | 07:04 AM
ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘంతో సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు కింద వైద్య సేవలు మంగళవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి.

అమరావతి: ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు (NTR Health Services Trust) కింద వైద్య సేవలు (Medical Services) మంగళవారం నుంచి పునఃప్రారంభం (Resumption) కానున్నాయి. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో (CM Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం భేటీ అయింది. తక్షణమే రూ. 500 కోట్లు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. కాగా తమకు రావాల్సిన రూ. 3,500 కోట్లు బకాయిలు, తమ ఇబ్బందులను స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం చంద్రబాబుకు వివరించింది. అయితే త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కారం కనుక్కొందామని ముఖ్యమంత్రి వారికి సూచించారు. అనంతరం వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో చర్చలు జరిపారు. మంగళవారం నిధులు విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో వైద్యసేవలు పునరుద్ధరించాలని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాల సంఘం నిర్ణయించింది.
Also Read..: వంట గ్యాస్ మంట
కాగా రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవలను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.విజయ్‌కుమార్ వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టిందని, దీనివల్ల తాము దుర్భర పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారు. బకాయిల విడుదల కోసం ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్‌కు అనేకసార్లు విన్నవించామని, లిఖితపూర్వకంగానూ కోరామని తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తే కానీ మందులు, సర్జికల్ ఐటమ్స్ సరఫరా చేయలేమని ఆయా కంపెనీలు చేతులెత్తేస్తున్నాయని చెప్పారు. వైద్యులు, సిబ్బందికి 2 నెలలుగా జీతాలు నిలిపివేశామని చెప్పారు. దీనిపై గతనెల 7నే ట్రస్ట్‌కు లేఖ రాశామని, ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని తెలిపారు.
బకాయిలు విడుదల చేయాలంటూ గతేడాది జూలై నుంచి ప్రభుత్వానికి 26 సార్లు లేఖలు రాశామని డాక్టర్ కె.విజయ్‌కుమార్ అన్నారు. 2025-26 బడ్జెట్‌లో ఎన్టీఆర్ వైద్యసేవ పథకానికి రూ.4వేల కోట్లు కేటాయించగా, బకాయిలే రూ.3,500 కోట్లు ఉన్నాయన్నారు. కనీసం రూ.1,500 కోట్లు చెల్లిస్తే తప్ప సేవలు కొనసాగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆశా కార్యదర్శి డాక్టర్ అవినాశ్ మాట్లాడుతూ బీమా విధానంలోకి మారే క్రమంలో ఆయుష్మాన్ భారత్‌తో పథకాన్ని ఇంటిగ్రేట్ చేస్తామని అంటున్నారని, ఆయుష్మాన్ భారత్‌లోని 1,500 ప్రొసీజర్లు ఎన్టీఆర్ వైద్యసేవ కంటే తక్కువ ప్యాకేజీల్లో ఉన్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘంతో చర్చలు జరిపి వైద్య సేవలు పునఃప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హెచ్‌సీయూ విద్యార్థులపై కేసుల ఎత్తివేత
For More AP News and Telugu News