Share News

AP Govt Tirupati Flood Damage: రాయలచెరువు గండి ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Nov 10 , 2025 | 11:03 AM

మొంథా తుఫాను కారణంగా రాయలచెరువుకు గండి పడి ఊరిని మొత్తం ముంచెత్తింది. భారీగా నీరు రావడంతో పెద్దఎత్తున పశువులు మృత్యువాతపడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

AP Govt Tirupati Flood Damage: రాయలచెరువు గండి ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం
AP Govt Tirupati Flood Damage:

అమరావతి, నవంబర్ 10: మొంథా తుఫాను (Cyclone Montha) ఏపీలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ముందస్తు చర్యల వల్ల ప్రాణ నష్టం తప్పింది. అయితే పంట పొలాల్లోకి నీరు చేరడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్ట పరిహారం అందజేస్తామని.. ప్రతీఒక్కరినీ ఆదుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. అలాగే తుఫాను బాధితులకు ఇంటికి వెళ్లే ముందు రూ. మూడు వేల నగదు ఇవ్వడంతో పాటు బియ్యం, నిత్యావరసరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇక మొంథా తుఫాను కారణంగా తిరుపతి జిల్లాలో రాయల చెరువుకు గండి పడి అక్కడి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. అనేక పశువులు చనిపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


మొంథా తుఫాను కారణంగా తిరుపతి జిల్లాలో రాయల చెరువుకు గండిపడి నష్టపోయిన కుటుంబాలకు, పశువులకు ప్రత్యేక స్కేలు ఆర్థిక సాయం చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈరోజు (సోమవారం) విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి జయలక్ష్మి జీవో ఆర్టీనెంబర్ 125ను జారీ చేశారు. ఈనెల 6న వల్లూరు గ్రామం కేవీబీపురం మండలంలోని రాయలచెరువు ట్యాంకుకు గండి పడింది. దీంతో ఆ నీరంతా కాల్తూరు హరిజనవాడ, ఎస్‌ఎల్ పురం, పాతపాలెం గ్రామాల్లోకి రావడంతో భారీగా పశువులు చనిపోయాయి.


ఈక్రమంలో నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా వర్షాల వల్ల పునరావాసం పొందిన 960 కుటుంబాలకు కుటుంబానికి చొప్పున రూ.3 వేలు, 1100 పశువులు చనిపోవడంతో వాటి పరిహరంగా రూ.2 కోట్ల 95 లక్షలు చెల్లింపు కోసం జిల్లా కలెక్టర్‌కు అనుమతి మంజూరు అయ్యింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. వరద నీటి కారణంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

కార్తీక మాసం మూడో సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు

డిసెంబర్ 6న డాలస్‌‌లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. సభ కోసం భారీ ప్లానింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 10 , 2025 | 12:06 PM