Kartika Masam: కార్తీక మాసం మూడో సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Nov 10 , 2025 | 09:41 AM
కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు శివాలయాలకు చేరుకుని మహాదేవుడిని దర్శించుకుంటున్నారు.
అమరావతి, నవంబర్ 10: భోళా శంకరుడుకి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం (Kartika Masam). ఈ మాసంలో ఆ మహాదేవుడుని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, విశిష్టమైనది అని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదులుతుంటారు. శైవక్షేత్రాల్లో శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తుంటారు. హర హర మహాదేవ శంభోశంకర అంటూ శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతుంటాయి. ఇక కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా ఏపీలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పంచారామ క్షేత్రం, ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, పాదగయా క్షేత్రం, శ్రీశైలం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి ఈశ్వరుడిని దర్శించుకుంటున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి వారి పంచారామ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర కార్తీకమాసం మూడవ సోమవారం సందర్భంగా వేకువజాము నుంచి స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు.
విశాఖపట్నంలో కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు క్యూకట్టారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయాలు మారు మ్రోగుతున్నాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పంచాక్షరీనామంతో ఆలయంలో మార్మోగింది. తెల్లవారుజామున నుంచే భక్తులు సప్త గోదావరిలో స్నానమాచరించి శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారికి, స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు.
రాజమండ్రిలో కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శైవ క్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాకినాడ జిల్లాలోని పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో పెద్ద ఎత్తున కార్తీకమాస పూజలు నిర్వహించారు. కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో అరటి డొప్పలపై కార్తీక దీపాలు వెలిగించి పుష్కరిణిలో వదులుతూ భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు చేస్తున్నారు. రాజరాజేశ్వరి సమేత ఉమాకుక్కుటేశ్వర స్వామి వారిని, పదవ శక్తిపీఠం పురుహూతికా దేవి అమ్మ వార్లను దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
నంద్యాల: శ్రీశైలంలో భక్తులు కార్తీకమాసం పూజలు నిర్వహించారు. మూడవ సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. వేకువజామున నుంచే పాతాళగంగలో భక్తులు పుణ్యస్నాలు ఆచరించి గంగమ్మ ఒడిలో కార్తీక దీపాలను వదులుతూ మొక్కులు తీర్చుకుంటున్నారు. క్యూ కంపార్టుమెంట్‌లలో వేచి ఉన్న భక్తులకు శివసేవకులు పులిహోర, బిస్కెట్లు మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. గంగాధర మండపం వద్ద మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి...
డిసెంబర్ 6న డాలస్‌లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. సభ కోసం భారీ ప్లానింగ్
Read Latest AP News And Telugu News