Share News

Laparoscopic Surgery: కదిలొచ్చే.. వైద్య విద్యాలయం!

ABN , Publish Date - Nov 10 , 2025 | 04:53 AM

వైద్య విధానంలో కీలకమైన ల్యాప్రోస్కోపిక్‌లో మరింత అధునాత శిక్షణను యువ వైద్యులు, వైద్య విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యంగా....

Laparoscopic Surgery: కదిలొచ్చే.. వైద్య విద్యాలయం!

  • యువ వైద్యులు, విద్యార్థులకు వరం

  • ల్యాప్రోస్కోపిక్‌ చికిత్సలపై ఉచిత శిక్షణ

అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): వైద్య విధానంలో కీలకమైన ల్యాప్రోస్కోపిక్‌లో మరింత అధునాత శిక్షణను యువ వైద్యులు, వైద్య విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యంగా ‘కదిలొచ్చే వైద్య విద్యాలయం’ సోమవారం నుంచి 32 రోజుల పాటు రాష్ట్రంలో అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే ఎందరో వైద్యులకు శిక్షణ ఇచ్చిన ఈ వాహనాన్ని ప్రముఖ వ్యాపార సంస్థ ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎ్‌సఆర్‌) కింద నిర్వహిస్తోంది. ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆన్‌ వీల్స్‌’గా పేర్కొనే ఈ వైద్య విద్యాలయం బస్సు.. గత ఆరేళ్లుగా కొన్ని వేల మంది వైద్యులకు, వైద్య విద్యార్థులకు శస్త్ర చికిత్సల్లో మెలకువలు నేర్పించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు చేరువైంది. వైద్యులు, వైద్య విద్యార్థులకు ‘స్కిల్‌ ల్యాబ్‌’ శిక్షణను ఉచితంగా అందిస్తుంది. సోమవారం నుంచి డిసెంబరు 11 వరకు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని ఎంబీబీఎస్‌, పీజీ విద్యార్థులతో పాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు మొత్తంగా 1300 మందికి శిక్షణ ఇవ్వనుంది. ఎందరో ప్రముఖ వైద్యులు ఈ బస్సులో శిక్షణ పొందడం విశేషం. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కేవలం పాఠ్య, ప్రయోగ విజ్ఞానం అందుబాటులో ఉంది. అయితే, యువ వైద్యులు, విద్యార్థులు ఆశించిన స్థాయిలో అనుభవం గడించలేక పోతున్నారు. దీంతో వారు శస్త్ర చికిత్సల సమయంలో తడబడుతున్నారు. మరికొందరు సీనియర్‌ వైద్యుల పక్కన నిలబడి ఏళ్లతరబడి పరిశీలించాల్సి వస్తోంది. ఇలాంటి వారికి ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆన్‌ వీల్స్‌’ ఎంతగానో ఉపయోగపడుతోంది. సోమవారం విజయవాడలోని సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో తొలి రోజు శిక్షణ ప్రారంభం కానుంది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోకు ఈ వాహనం వెళ్లనుంది.


ల్యాప్రోస్కోప్‌ సర్జరీలపై శిక్షణ..

వాహనంలో ల్యాప్రోస్కోపిక్‌ శస్త్ర చికిత్స పద్ధతులు.. లైవ్‌ టిష్యూ (పిగ్‌ పేగులు), స్టిమ్యులేటర్స్‌(సర్జరీ లైవ్‌) వంటి పరికరాలను బస్సులో ఏర్పాటు చేశారు. వర్క్‌షా్‌పలో ల్యాప్‌ పండోప్లికేషన్‌(కడుపులో నుంచి అన్నవాహికలోకి యాసిడ్‌ ప్రవేశించకుండా నిలువరించే చికిత్స), ల్యాప్‌ బౌల్‌ అనాస్టమోసి్‌స(పేగు సర్జరీ), ల్యాప్‌ స్ల్పీనెక్టమీ(ప్లీహం తొలగించడం), ల్యాప్‌ హిస్టరెక్టమీ(గర్భసంచీ తొలగించడం), ల్యాప్‌ కొలెక్టమీ(పెద్దపేగు తొలగింపు) లలో మరింత శిక్షణ ఇవ్వనున్నారు. యువ వైద్యులు, విద్యార్థులకు ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆన్‌ వీల్స్‌’ అద్భుత అవకాశమని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రఘునందనరావు తెలిపారు.

Updated Date - Nov 10 , 2025 | 04:53 AM