From Clicks to Crypto: క్లిక్ నుంచి క్రిప్టో దాకా
ABN , Publish Date - Nov 10 , 2025 | 04:59 AM
ఇంటికి కన్నాలు వెయ్యరు.. తలుపులు బద్దలు కొట్టరు.. కనీసం జేబులో చెయ్యి పెట్టరు.. కంటికి కూడా కనిపించరు.. కానీ జీవితకాలం దాచుకున్న సొమ్మును కొట్టేస్తున్నారు. జీవిత చరమాంకంలో ఆసరా కోసం దాచుకున్న సొమ్మును పెద్దల నుంచి.. జీవితంలో స్థిరపడేందుకు సేకరించుకున్న సొమ్మును యువత నుంచి పెట్టుబడి రూపంలో కాజేస్తున్నారు.....
కనీసం పదో తరగతి కూడా పాస్‌కాని నిరుద్యోగ యువకులు ఉన్నత విద్యావంతుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, పెన్షనర్లు, వృద్ధులు, ఆఖరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే పేదలను సైతం నిలువునా దోచుకుంటున్నారు. బాధితులు తేరుకునే లోపు లక్షలు కాజేస్తున్నారు.
లాటరీ పేరుతోనైజీరియన్లు మొదలు పెట్టిన సైబర్ నేరాలు.. బ్యాంకు ఓటీపీ, ఆధార్ అప్డేట్, కొరియర్ మోసాలు దాటి ఇప్పుడు డిజిటల్ అరెస్టుల వరకు చేరాయి. రోజుకో కొత్త ఎత్తుగడతో ప్రజల్ని, సంస్థల్ని దోచుకొంటున్నారు.
సైబర్ నేరగాళ్లు కొట్టేసిన సొమ్మును ఖాతాల్లో నుంచి విత్ డ్రా చేయాలంటే కనీసం గంట పడుతుంది. ఆ గంటలోపే బాధితులు కాల్ చేస్తే డబ్బులు విత్ డ్రా చేయకుండా కేంద్ర హోంశాఖ స్తంభింపజేస్తుంది. ఈ విషయాన్ని పసిగట్టిన నేరగాళ్లు కొట్టేసిన సొమ్మును నిమిషాల్లోనే మ్యూల్ ఖాతాలకు మళ్లించి.. వెంటనే చైనా గేట్‌వేస్ ద్వారా రికవరీ చేయలేని క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేస్తున్నారు.
- ఏలూరు ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్
సైబర్ నేరగాళ్ల నయా దందా.. వృద్ధులు, సంపన్నులే టార్గెట్
డిజిటల్ అరెస్టులంటూ బెదిరింపులు
పెట్టుబడి పేరుతో మోసాలు
ఏపీకే ఫైళ్లు పంపి ఆండ్రాయిడ్ ఫోన్ స్వాధీనంలోకి.. డబ్బు లూటీ
ఎక్కడెక్కడి నుంచో బెదిరింపు కాల్స్
కాంబోడియా నుంచీ వీడియో కాల్స్
సొమ్ము మ్యూల్ ఖాతాల్లో పడగానే చైనీస్ గేట్‌వేస్ ద్వారా క్రిప్టోలోకి
అక్కడి నుంచి ఇతర ఖాతాలకు మళ్లించి విత్ డ్రా
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఇంటికి కన్నాలు వెయ్యరు.. తలుపులు బద్దలు కొట్టరు.. కనీసం జేబులో చెయ్యి పెట్టరు.. కంటికి కూడా కనిపించరు.. కానీ జీవితకాలం దాచుకున్న సొమ్మును కొట్టేస్తున్నారు. జీవిత చరమాంకంలో ఆసరా కోసం దాచుకున్న సొమ్మును పెద్దల నుంచి.. జీవితంలో స్థిరపడేందుకు సేకరించుకున్న సొమ్మును యువత నుంచి పెట్టుబడి రూపంలో కాజేస్తున్నారు. మధ్య తరగతిపై ఆశల వల విసిరి బురిడీ కొట్టిస్తున్నారు. అలా దోచుకున్న సొమ్మును వందలాది మ్యూల్ ఖాతాల్లోకి మళ్లించి అక్కడి నుంచి క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేస్తున్నారు. అంతిమంగా వందలాది చిన్న చిన్న ఖాతాల్లోకి చేర్చి విత్ డ్రా చేసుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల కొత్త పంథా ఇది! ఒకప్పుడు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోని సొమ్మును పోలీసులు ఎంతో కొంత రికవరీ చేసేవారు. 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు మొదటి గంటలో ఫోన్ చేస్తే కేంద్ర హోంశాఖ మ్యూల్ ఖాతాలను స్తంభింపజేసేది. ఇప్పుడు బాధితులు ఫోన్ చేసేలోపే చైనీస్ గేట్ వే ద్వారా క్రిప్టో కొనుగోలు చేసి, కనీస రికవరీ కాకుండా సైబర్ నేరగాళ్లు జాగ్రత్త పడుతున్నారు. దర్యాప్తులో నాలుగైదు దశలు దాటి అంతిమదశకు చేరుకున్నా రికవరీ లేకపోవడంతో తమ శ్రమ అంతా వృథా అయిపోతోందని పోలీసులు అంటున్నారు. మన దేశంలోని స్కామర్లను అరెస్టు చేసి జైలుకు పంపి ఎంతో కొంత సంతృప్తి చెందుతున్నారు. మన రాష్ట్రంలో ప్రతి రోజూ రెండున్నర కోట్ల రూపాయలకుపైగా సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని సైబర్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ చెబుతున్నారు. ఐఐటీ పట్టభద్రుడైన ఏలూరు ఎస్పీ ప్రతాప్ కిశోర్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తన ఐఐటీ స్నేహితులతో కలిసి తాజా సైబర్ నేరాలపై లోతుగా విశ్లేషణ చేశారు. ప్రజల డబ్బులు కొల్లగొట్టడమేగాక దేశ భద్రతకు ఎలాంటి సవాలు విసురుతున్నారో వివరిస్తూ కేంద్ర హోంశాఖ, ఆర్‌బీఐకి నివేదిక పంపారు. నేరాల కట్టడి, సొమ్ము రికవరీకి పలు సిఫారసులు చేశారు.
సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత ఖాతాల కంటే ఎక్కువగా కరెంట్, కార్పొరేట్ ఖాతాలు సేకరించి కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు. ఒక కార్పొరేట్ ఖాతాలోకి ఎంత డబ్బు వచ్చినా బ్యాంకర్లు అనుమానించరు. అంతేగాక కార్పొరేట్ ఖాతాలైతే అక్కడి నుంచి ఎంతమంది బ్యాంకు అకౌంట్లకైనా చిటికెలో బదిలీ చేయవచ్చు. అలాంటి వాటిని సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు. ఆ ఖాతాల్లోకి జమ చేయించుకున్న సొమ్మును క్షణాల్లో క్రిప్టో కరెన్సీకి మళ్లించేస్తున్నారు. మళ్లీ ఇతర అకౌంట్లకు మళ్లించి డ్రా చేసుకుంటున్నారు.
బ్యాంకర్లు, పోలీసుల సహకారం: సైబర్ నేరగాళ్లు తాము చేసే నేరాలకు అక్కడక్కడా కొందరు బ్యాంకర్లు, పోలీసులను వాడుకుంటున్నారు. ఏలూరులో ఒక పెద్దావిడను డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి రూ.52 లక్షలు కాజేసిన సైబర్ ముఠా బెంగళూరుకు చెందిన మహమ్మద్ హాసన్ పేరుతో ఉన్న కార్పొరేట్ ఖాతా(ఎస్ బ్యాంకు)లోకి బదిలీ చేయించినట్లు తేలింది. మహారాష్ట్రకు చెందిన ఓ బ్యాంకర్ ఇచ్చిన సమాచారంతో ఆ ఖాతాను అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. రాజకీయపరమైన ఫండ్ ఉందని, కోట్లలో డిపాజిట్ చేయించి విత్ డ్రా చేసుకున్నాక కమీషన్ ఇస్తామని నేరగాళ్లు ఆశ చూపి హాసన్‌ను ఢిల్లీకి తీసుకెళ్లారు. అసలు విషయం తెలియడంతో తాను అంగీకరించలేనని హాసన్ అడ్డు చెప్పడంతో తుపాకీ తలకు గురిపెట్టి నేరగాళ్లు బెదిరించారు. హాసన్ ఇచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో ఇతర సైబర్ నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో 1.80 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ జరిగినట్లు ఒక సర్వేలో తేలింది. డేటా చోరీ టాప్-5 దేశాల్లో మన దేశం రెండో స్థానంలో ఉంది. సైబర్ మోసగాళ్లు మాయ చేసి కరెంట్, కార్పొరేట్ ఖాతాల్లోకి డబ్బులు వేయించుకున్న వెంటనే వందల ఖాతాల్లోకి బదిలీ చేసి క్రిప్టో కొనుగోలు చేస్తుండటంతో రికవరీ అసాధ్యమవుతోంది. ఆ సొమ్ము ఎలా రికవరీ చేయవచ్చనే విషయంపై ‘భారత్ పోల్’ ద్వారా పోలీసులు చైనీస్ గేట్ వేస్‌కు లేఖలు రాశారు. దొంగ సొమ్ముతో కొనుగోలు చేసిన క్రిప్టో కరెన్సీని సీజ్ చేయమని కోరారు.
టెలిగ్రామ్ నుంచి డార్క్‌నెట్ దాకా..
డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాల ద్వారా కొట్టేసిన డబ్బును బదిలీ చేయించుకోవడానికి సైబర్ నేరగాళ్లు మ్యూల్ ఖాతాల కోసం టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా సంప్రదిస్తున్నారు. నిరుద్యోగులకు గేలం వేసి రోజుకు 2వేల నుంచి పది వేల వరకూ ఇస్తామంటూ వారితో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించి అద్దెకు తీసుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు పసిగట్టినప్పుడో, 1930 ద్వారా ఖాతా ఫ్రీజ్ అయినప్పుడో ఆపేస్తున్నారు. ఈ ఖాతాల్లోకి కొట్టేసిన డబ్బులు వచ్చేందుకు 3కీలక మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్రతి నెలా పెన్షన్ తీసుకునే రిటైర్డ్ ఉద్యోగులు, బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు చేసి ప్రతి నెలా వడ్డీతో బతుకుతున్న డబ్బున్న పెద్దలు.. పెట్టుబడి పెట్టేందుకు డీ మ్యాట్ ఖాతాలు తెరిచి అధిక లాభాల గురించి నెట్‌లో వెతికేవారు.. ఆన్‌లైన్లో ఫుడ్ నుంచి వస్తువుల వరకూ ఆర్డర్లు పెట్టే వ్యక్తులను పసిగడుతున్నారు. సమాచారం సేకరించి పెట్టుకునే వ్యక్తుల్ని డార్క్ నెట్ ద్వారా సంప్రదించి కొనుగోలు చేశాక ఫిషింగ్‌కు పాల్పడుతున్నారు. పీఎం కిసాన్, ఆరోగ్య శ్రీ, ఈ-చలాన్ ఇలా ఎంచుకున్న కస్టమర్ నెట్‌లో ఏది ఎక్కువగా సెర్చ్ చేస్తారో దానికి సంబంధించిన పేరుతో ఏపీకే ఫైల్స్ పంపి ఓపెన్ చేసేలా కవ్విస్తున్నారు. వాట్సాప్ గ్రూపులోకి పంపిన ఏపీకే ఫైల్స్ తెరవగానే ఆండ్రాయిడ్ ఫోన్‌ను తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు పాస్‌వర్డ్ పసిగట్టి మొత్తం ఖాతాలో ఉన్న డబ్బు కొల్లగొడుతున్నారు. ఇక పెన్షనర్లు, డిపాజిటర్లను నేరాలకు పాల్పడ్డారంటూ బెదిరిస్తున్నారు. యూనిఫామ్ వేసుకుని వీడియో కాల్ చేసి సీబీఐ, ఈడీ పేరు చెప్పి డిజిటల్ అరెస్టు అంటూ భయాందోళనకు గురి చేస్తున్నారు. ఖాతా వివరాలు చెప్పాలంటూ వీడియో కాల్స్‌లో బెదిరిస్తూ అందినకాడికి డబ్బు కొల్లగొడుతున్నారు.
అప్రమత్తతే శ్రీరామ రక్ష ’
సైబర్ నేరగాళ్లు కొట్టేసిన సొమ్ము రికవరీ దాదాపు అసాఽధ్యంగా మారుతోందని, కంటికి కనిపించకుండా జరిగే సైబర్ మోసాల పట్ల అప్రమత్తతే శ్రీరామ రక్ష అని సైబర్ పోలీసులు అంటున్నారు.
వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో వచ్చే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దు.
డిజిటల్ అరెస్టు బెదిరింపులకు భయపడొద్దు.
పెట్టుబడి అనేది డీ మ్యాట్ అకౌంట్ లేకుండా ఆన్‌లైన్ ద్వారా స్ర్కీన్‌పై చూపించే వాటిని నమ్మొద్దు.
సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ రాగానే భయపడటం, ఏదో ఆశ చూపగానే దురాశకు పోవడం, మోసపోయిన వెంటనే పోలీసులకు(డయల్ 112) లేదా సైబర్ పోలీసులు(డయల్ 1930)కు సమాచారం ఇవ్వకపోవడం అంటే.. పెద్ద పొరపాటు చేసినట్లే.
డేటా సేకరించి డార్క్‌నెట్‌లో విక్రయం
ఆండ్రాయిడ్ ఫోన్‌ను సాధనంగా వాడుకుంటున్నారు. హ్యాకింగ్, ట్రాకింగ్, ట్యాపింగ్‌తో డేటా చౌర్యం చేస్తున్నారు. అంతిమంగా పర్సనల్ డేటా లాగేసి డార్క్‌నెట్‌లో విక్రయించే ముఠాలను సైబర్ నేరగాళ్లు సంప్రదిస్తున్నారు. ఇటీవల మా పోలీసు బృందాలు ఒక కీలక కేసులో ఆరు రాష్ట్రాల్లో నెల రోజులు తిరిగి 400కు పైగా సైబర్ మోసాలకు పాల్పడిన మాయ అనే మహిళ, ఓ బ్యాంకు ఉద్యోగి, పోలీసు కానిస్టేబుల్ సహా 11 మంది ముఠాను అరెస్టు చేశారు. 150 మ్యూల్ ఖాతాలు, 112 చైనీస్ పేమెంట్ గేట్ వేస్, వందల కొద్దీ టెలిగ్రామ్ గ్రూపులతో కాంబోడియా కేంద్రంగా సాగిస్తున్న వ్యవస్థీకృత నేర దందాను వెలుగులోకి తెచ్చాం.
- ఏలూరు ఎస్పీ కేపీఎస్ కిశోర్