Maoist Members Arrested In Vijayawada: చిక్కిన మావోయిస్టుల్లో జ్యోతి..!
ABN , Publish Date - Nov 18 , 2025 | 06:18 PM
విజయవాడ శివారులో భారీగా చిక్కిన మావోయిస్టులను ఎస్ఐబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణ సందర్భంగా మావోయిస్టుల భాష తీవ్ర అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. దీంతో గోండు భాష తెలిసిన వారి కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.
అమరావతి, నవంబర్ 18: విజయవాడ శివారు న్యూ ఆటోనగర్‌లో పోలీసులకు చిక్కిన 28 మందిలో మావోయిస్ట్ పార్టీకి చెందిన కీలక సభ్యులు ఉన్నట్లు స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) అధికారులు గుర్తించారు. వారిలో.. ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జికి రక్షణగా ఉన్న 9 మంది సుశిక్షితులైన కమాండోలు ఉన్నారని అధికారులు కనిపెట్టారు. దేవ్ జికి రక్షణ దళం కమాండర్ జ్యోతి సైతం విజయవాడ షెల్టర్ జోన్‌లో దొరికిన వారిలో ఒకరని అధికారులు వెల్లడించారు. మిగతా 19 మంది.. కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాకు రక్షణగా ఉన్న ఫ్లటూన్ సభ్యులని ఎస్ఐబీ అధికారులు వెల్లడించారు.
వీరంతా ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు పార్టీ వారని పేర్కొన్నారు. వీరికి గోండు భాషతో పాటు కొంతమందికి కొద్దిగా హిందీ తెలుసునని అధికారులు వివరించారు. దీంతో విచారణ కొంత ఇబ్బందిగా మారిందని వారు చెబుతున్నారు. అయితే, గోండు భాషతోపాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో మాట్లాడే భాషలు తెలుగులోకి అనువదించే వారి కోసం పోలీస్ అధికారులు అన్వేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తొలుత వీరు తమకేమీ తెలియదని ఎస్‌ఐబీ అధికారులకు చెప్పారని సమాచారం. ఆ తర్వాత కొన్ని విషయాలును స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులకు వివరించినట్లు తెలుస్తోంది. ఇక న్యూ ఆటోనగర్‌లోని ఆటో మొబైల్ పరిశ్రమలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు పని చేస్తున్నారు. వీరిలో అధిక శాతం మంది ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌కు చెందిన వారు ఉన్నారు. దాంతో వీరంతా.. వారితో కలిసిపోయి పని చేస్తున్నట్లు ఎస్ఐబీ అధికారుల విచారణలో చెప్పినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ
Read Latest AP News And Telugu News