Pattabhi Slams Jagan: జగన్ వ్యాఖ్యలపై నవ్వుకుంటున్నారు.. పట్టాభి సెటైర్
ABN , Publish Date - Jun 19 , 2025 | 02:45 PM
Pattabhi Slams Jagan: జగన్ పర్యటనలో ఫ్లెక్సీలు రెచ్చగొట్టే విధంగా, విపరీత నేరపూరిత ధోరణితో ఉన్నాయని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో లేకపోతే ఇంతలా బహిరంగంగా నరుకుతాం.. చంపుతాం.. తొక్కిపడేస్తాం.. అని జనాల్ని బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు.

అమరావతి, జూన్ 19: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మా రెడ్డి పట్టాభి రామ్ (Kommareddy Pattabhi Ram) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శవ రాజకీయాల కోసం వచ్చి, ఇద్దరిని శవాలుగా మార్చారు జగన్ అంటూ మండిపడ్డారు. ‘జగన్ నువ్వు చేసిన ఆరోపణలు నిజమని నీ కుటుంబమే నమ్మదు.. నీ వైసీపీ క్యాడర్ కూడా నమ్మదు. ప్రజలు నవ్వుకుంటున్నారు..’ అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ రాజకీయాలలో జగన్ ఒంటరిగా మిగిపోతారని... బూతుల మంత్రులు కూడా మిగలరన్నారు. చంపడం, పరామర్శించడం జగన్‌కు అలవాటని.. అదే ఇష్టం కూడాను అంటూ వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంటే, ఆ పాపం టీడీపీపై వేస్తున్నారన్నారు. ఏడాది క్రితం చనిపోతే ఇప్పుడు పరామర్శకు వెళ్లడమే పెద్ద నాటకమన్నారు.
జగన్ పర్యటనలో ఫ్లెక్సీలు రెచ్చగొట్టే విధంగా, విపరీత నేరపూరిత ధోరణితో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో లేకపోతే ఇంతలా బహిరంగంగా నరుకుతాం.. చంపుతాం.. తొక్కిపడేస్తాం.. అని జనాల్ని బెదిరిస్తారా అని ప్రశ్నించారు. ‘ప్రజలకు ఏం సందేశం ఇద్దామని జగన్.. నీ ప్రమాదం నుంచి జనాల్ని చైతన్యపరచాలి.. లేకుంటే నష్టపోతాం. వైసీపీ అనే ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఉన్న అంతర్గత తీవ్రవాద వ్యవస్థ నీది. 2019-24 జగన్ పాలనా సమయంలో గంజాయి, డ్రగ్స్, నాసిరకమైన మద్యం, హత్యా రాజకీయాలు, కక్ష సాధింపులు, సోషల్ మీడియాలో బూతులు, స్త్రీ లపై దాడులు వంటివి చేసి, ఒక తరం భవిష్యత్ పొట్టన పెట్టుకున్నాడు. ర్యాలీలో వాహనం ఢీకొని ఒకరు, తోపులాటలో ఇంకొకరు వైసీపీ కార్యకర్తలు చనిపోతే కనీసం పట్టించుకోలేదు.. అంటే ఇంకొక సారి పరామర్శకు సాకు దొరుకుతుందనా. శవ రాజకీయాలు చేయడం, రాజకీయ ముసుగులో కుట్రలకు పాల్పడం జగన్‌కు బాగా అలవాటే’ అంటూ విమర్శలు గుప్పించారు.
అంతర్జాతీయ యోగా వేడుకల సమయంలో రాష్ట్రంలో అలజడి సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ స్వార్థ రాజకీయానికి రెండు నిండు ప్రాణాలు బలైపోయినా స్పందించలేదన్నారు. ఖాళీ అవుతున్న వైసీపీ పార్టీని కాపాడుకునేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పరామర్శలు ప్రజల కోసమే అయితే.. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలు లేవనేత్తవచ్చు కదా? ఆ పని చేయకుండా ఎందుకీ ఉన్మాదం అని ప్రశ్నించారు. జగన్ పాలనలో ఏడాదికి ప్రజలపై 1.50 లక్షలు పోలీస్ కేసులు పెట్టారని.. ప్రజలు అందరూ ఈ ఉన్మాదం పట్ల చైతన్యం పెంచుకోవాలని సూచించారు. పరామర్శకు వేలాదిమంది సమీకరణలెందుకు అని జగన్‌ను నిలదీశారు. జగన్ కాన్వాయ్ వాహనం ఢీకొని చావుబతుకుల్లో ఉన్న వ్యక్తిని సకాలంలో హాస్పిటల్‌కు తరలించే ఏర్పాట్లు చేయకుండా మాజీ సీఎం వెళ్లిపోయారన్నారు. నిజంగా మృతుని కుటుంబాన్ని పరామర్శించడం కోసమే అయితే.. పోలీసు నిబంధనలు పాటించి ఉంటే నేడు రెండు నిండు ప్రాణాలు పోయేవి కాదు కదా అని కొమ్మారెడ్డి పట్టాభి రామ్ పేర్కొన్నారు.
యువకుడి ఆత్మహత్యకు జగన్ మాటలే కారణం: సోమిరెడ్డి
పల్నాడు జిల్లాలో నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగన్ చెప్పిన మాటలే కారణమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 175కి 175 సీట్లు గెలుస్తామన్న జగన్ మాటలతో అప్పులు చేసి బెట్టింగ్‌లో యువకుడు ప్రాణం కోల్పోయాడన్నారు. అది తాము కావాలని చేసిందా? టీడీపీకి సంబంధం ఉందా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని జగన్ బీహార్ స్టైల్‌గా మార్చేరని.. పోలీసులంటే లెక్క లేకుండా తిప్పేస్తున్నారంటూ మండిపడ్డారు. బెట్టింగ్‌లో చనిపోయిన వాళ్లకి విగ్రహాలు పెడతావా జగన్ అంటూ తీవ్రంగా విమర్శించారు. కమ్మ కులస్తులకు మొదటి విడత మంత్రి పదవి ఇచ్చి రెండో విడతలో ఎందుకు వంచించావు అని నిలదీశారు. అమర్‌రాజా, సంగం డైరీలను నాశనం చేయాలని కుట్ర చేశారని.. ఎన్ని ఆస్తులను ధ్వంసం చేశారో చెప్పాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
జగన్ పల్నాడు పర్యటనపై షర్మిల సంచలన కామెంట్స్
బ్రిటన్ మాజీ ప్రధానితో లోకేష్ భేటీ.. చర్చించిన అంశాలివే
Read latest AP News And Telugu News