Share News

Jagan London Trip: జగన్ లండన్ పర్యటనపై సీబీఐ పిటిషన్.. తీర్పు ఇదే

ABN , Publish Date - Oct 29 , 2025 | 03:59 PM

బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ జగన్.. తన సొంత ఫోన్ నెంబర్‌ను వెల్లడించలేదని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. లండన్ పర్యటనలో ఉన్న సమయంలో మాజీ సీఎంకు మూడు సార్లు కాల్ చేశామని.. కానీ ఆయన ఇచ్చిన నెంబర్ పనిచేయలేదని సీబీఐ తెలిపింది.

Jagan London Trip: జగన్ లండన్ పర్యటనపై సీబీఐ పిటిషన్.. తీర్పు ఇదే
Jagan London Trip

హైదరాబాద్/అమరావతి, అక్టోబర్ 29: అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు (ఏ1), ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) లండన్‌ పర్యటనపై సీబీఐ వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు (బుధవారం) తీర్పు ఇచ్చింది. సీబీఐ వేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. తన పెద్ద కుమార్తెను చూసేందుకు జగన్ ఈనెల 11న లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ జగన్.. తన సొంత ఫోన్ నెంబర్‌ను వెల్లడించలేదంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. లండన్ పర్యటనలో ఉన్న సమయంలో మాజీ సీఎంకు మూడు సార్లు కాల్ చేశామని.. కానీ ఆయన ఇచ్చిన నెంబర్ పనిచేయలేదని సీబీఐ తెలిపింది.


ఉద్దేశపూర్వకంగానే పని చేయని నెంబర్ ఇచ్చారని సీబీఐ వాదనలు వినిపించింది. ఇకపై జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థించింది. అయితే అసలు జగన్ ఫోన్ వాడరని.. గతంలో కూడా తన సిబ్బంది ఫోన్ నెంబర్లు ఇచ్చారని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న నాంపల్లి సీబీఐ కోర్టు... సీబీఐ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై ఈనెల 22న వాదనలు జరుగగా.. కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది.


కాగా.. ఈనెల 1 నుంచి 30 తేదీ మధ్య 15 రోజుల పాటు లండన్‌లో ఉన్న తన పెద్ద కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా జగన్ కోరగా.. షరతులతో కూడిన అనుమతిని సీబీఐ కోర్టు ఇచ్చిన విషయం తెలిసిందే. పర్యటన వివరాలు, ఫోన్‌ నెంబర్లు, ఈమెయిల్ ఐడీ ఇవ్వడంతో పాటు పర్యటన ముగిసిన తర్వాత ప్రత్యక్షంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈనెల 11న జగన్ లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అయితే విదేశీ పర్యటనలో ఉన్న జగన్‌కు సీబీఐ మూడు సార్లు ఫోన్ చేసినప్పటికీ అది కలవకపోవడంతో గత వారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు విధించిన షరతులను జగన్ ఉల్లంఘించారంటూ సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది


ఇవి కూడా చదవండి...

బలహీనపడుతున్న మొంథా తుఫాన్.. పలు చోట్ల భారీ వర్షాలు

యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి.. డిప్యూటీ సీఎం ఆదేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 04:28 PM