CM Chandrababu Sricharani: ఆనందక్షణాలను సీఎంతో పంచుకున్న శ్రీచరణి
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:27 AM
ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళలు సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు.
అమరావతి, నవంబర్ 7: ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి (Sri Charani), మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ (Mithali Raj) ఈరోజు (శుక్రవారం) ఉదయం సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును (CM Chandrababu Naidu) వారు కలిశారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఇరువురికి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని సీఎం, మంత్రి అభినందించారు. ఆపై శ్రీచరణి, మిథాలితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో శ్రీచరణి పంచుకున్నారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళలు సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు.

కాగా.. ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ టీమ్ విన్నర్ శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. శ్రీచరణికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం ఎంపీలు, మంత్రులు, శాప్ ఛైర్మన్ కలిసి శ్రీచరణి, మిథాలి రాజ్‌ను వెంటపెట్టుకుని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అయితే గన్నవరం నుంచి బెంజ్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని ఏసీఏ మొదట భావించింది. ముఖ్యమంత్రితో భేటీ నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీని రద్దు చేశారు. చంద్రబాబును కలిసిన తర్వాత మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంను సందర్శించేందుకు శ్రీచరణి బయలుదేరి వెళ్లారు.
అలాగే.. నేడు సొంత జిల్లా కడపకు శ్రీచరణి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రక్రికెట్ అసోషియేషన్ సౌజన్యంతో జిల్లా క్రికెట్ అసోసియేషన్.. శ్రీచరణిని ఘనంగా సత్కరించనుంది. ఆపై నగరంలో ఈరోజు సాయంత్రం శ్రీచరణితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేసింది.
ఇవి కూడా చదవండి...
ఇవాళ రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. వివరాలు ఇవే
Read Latest AP News And Telugu News