Pawan Visits Cyclone Affected Areas: రైతన్నలకు డిప్యూటీ సీఎం పవన్ భరోసా
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:29 PM
తుపాను కారణంగా బాగా నష్టపోయామని.. ఎకరానికి రూ. 30 వేలు ఖర్చు అయ్యిందని రైతులు తెలిపారు. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.
కృష్ణా జిల్లా, అక్టోబర్ 30: జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఈరోజు (గురువారం) పర్యటించారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నేలకొరిగిన వరి పైరును డిప్యూటీ సీఎం పరిశీలించారు. పంట చేతికి వచ్చే సమయంలో తుపాను తమను ముంచేసిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా రైతులను ఆదుకుంటామని, అధైర్య పడవద్దని రైతులకు పవన్ ధైర్యం చెప్పారు.

పవన్‌తో రైతులు..
డిప్యూటీ సీఎంతో రైతులు తమ బాధను పంచుకున్నారు. తుపాను కారణంగా బాగా నష్టపోయామని.. ఎకరానికి రూ. 30 వేలు ఖర్చు అయ్యిందని తెలిపారు. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఇటువంటి ప్రకృతి విపత్తుల సమయంలో కౌలు రైతులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నామని.. కౌలు డబ్బులు కూడా రాని పరిస్థితి ఉందంటూ ఆవేదన చెందారు.

ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు సాయం అందేలా చూడాలని పవన్ కళ్యాణ్‌కు రైతులు వినతి చేశారు. రైతుల బాధలు విన్న డిప్యూటీ సీఎం.. వారికి ధైర్యం చెప్పారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. అలాగే రెండు మూడు రోజుల్లో పంట నష్టం అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పవన్‌కు కలెక్టర్ బాలాజీ వివరించారు.

కాగా.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ.. పవన్ కళ్యాణ్‌తో కలిసి పర్యటనలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి...
వీఎంసీ పాలకవర్గంపై ప్రభుత్వం సీరియస్.. కారణమిదే
చిన్న వెంకన్న ఆలయంలో విష సర్పాల కలకలం
Read Latest AP News And Telugu News