Medical Colleges Privatization: మెడికల్ కాలేజీల వివాదం... వైసీపీపై విరుచుకుపడ్డ కూటమి నేతలు
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:34 AM
మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీప నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని కూమటి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీపీపీ విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీలను పూర్తిచేస్తామని ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు.
అమరావతి, నవంబర్ 12: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తం వైసీపీ (YCP) ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది. వైసీపీ నిరసన ర్యాలీపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పీపీపీ (PPP) అంటే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యమని స్పష్టం చేశారు. అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని కూటమి నేతలు తేల్చిచెప్పారు.
చంద్రబాబు మోడల్ సూపర్ ఫాస్ట్: జీవీ ఆంజనేయులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ మోడల్ అంటే ఆలస్యం... చంద్రబాబు మోడల్ అంటే సూపర్ ఫాస్ట్ అని అన్నారు. పీపీపీ మోడల్లో కేవలం రెండేళ్లలోనే మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామన్నారు. వైసీపీ చేతిలో అయితే ఇంకా 20 ఏళ్లు పట్టే అవకాశం ఉంటుందని ఎద్దేవా చేశారు. మెడికల్ సీట్లు 500 నుంచి 1750కి పెరగడం అంటే ప్రజల భవిష్యత్తు విస్తరించడమే అని చెప్పుకొచ్చారు. పేదలకు వైద్యం, విద్యకు విలువ ఇవ్వడమే కూటమి విధానమని స్పష్టం చేశారు.
పీపీపీ ఆసుపత్రులతో కార్పొరేట్ స్థాయి చికిత్స పేదలకు అందుతుందన్నారు. కూటమి యూనివర్సల్ హెల్త్ పాలసీతో అందరికీ ఉచిత వైద్యం అందిస్తామన్నారు. గత ఐదేళ్లలో ఖర్చైన రూ.1550 కోట్లు అన్ని కేంద్ర నిధులే అని తెలిపారు. జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శలు గుప్పించారు.
అంతా అబద్ధం: బీజేపీ నేత
వైద్య కళాశాలల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అబద్ధ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి వినుషా రెడ్డి మండిపడ్డారు. పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదని... ఇది ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యమని స్పష్టం చేశారు. దీని కాల పరిమితి 33 సంవత్సరాలు అని తెలియజేశారు. భూమి, భవనాలు, కళాశాలలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని అన్నారు. ఔట్‌పేషెంట్, ల్యాబ్, మందులు పూర్తిగా ఉచితమని.. 70% పడకలు పేదల కోసం ఉచితమని తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. ప్రతి కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు ప్రారంభమని.... తరువాత పీజీ సీట్లు కలుపుతారని తెలిపారు.
50% సీట్లు ప్రభుత్వ కోటాలో అన్ని రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పారు. ఏపీహెచ్ఈఆర్ఎమ్సీ ద్వారా ఫీజు నిర్ణయిస్తారన్నారు. 1 కోటి రూపాయల ఫీజు అనే వైఎస్సార్సీపీ వాదన పూర్తిగా అబద్ధమని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 17 కళాశాలలకు రూ.8,480 కోట్లు అంచనా వేసి రూ.1,550 కోట్లు (18%) మాత్రమే 5 ఏళ్లలో ఖర్చు చేసిందని తెలిపారు. 11 కళాశాలల నిర్మాణం నిలిచిపోయిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రూ.768 కోట్లు విడుదల చేసి, పనులు మళ్లీ ప్రారంభించిందని అన్నారు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఐఐటీ చెన్నై కూడా ఇదే పీపీపీ విధానాన్ని ఉపయోగిస్తున్నాయని బీజేపీ నేత వినుషా రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మూడు కోట్ల విలువైన వస్తువులు సీజ్.. విమానాశ్రయంలో కలకలం
పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్
Read Latest AP News And Telugu News