AP High Court: పరకామణి చోరీ కేసు.. జర్నలిస్టు భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:40 PM
పరకామణి చోరీ కేసులో జర్నలిస్టు శ్రీనివాసులుకు భద్రత కల్పించాలంటూ తిరుపతి ఎస్పీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను సీఐడీకి అప్పగించాలని ఆదేశించింది.
అమరావతి, నవంబర్ 22: తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసును సీఐడీ విచారణకు ఆదేశించాలని, పిటిషన్ వేసిన జర్నలిస్ట్ శ్రీనివాసులుకు భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు (AP High Court) ఆదేశాలు జారీ చేసింది. తనకు బెదిరింపులు వస్తున్నాయని, భద్రత కల్పించాలని కోరుతూ జర్నలిస్ట్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈనెల 15న తనకు భద్రత కల్పించాలంటూ వినతిపత్రం సమర్పించినా పోలీసుల నుంచి స్పందన రాలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఈరోజు (శనివారం) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
జర్నలిస్టుకు భద్రత కల్పించాలని తిరుపతి జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరకామణి కేసులో సాక్షులు, నిందితుడికి భద్రత కల్పించేలా సంబంధిత జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇవ్వాలని సీఐడీ డీజీ, రాష్ట్ర డీజీపీకి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం గుర్తుచేసింది. కేసు దర్యాప్తు ముగిసే వరకు పిటిషనర్‌కు భద్రత కల్పించాలని తిరుపతి జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. రెండ్రోజుల క్రితం ఇదే కేసులో నిందితుడు సీవీ రవికుమార్, సాక్షులకు భద్రత కల్పించాలని సీఐడీ డీజీని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్.. తిరుపతిలో దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యేందుకు వెళుతూ అనూహ్యరీతిలో మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన న్యాయస్థానం నిందితుడు, సాక్షులకు దర్యాప్తు పూర్తి అయ్యే వరకు భద్రత కల్పించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
అపోహలు నమ్మొద్దు.. ఆరు నెలల్లో పరిష్కరిస్తాం: కేంద్రమంత్రి
ఏపీకి వర్ష సూచన.. వారం రోజుల్లో
Read Latest AP News And Telugu News