AP High Court: మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ పిటిషన్‌పై హైకోర్టు ఏం తేల్చిందంటే..
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:37 PM
మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ కోసం బంధువులు వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు మూసివేసింది. ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
అమరావతి, నవంబర్ 21: మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ కోసం ఏపీ హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) మరోసారి విచారణ జరిగింది. మావోయిస్ట్ పార్టీ కీలక నేతలు దేవ్ జీ, రాజిరెడ్డి... పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవని.. వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. పోలీసుల వద్ద ఆ ఇద్దరు అగ్రనేతలు ఉన్నారనే దానిపై ఆధారాలు లభిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. ఆపై మావోయిస్ట్ నేతల బంధువులు వేసిన పిటిషన్‌పై విచారణను ధర్మాసనం మూసివేసింది.
పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ రాజారెడ్డి కుమార్తె స్నేహలత, దేవ్ జీ సోదరుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీనిపై నిన్న (గురువారం) హైకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. మావోయిస్టు కీలక నేతలు తమ ఆధీనంలో ఉన్నారని పోలీసులు ప్రెస్‌స్టేట్‌మెంట్ ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలుపగా.. ఆధారాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
దీంతో నేటి విచారణలో పోలీసుల ప్రెస్ స్టేట్‌మెంట్‌కు సంబంధించిన వీడియోను పిటిషనర్ల తరుఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. వీడియోను చూసిన ధర్మాసనం.. సెక్యూరిటీ సిబ్బంది తమ అదుపులో ఉన్నారని పోలీసులు చెప్పినట్లు గుర్తించింది. దేవ్ జీ గురించి మీడియా ప్రతినిధులు అడగ్గా.. తమ ఆధీనంలో లేరని పోలీసు ఉన్నతాధికారులు చెప్పినట్లు వీడియోలో ఉందని న్యాయస్థానం గుర్తించింది. దీంతో దేవ్ జీ, రాజిరెడ్డిలు పోలీసుల నిర్భంధంలో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లేవని ధర్మాసనం నిర్ధారించింది. ఈ వ్యాజ్యంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేస్తూ.. పిటిషన్‌ను క్లోజ్ చేసింది.
ఇవి కూడా చదవండి..
పోస్టుమార్టంలో జాప్యం.. ఆస్పత్రిలోనే మావోల డెడ్‌బాడీస్
అలా చెప్పే దమ్ము, ధైర్యం లేదా?... జగన్‌పై మండిపడ్డ దేవినేని
Read Latest AP News And Telugu News