Bapatla News: కోసేద్దాం.. అమ్మేద్దాం
ABN , Publish Date - Nov 21 , 2025 | 10:13 AM
ఒకవైపు తుఫాన్ హెచ్చరికలతో.. పొలాల్లో హార్వెస్టర్లు పరుగులు పెడుతున్నాయి. రాత్రి పగలు విరామం లేకుండా కోత కోసేస్తున్నాయి. కోసిన ధాన్యం కల్లాలపై ఆరబెట్టే పనికూడా లేకుండా అన్నదాతలు వ్యాపారులకు అమ్మేస్తున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో రెండు, మూడు రోజుల నుంచి ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
- తుఫాన్ హెచ్చరికలతో వరి కోతలు
- గట్టెక్కితే చాలన్నట్లుగా రైతన్నల పరుగులు
- యంత్రాల వినియోగం.. కల్లాల్లోనే విక్రయాలు
- మద్దతు రూ.1791.75 కాగా.. రూ.1400కే విక్రయం
ఏపుగా పెరిగిన వరి కళ్లెదుట ఉండగా.. తుఫాన్ భయం అన్నదాతలను వెంటాడు తోంది. వాతావరణశాఖ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కోతలతో పాటు అమ్మకానికి సిద్ధమవుతున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేసినా వర్షంతో మునిగిపోతామని.. హడావుడి పడుతున్నారు. ఆందోళన అవసరం లేదు.. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. తుఫాన్ హెచ్చరికలతో రైతులు కోసేసి.. అమ్మేస్తున్నారు. కూలీలతో అయితే ఆలస్యం అవుతుందని యంత్రాలతో ధాన్యం కోసేస్తున్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలోని రైతులు ఎగబడి మరీ ధాన్యం కోస్తుండటం.. ఇదే అదనుగా దళారులు, వ్యాపారులు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. అయితే రైతులకు మద్దతు ధర దక్కడంలేదు. అయినా రైతులు కోసేద్దాం.. అమ్మేద్దాం అన్నట్లుగా పరుగులు పెడుతున్నారు.
(తెనాలి, బాపట్ల): ఒకవైపు తుఫాన్ హెచ్చరికలతో.. పొలాల్లో హార్వెస్టర్లు పరుగులు పెడుతున్నాయి. రాత్రి పగలు విరామం లేకుండా కోత కోసేస్తున్నాయి. కోసిన ధాన్యం కల్లాలపై ఆరబెట్టే పనికూడా లేకుండా అన్నదాతలు వ్యాపారులకు అమ్మేస్తున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో రెండు, మూడు రోజుల నుంచి ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కృష్ణా పశ్చిమ డెల్టా కింద బాపట్ల, గుంటూరు, ప్రకాశం(Bapatla, Guntur, Prakasam) జిల్లాల పరిధిలో 5.71 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేశారు.

కాగా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో సుమారు 2.5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో కోతలకు సిద్ధంగా ఉంది. సాధారణ పరిస్థితుల్లో అయితే పూర్తిగా చేలు తడారాక మనుషులతో కోతలుకోసి, పనలు చేలపై ఆరబెట్టి, కుప్పలు వేస్తారు. కానీ వాయుగుండం, తుఫాన్ హెచ్చరి కల తో యంత్రాలతో కోతకోసి అమ్మేసుకుంటున్నారు. తేమ ఎంత ఉన్నా 75 కిలోల బస్తాకు రూ.1350 నుంచి రూ.1450 వరకు చెల్లించి వ్యాపారులు రైతుల నుంచి కల్లాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు కూడా ముందు వెనక ఆలోచించకుండా ఎంతోకొంత ధర వస్తుం దని అమ్మేసుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు.
75 కిలోల ధాన్యం బస్తా ఏ గ్రేడ్ అయితే రూ.1791.75గా, కామన్ రకాలకు రూ.1776.75గా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. పైగా కొనుగోలు కేంద్రాల్లోనూ తేమ శాతాన్ని బట్టి రేటు నిర్ణయించినా అయినా రైతులు వ్యాపారులకే అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. కల్లాల్లోని ధాన్యం 27 శాతానికి మించి ఉండటంలేదు. మార్కెటింగ్ 27 శాతం తేమ ఉన్నా రూ.1612.57 చొప్పున ధర చెల్లిస్తున్నది. దీనిపై అవగాహన లేని రైతులు తమ చేతిలో నుంచి ధాన్యం వ్యాపారులకు వెళ్లిపోతే చాలన్నట్లు అక్కడికక్కడే రూ.1400 ధరకే అమ్మేసుకుంటున్నారు.

ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని, రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్మేందుకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పనిలేదంటూ మంత్రి మనోహర్ చెప్తున్నారు. పైగా వాట్సప్‌లో 7337359375 అనే నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పెడితే కొనుగోళ్లు ప్రక్రియ సులభతరం చేశామంటున్నా రైతులు ఆగడంలేదు. కొనుగోలు కేంద్రాల్లో 17 శాతం మాత్రమే తేమ ఉండాలని, అంతకు మించి ఉంటే కొనుగోలు చెయ్యరంటూ వ్యాపారులు కూడా రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు
Read Latest Telangana News and National News