AP News: ఏపీలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు అమోదం..!
ABN , Publish Date - Jun 24 , 2025 | 08:51 AM
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మంగళవారం సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపి ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

Amaravati: ఏపీ మంత్రివర్గం (AP Cabinet) మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశం (Meeting) కానుంది. 7వ ఎస్ఐపీబీ (SIPB) సమావేశంలో అమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు (19 Projects) సంబంధించి రూ. 28,546 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. వైజాగ్ (Visakha)లో కాగ్నిజెంట్ (Cognizant) ఏర్పాటుకు సంబంధించి చర్చ జరగనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పనకు రూ. 1052 కోట్లతో టెండర్లు పిలవడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీడ్ యాక్సెస్ రోడ్‌ను నేషనల్ హైవే - 16కు కలిపేందుకు రూ. 682 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అమోదం తెలపనుంది.
పలు సంస్థలకు భూ కేటాయింపులు..!
అలాగే అమరావతి రెండో దశలో 44 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే అంశంలో క్యాబినెట్‌లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా క్యాబినెట్‌లో చర్చించనున్నారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై చర్చించి అమోదించే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లో మరో రెండు కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుపై చర్చించనున్నారు. పట్టణాభివృద్ధి సంస్థల పునర్వ్యవస్థీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. అన్నదాత సుఖీభవ పథకం విధి విధానాలపై చర్చ జరగనుంది. కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా..
కాగా రానున్న ఐదేళ్లలో ఎరో స్పేస్, డిఫెన్స్ రంగాల్లో రూ. లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో డీఆర్‌డీవో ఎక్స్‌లెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మడకశిర నియోజకవర్గంలో భారత్ ఫోర్జ్, బీఎండబ్ల్యూ సంస్థలు త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించడంపై సంతోషం వ్యక్తం చేశారు. సచివాలయంలో సోమవారం మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్‌తో కలసి 2025-30 ఎరోస్పేస్, డిఫెన్స్ రంగ పాలసీపై అధికారులతో సీఎం సమీక్షించారు. రక్షణ, అంతరిక్ష రంగంలో భారీగా పెట్టుబడులు ఆకర్షించేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని సీఎం తెలిపారు. కొత్త పాలసీ ద్వారా రానున్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు సాధించాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు 4.0 పాలసీ ఉండాలని చెప్పారు. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికతతో కూడిన ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చేలా 4.0 ఏరోస్పేస్, డిఫెన్స్ పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో దేశం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విజయం సాధించిందని అధికారులకు సీఎం వివరించారు. ఈ తరహా సాంకేతికతను రక్షణ రంగంలో వాడుకోవడంతో పాటు.. వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసి, దైనందిన జీవితంలోనూ ఉపయోగించేలా పరిశోధనలతో కూడిన పెట్టుబడులను రక్షణ, భద్రతా రంగంలో వచ్చేలా కృషి చేయాలన్నారు.
ఇవి కూడా చదవండి:
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కీలక సమావేశాలు
ఇరాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న 10 మంది ఏపీ విద్యార్థులు
బాబోయ్.. జూలై 5న జపాన్ వెళ్లం
For More AP News and Telugu News