Kishan Reddy: దక్షిణంలోనూ అధికారంలోకి వస్తాం
ABN , Publish Date - Apr 28 , 2025 | 03:59 AM
కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి, దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. అంబేడ్కర్ ఆశయాల ఆధారంగా, మోదీ పాలన అభివృద్ధి మార్గాన సాగుతుందని చెప్పారు

అభివృద్ధే ధ్యేయంగా మోదీ పాలన
అంబేడ్కర్ ఆశయాలే స్ఫూర్తి: కిషన్ రెడ్డి
విజయవాడ(విద్యాధరపురం), ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): అభివృద్ధే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనిచేస్తున్నారని, దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఆదివారం విజయవాడలోని ఎస్-కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ జయంతిని ఏప్రిల్ 14నే కాకుండా పదిరోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించిందన్నారు. దేశభక్తి కలిగిన వ్యక్తి అంబేడ్కర్ అని, కమ్యూనిస్టు సిద్ధాంతాలను కాదన్నందుకు ఆయనను ఓడించాలని, అవమానపరచాలని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.
అంబేడ్కర్ ఎంపీగా పోటీచేస్తే ఓడించాలని నెహ్రూ విస్తృతంగా ప్రచారం చేశారన్నారు. రాజ్యాంగాన్ని అవమానపరిచేలా కాంగ్రెస్ వ్యవహరించిందని, అధికారాన్ని నిలుపుకోవటం కోసం రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా మార్చుకుందని విమర్శించారు. అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితోనే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అంబేడ్కర్ అంతిమ సంస్కారం జరిగిన పంచతీర్థ స్థలాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని, పార్లమెంటులో అంబేడ్కర్ చిత్రపటాన్ని పెట్టి గౌరవించిన ఘనత మోదీకే దక్కుతుందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చిందన్నారు. ఆయుష్మాన్ భారత్ పేరుతో మోదీ పేద ప్రజలకు రక్షణ కల్పించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.దయాకర్‌రెడ్డి, అధికార ప్రతినిధి ఆర్‌డీ విల్సన్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసే దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.