Share News

Kasireddy Rajasekhar Reddy: ముందస్తు బెయిలివ్వండి అరెస్టు నుంచి కాపాడండి

ABN , Publish Date - Apr 19 , 2025 | 05:24 AM

మద్యం కుంభకోణంలో తనపై అకారణంగా కేసు పెట్టారని ఐటీ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు,

Kasireddy Rajasekhar Reddy: ముందస్తు బెయిలివ్వండి అరెస్టు నుంచి కాపాడండి

  • దర్యాప్తునకు సహకరిస్తా కోరినప్పుడు అందుబాటులో ఉంటా

  • మద్యం స్కాం కేసులో హైకోర్టులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పిటిషన్‌

అమరావతి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి గత ఏడాది సెప్టెంబరు 23న సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఐటీ మాజీ సలహాదారు, జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అరెస్టు నుండి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు రానుంది. ‘మద్యం కొనుగోళ్లలో నేను కీలకపాత్ర పోషించానంటూ ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెట్‌(ఏపీబీసీఎల్‌) అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, మరో అధికారి సత్యప్రసాద్‌ సీఆర్‌పీసీ సెక్షన్‌ 164 కింద వాంగ్మూలం ఇచ్చినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత సాక్షిగా తమ ముందు విచారణకు హాజరుకావాలని దర్యాప్తు అధికారి పలుమార్లు బీఎన్‌ఎ్‌సఎస్‌ సెక్షన్‌ 179(సీఆర్‌పీసీ సెక్షన్‌ 160) కింద నాకు నోటీసులిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సలహాదారుగా పనిచేసినందునే కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు.


దర్యాప్తునకు సహకరించాడనే కారణంతో ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డిని బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసి మాతృసంస్థ రైల్వేలో చేరేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతించినట్లు పత్రికలో కథనం వచ్చింది. అన్నీ తానై వ్యవహరించిన వాసుదేవరెడ్డిని రిలీవ్‌ చేసి.. గత ప్రభుత్వంతో సంబంధం ఉన్న నాలాంటివారిని లక్ష్యంగా చేసుకోవడం చట్టవిరుద్ధం. మా కార్యాలయం, నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించి రికార్డులను సీజ్‌ చేశారు. ఈ నేపఽథ్యంలో సిట్‌ అధికారులు అరెస్టు చేస్తారనే ఆందోళన ఉంది. దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉంటాను. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయండి’ అని పిటిషన్‌లో కోరారు.

Updated Date - Apr 19 , 2025 | 05:25 AM