Bail Rejected: కాకాణికి హైకోర్టు షాక్
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:08 AM
క్వార్ట్జ్ అక్రమ తవ్వకంపై కేసులో వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది

క్వార్ట్జ్ కేసులో అరెస్టు నుంచి రక్షణకు నిరాకరణ
ఎఫ్‌ఐఆర్, రికార్డులు పరిశీలిస్తే ఆయన పాత్ర
స్పష్టమవుతోందని న్యాయమూర్తి వ్యాఖ్య
అమరావతి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. క్వార్ట్జ్ ఖనిజం అక్రమ తవ్వకం కేసులో అరెస్టు నుంచి ఆయనకు రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. తదుపరి చర్యలు నిలిపివేయాలని.. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆయన వేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే ఆ కేసును కొట్టివేయాలని దాఖలుచేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉందనే కారణంతో కాకాణి విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించడం సరికాదు. ఎఫ్‌ఐఆర్, రికార్డులను పరిశీలిస్తే కాకాణి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా స్పష్టమవుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో లోతైన, సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. వాస్తవాలు ఏమిటనే దానిపై స్పష్టత లేదు. పూర్తి స్థాయి ఆధారాలు మా ముందు లేవు. ఈ నేపఽథ్యంలో కాకాణి అరెస్టును నిలువరిస్తూ.. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆపడం సరికాదు. బీఎన్‌ఎ్‌సఎస్ చట్టనిబంధన ప్రకారం కాగ్నిజబుల్ నేరాల విషయంలో దర్యాప్తు చేసే చట్టబద్ధమైన హక్కు, విధి పోలీసులకు ఉన్నాయి. ఈ నేరాల్లో దర్యాప్తును కోర్టులు అడ్డుకోవడానికి వీల్లేదు. దర్యాప్తు దశలో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను నిలువరించడం సరికాదు.
అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వడమంటే దర్యాప్తు సంస్థకు ఉన్న అధికారాలను హరించడమే అవుతుంది’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాకాణి వేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం గ్రామపరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా క్వార్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారని జిల్లా మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీనాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు నమోదుచేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కాకాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణార్హతపై వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. మరోవైపు.. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కాకాణి క్వాష్ పిటిషన్ కూడా వేశారు. కేసు ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేయడంతో పాటు అరెస్టు నుంచి రక్షణ కోరుతూ అనుబంధ వ్యాజ్యం దాఖలు చేశారు. ఇటీవల జరిగిన విచారణలో అనుబంధ పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. బుధవారం నిర్ణయం వెల్లడించారు.
Read Latest AP News And Telugu News