Share News

YS Jagan: మిగులు జలాలు అంచనా వేయకుండా బనకచర్ల సరికాదు

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:12 AM

గోదావరిలో మిగులు జలాలు అంచనా వేయకుండా పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం సరికాదని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అన్నారు

YS Jagan: మిగులు జలాలు అంచనా వేయకుండా బనకచర్ల సరికాదు

  • కేంద్రం మద్దతుతో ఇంద్రావతి నీటిని ఛత్తీస్‌గఢ్‌ అడ్డుకుంటోంది: జగన్‌

అమరావతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): గోదావరిలో మిగులు జలాలు అంచనా వేయకుండా పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం సరికాదని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ ప్రాజెక్టుపై బుధవారం జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వకుండా ఆయన మాట్లాడారు. ఇంద్రావతి నుంచి గోదావరిలోకి నీరు రాకుండా కేంద్రం మద్దతుతో ఛత్తీస్‌గఢ్‌ అడ్డుకుంటోందని ఆరోపించారు. కేంద్ర ప్రతిపాదన ప్రకారం పోలవరం ఎత్తు తగ్గించేందుకు చంద్రబాబు ఒప్పుకొన్నారని విమర్శించారు. దీనివల్ల ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. పోలవరాన్ని 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించినప్పుడే మిగులు జలాలు కృష్ణాకు తరలించేందుకు వీలు కలుగుతుందన్నారు. కేంద్రం ఒప్పుకోకపోతే రాష్ట్రమే రూ.15,000 కోట్లు సమీకరించి ఎత్తు పెంచాలని చెప్పారు. 45.72 మీటర్ల కాంటూరు బదులు 41.72 కాంటూరులో నిర్మించేందుకు కేంద్రంతో చంద్రబాబు రాజీపడ్డారని ఆరోపించారు. ప్రాణహిత, ఇంద్రావతి నీటిపై అంచనాకు వచ్చాకే బనకచర్లపై ముందుకు వెళ్లాలన్నారు. గోదావరిలోకి ఉపనదుల నుంచి నీరు వచ్చే విషయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణలోని నాసిక్‌ అంటూ విచిత్రంగా చెప్పారు. ప్రాణహిత నుంచి గోదావరి జలాలు రాకుండా ఛత్తీస్‌గఢ్‌ అడ్డుకుంటోందని చెప్పారు. ప్రాణహిత నుంచి గోదావరి జలాలు రావడం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు కోసం మిగులు జలాలపై లెక్కలు తేల్చాల్సి ఉందన్నారు. జలాలులేకుండా రూ. 80,000 కోట్లతో పోలవరం-బనకచర్లను నిర్మించడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనని అభిప్రాయపడ్డారు.

Updated Date - Jul 17 , 2025 | 04:12 AM