Share News

Jagan: మా వాళ్లంతా మంచోళ్లు

ABN , Publish Date - May 23 , 2025 | 04:26 AM

మద్యం కుంభకోణంలో తాను ప్రమేయం లేనని మాజీ సీఎం జగన్ స్పష్టం చేశారు. తనపై రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

Jagan: మా వాళ్లంతా మంచోళ్లు

  • మద్యం స్కామ్‌తో వాళ్లకేం సంబంధం?

  • అసలు.. కుంభకోణం ఎక్కడ జరిగింది?

  • సాయిరెడ్డి చంద్రబాబుకు అమ్ముడుపోయాడు

  • వాసుదేవరెడ్డిని బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారు

  • బాలాజీ గోవిందప్ప నాకోసం ఎందుకు పని చేస్తారు?

  • పీఎస్సార్‌, ధనుంజయ్‌ రెడ్డి మంచి అధికారులు

  • నేను ఇక్కడే ఉన్నా.. అరెస్టు చేసుకోవచ్చు

  • వెన్నుపోటు దినంగా ‘జూన్‌ 4’: వైఎస్‌ జగన్‌

అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): ‘నా హయాంలో మద్యం స్కామ్‌ జరగలేదు! జరిగే అవకాశమే లేదు. నా చుట్టూ ఉన్న వాళ్లంతా మంచోళ్లు! వాళ్లను అన్యాయంగా వేధిస్తున్నారు’... అని మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘అసలు నా పాలనలో మద్యం స్కామ్‌ ఎక్కడ జరిగింది’ అని ప్రశ్నించారు. గురువారం తాడేపల్లి ప్యాలెస్‌లో ఎప్పట్లాగే ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో సుదీర్ఘంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...

  • అంతా పారదర్శకమే...

2014-19లో లిక్కర్‌ సేల్స్‌ పెంచుకుంటూ పోయారు. నా హయాంలో లిక్కర్‌ సేల్స్‌ తగ్గాయి. అలాంటప్పుడు స్కామ్‌ ఎలా జరుగుతుంది? ప్రతి మద్యం బాటిల్‌ మీదా క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించాం. అమ్మకం జరిగిన వెంటనే ఆన్‌లైన్‌లోకి వివరాలన్నీ వెళ్లిపోయాయి. ఇక స్కామ్‌కు ఆస్కారం ఎక్కడుంది? భయపెట్టి తప్పుడు సాక్ష్యాలను సృష్టించి, తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించి మద్యం స్కామ్‌ జరిగిందని ప్రచారం చేస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలో లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే మద్యం అమ్మకాలను సాగించింది. ప్రైవేటు షాపుల చేత ఎంపిక చేసుకున్న డిస్టిలరీలకు ఇండెంట్‌ ఇస్తే లంచాలు ఇస్తారా? లేక .. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి డైనమిక్‌గా, పారదర్శకంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా లైసెన్సు ఇవ్వలేదు. 2014-19 సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లిక్కర్‌ షాప్‌లకు రూ.1300 కోట్లు లబ్ధి చేకూరుస్తూ మూడు సంతకాలు చేసి బలమైన సాక్ష్యాధారాలతో సహా అడ్డంగా దొరికారు. దాని నుంచి తప్పించుకునేందుకే అంతకంటే పెద్దస్కామ్‌ జరిగినట్లుగా భేతాళ కథలను అల్లుతున్నారు.


  • సాయిరెడ్డి సాక్ష్యానికి విలువుందా?

వైసీపీకి ఎమ్మెల్యేల బలం లేదని.. మా పార్టీ నుంచి కొత్తగా ఎవరికీ రాజ్యసభ సీటు ఇవ్వలేమని తెలిసీ విజయ సాయిరెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా వల్ల చంద్రబాబుకూ, కూటమికీ మేలు జరుగుతుందని తెలిసీ ఇలా చేశారు. ప్రలోభాలకు లోనై తన రాజ్యసభ సభ్యత్వాన్ని చంద్రబాబుకు అమ్మేశారు. అలాంటి వ్యక్తి ఇచ్చే వాంగ్మూలానికి విలువేం ఉంటుంది? అప్పటి బేవరేజె్‌స ఎండీ వాసుదేవరెడ్డిని బెదిరించి, తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చాకే తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు చంద్రబాబు అనుమతించారు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో సూపరింటెండెంట్‌ సత్య ప్రసాద్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని అనూషను బెదిరించి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు.

  • కసిరెడ్డికి ఏం సంబంధం?

కసిరెడ్డి రాజశేఖరరెడ్డికి మద్యంతో ఏం సంబంధం? ఆయనకు ఐటీ సలహాదారు పదవి ఇచ్చాం. అయినా.. ఆయన విజయవాడకు వచ్చిందే తక్కువ. ఆయనను కూడా బెదిరించారు. అబద్ధాలు చెప్పకపోవడం వల్లే నిందితుడిని చేశారు. ఎంపీ మిథున్‌రెడ్డికి మద్యంతో ఏం సంబంధం? ఆయన లోక్‌సభలో వైసీపీ పక్ష నేత. ఆయనకు ఈ రాష్ట్రంతో ఏం సంబంధం? అప్పటి సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, నా పీఎస్‌ కృష్ణమోహన్‌రెడ్డికి మద్యం కుంభకోణంతో ఏం సంబంధం? ధనుంజయరెడ్డి సీఎంవోలో మద్యం శాఖ చూడలేదు. సీఎంవోకు ఒక్క మద్యం ఫైల్‌ వచ్చిందా? ఒక్క సంతకమైనా చూపించగలుగుతారా? ధనుంజయ రెడ్డి మచ్చలేని ఐఏఎస్‌ అధికారి!

  • బాలాజీ గోవిందప్ప ఎంతో గొప్ప!

బాలాజీ గోవిందప్ప ఫ్రాన్స్‌కు చెందిన వీకార్డ్‌ అనే మల్టీనేషనల్‌ కంపెనీలో హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌. ఆయన ఏపీలోనే ఉండరు. అసలు ఆయనకు టైమ్‌ ఉండదు. నా కంపెనీ డైరెక్టర్లు కాని వాళ్లు నాకోసం ఎందుకు పని చేస్తారు? గోవిందప్పకు భారతీ సిమెంట్స్‌లో షేర్లు ఉన్నాయి. నాకూ రిలయన్స్‌ షేర్లు ఉన్నాయి. అంతమాత్రాన నాదైపోతుందా?


  • పిల్లల పెళ్లిళ్లకు ముందు...

ధనుంజయరెడ్డి కుమారుడికి ఈ మధ్యనే పెళ్లి సంబంధం సెటిల్‌ అయింది. కృష్ణ మోహన్‌ రెడ్డి కూతురికి కూడా సంబంధం ఖాయమైంది. గోవిందప్ప కూతురికీ ఇటీవలే పెళ్లి ఖాయమైంది. పీఎస్సార్‌ ఆంజనేయులు డీజీపీ స్థాయి అధికారి. చాలా మంచి అధికారి. ఆయన రెండో కుమారుడికి పెళ్లి సంబంధం ఖాయమైంది. పిల్లల పెళ్లిళ్ల సమయంలో ఇలా అరెస్టులు చేయడం న్యాయమేనా?

  • ఐపీఎస్‌లను వేధిస్తారా?

డీజీ స్థాయి అధికారి సునీల్‌ దళిత అధికారి. ఆయన్ను సస్పెండ్‌ చేశారు. ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా తాతా, జాషువా, విశాల్‌ గున్నీ, కొల్లి రఘురామిరెడ్డి... తదితరులను వేధిస్తున్నారు. లిక్కర్‌ స్కామ్‌లో షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్న చంద్రబాబు అరెస్టవుతారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. రాక్షస పాలన సాగుతోంది. అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడి, కూటమి గెలిచిన రోజైన ‘జూన్‌ 4’ను రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినంగా జరుపుతాం.

  • వెల్‌కమ్‌... అరెస్టు చేసుకోవచ్చు

కేసుల్లో ఇరికించి అరెస్టులు చేస్తే ఏం చేయగలం? విజయవాడలోనే ఉంటా. ఎప్పుడైనా అరెస్టు చేసుకోవచ్చు వెల్‌కమ్‌! రాజకీయ కక్షలతో అరెస్టులు చేస్తూ వేధిస్తే.. దేవుడు పైనుంచి చూస్తున్నాడు జాగ్రత్త! ఎల్లకాలం ప్రతీకార చర్యలు సాగవు.

Updated Date - May 23 , 2025 | 04:30 AM